కొత్త సినిమా బాజీరావు మస్తానీ కోసం రణ్‌వీర్ సింగ్ ఎన్నో కష్టాలు పడుతున్నాడు. ఇది చరిత్రాత్మక పాత్ర కావడంతో బాగా శ్రద్ధ తీసుకుంటున్నాడు. మరాఠీ వీరుడు బాజీరావులా సహజంగా కనిపించడానికి గుండు కొట్టించుకోవడంతోపాటు మరాఠీ నేర్చుకుంటున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ తీస్తున్న ఈ ప్రేమకథా చిత్రంలో రణ్‌వీర్‌కు జోడీగా దీపికా పదుకొణే కనిపిస్తుందని సమాచారం. బాజీరావు పీశ్వా 18వ శతాబ్దానికి చెందిన మరాఠీ రాజనీతిజ్ఞుడు. సైనిక వ్యవహారాల్లోనూ నిపుణుడిగా చెబుతారు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా కూడా ముఖ్యపాత్రలో కనిపిస్తుందట. దీపిక, ప్రియాంక నటిస్తున్నప్పటికీ, వీరిద్దరిలో మస్తానీ పాత్ర ఎవరు చేస్తారో ఇప్పటికీ తెలియరాలేదు.
సినిమా షూటింగ్ కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని బాలీవుడ్‌వర్గాలు చెబుతున్నాయి. ‘బాజీరావు పాత్ర కోసం నేను మరాఠీ భాష, గుర్రపుస్వారీ నేర్చుకున్నాను. ఆయనలా మాట్లాడేందుకు చాలా శ్రమించాల్సి వస్తోంది. గుండు చేయించుకోవడమే కాదు శరీరాన్ని కూడా పాత్రకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకున్నాను. ఆయన జీవిత చరిత్ర చదివాను. సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆఖరు వరకు ముగుస్తుంది’ అని రణ్‌వీర్ వివరించాడు.
భన్సాలీకి ఎంతో ఇష్టమైన ఈ కథకు హమ్ దిల్ దే చుకే సనమ్ జంట సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్‌ను ఎంచుకుందామని మొదట అనుకున్నాడు. తరువాత ఏమైందో తెలియదు కానీ రణ్‌వీర్ తెరమీదికి వచ్చాడు. ఇదిలా ఉంటే కరణ్ జోహార్ త్వరలో తీయబోయే శుద్ధి సినిమా కోసం రణ్‌వీర్, దీపిక జోడీనే ఎంచుకోవాలని అనుకున్నాడు. మనోడు మాత్రం బాజీరావువైపే మొగ్గుచూపాడు. యశ్‌రాజ్ చోప్రా బ్యానర్ తీయబోయే కిల్ దిల్, జోయా అఖ్తర్ కొత్త సినిమా దిల్ దడఖ్‌నేదోలోనూ రణ్‌వీర్ సింగే హీరో. కిల్‌దిల్‌లో పరిణీతి చోప్రా హీరోయిన్‌గా కనిపిస్తుంది.
బాజీరావు కోసం బట్టతల
Published Sat, May 17 2014 10:52 PM | Last Updated on Sat, Sep 2 2017 7:28 AM
Advertisement
Advertisement