రేటు తగ్గించుకోక తప్పలేదు..!
కిక్ 2 ఫెయిల్యూర్ కళ్యాణ్ రామ్ తో పాటు రవితేజ కెరీర్ ను కూడా ఇబ్బందుల్లో పడేసింది. ఈ మధ్యే సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ మహారాజ బలుపు, పవర్ సినిమాల తరువాత భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. కిక్ 2 సినిమాకు కూడా అదే స్ధాయిలో పారితోషికం అందుకున్న రవితేజ ఆ సినిమా ఫెయిల్యూర్ తో ఢీలాపడిపోయాడు. కెరీర్ గ్రాఫ్ పరంగానే కాదు రెమ్యూనరేషన్ పరంగా కూడా సినిమా ఫెయిల్యూర్ రవితేజను కష్టాల్లో పడేసింది.
రవితేజ ప్రస్తుతం బెంగాల్ టైగర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రచ్చ ఫేం సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సక్సెస్ ఇప్పుడు కీలకం కానుంది. కుర్ర హీరోల నుంచి కాంపిటీషన్ విపరీతంగా ఉండటంతో హిట్ ఇస్తే తప్ప రవితేజకు నెక్ట్స్ సినిమాలు దొరకని పరిస్థితి. దీంతో బెంగాల్ టైగర్ మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రవితేజ.
బెంగాల్ టైగర్ సినిమా తరువాత దిల్ రాజు బ్యానర్ లో ఓ కామెడీ ఎంటర్ టైనర్ కమిట్ అయ్యాడు రవితేజ.. ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు రవితేజ గత సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. భారీ ఫ్లాప్ తరువాత చేస్తున్న సినిమా కావటంతో పాటు రవితేజ మార్కెట్ కూడా ఆ స్ధాయిలో లేకపోవటంతో రెమ్యూనరేషన్ తగ్గించుకోక తప్పలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.