
రష్మికా మండన్నా
‘గీత గోవిందం’ చిత్రంతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా. తాజాగా ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో విజయ్–రష్మికల మధ్య లిప్‌లాక్ సన్నివేశంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ‘గీత గోవిందం’ సినిమాలోనూ ముద్దు సీన్ ఉందని, అది హిట్ అవడంతో ‘డియర్ కామ్రేడ్’ సినిమాలోనూ పెట్టారని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
దీనిపై రష్మిక మండన్నా స్పందిస్తూ– ‘‘లిప్‌లాక్ సన్నివేశం ఆధారంగా ఓ సినిమాని ఎలా అంచనా వేస్తారు? అది కరెక్ట్ కాదు. సినిమాలోని సన్నివేశం ముద్దుని డిమాండ్ చేసింది. నా పాత్రకు న్యాయం చేయాలంటే ఆ సీన్‌లో నేను నటించాలి. అందుకే నటించా. ఎవరైనా మొత్తం సినిమా చూసిన తర్వాత మాట్లాడాలి. ‘గీత గోవిందం’ సినిమాను హిట్ చేసినట్టే, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ సినిమాని మే 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment