సరదాగా అన్నాను
సరదాగా అన్నాను. అది అంత దూరం తీసుకెళుతుందని ఊహించలేదు అంటోంది నటి రెజీనా. ఇంతకీ ఈ అమ్మడు ఏ విషయం గురించి మాట్లాడుతుందనేగా మీ సందేహం. రెజీనా కోలీవుడ్ తెరపై కని పించి చాలా కాలమే అయ్యింది. అలాగని పూర్తిగా తెరమరుగైపోయిందనే నిర్ణయానికి వచ్చేయకండి. టాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ను సంపాదించుకుంది. అక్కడ మంచి విజయాలను కూడా చవిచూసిన రెజీ నా తాజాగా కోలీవుడ్‌పై దండెత్తడానికి సిద్ధమవువుతోంది. ప్రస్తుతం తమిళంలోనే నెంజం మరప్పదిల్లై, మానగరం, శరవణన్ ఇరుక్క భయమేన్, జెమినీ గణేన్ సురుళీరాజనుమ్, మడై తిరందు వంటి ఐదు చిత్రాల్లో నటిస్తున్న ఆ బ్యూటీ త్వరలో బాలీవుడ్ రంగప్రవేశం చేయనుంది. ఈ సందర్భంగా రెజీనా చెప్పిన ముచ్చట్లు..
ప్ర: సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించిన అనుభవం గురించి?
జ: నెంజం మరప్పదిలె్లౖ చిత్రం ద్వారా తొలిసారిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్నాను. ఎస్‌జే.సూర్య కథానాయకుడు. మరో నాయకిగా నందిత నటిస్తున్నారు. ఇందులో నటించడానికి అంగీకరించినప్పుడు సెల్వరాఘవన్ చిత్రంలో నటించడం కష్టం అని చాలా మంది భయపెట్టారు. అయితే నేను వాటిని పట్టించుకోలేదు. పాత్రను వివరించి, సరైన నటనను రాబట్టుకోవడంలో సెల్వరాఘవన్ చాలా సహనశీలి. షూటింగ్‌లో ఆయన్ని నేను ఒక అధ్యాపకుడిగానే చూశాను. చిత్రాన్ని పూర్తిగా చూసినప్పుడు నేనేనా అలా నటించింది అని ఆశ్చర్యపోయాను. ఇది దెయ్యం కథా చిత్రం కాదు. అయితే నా పాత్ర దెయ్యమా? మామూలు అమ్మాయా? అన్నది చివరి వరకూ తెలియదు. ఇప్పటి వరకూ నేను నటించిన చిత్రాల్లో నెంజం మరప్పదిలె్లౖ ప్రత్యేకంగా ఉంటుంది.
ప్ర: తెలుగు, తమిళ భాషల్లో బిజీగా నటిస్తున్నట్లున్నారు?
జ: ఈ విషయంలో ఒక ప్రణాళిక అంటూ ఏమీ లేదు. అలా కుదురుతోంది అంతే. మానగరం, మడై తిరం దు చిత్రాలు ఏక కాలంలో రెండు భాషల్లోనూ తెరకెక్కుతున్నాయి. నాకు రెండు భాషల్లోనూ మార్కెట్ ఉంది. అదే విధంగా నేను తమిళంలో నటించిన చిత్రాలు తెలుగులో అనువాదమవుతున్నాయి.
ప్ర: తమిళంలో చాలా గ్యాప్ రావడానికి కారణం?
జ: తెలుగులో ఆశించిన అవకాశాలు వస్తుండడంతో పూర్తి గా అక్కడే శ్రద్ధ పెట్టాను. తమిళంలో అవకాశాలు వస్తున్నా, కాల్‌షీట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితి. అంతేగాకుండా తమిళంలో ఒక చిత్రం చేసినా వైవిధ్యంగా ఉండాలి. ప్రేక్షకుల మనస్సుల్లో గుర్తిండిపోవాలని కోరుకున్నాను. ప్రస్తుతం చేస్తున్నవి అలాంటి చిత్రాలే.
ప్ర: రెండు భాషల ప్రేక్షకుల గురించి?
జ: తెలుగు ప్రేక్షకులు ఎప్పటి విజయాలను అప్పుడే ఎం జాయ్ చేస్తారు. తాజా చిత్రాల పాత్రలనే గుర్తుంచుకుం టారు. ఆ తరువాత వాటిని మరచిపోతారు. తమిళ ప్రేక్షకులు అలా కాదు. ఇక వైవిధ్యభరిత పాత్ర, అద్భుతమైన పాత్రలో నటిస్తే దాన్ని చాలా కాలం తరువాత కూడా అభినందిస్తూనే ఉంటారు. కేడిబిల్లా కిలాడిరంగా చిత్రంలో నేను నటించిన పాప్పా పాత్రకు విశేష ఆదరణ లభించింది. ఇప్పటికీ నేను ఇతర ప్రాంతాలకు షూటింగ్‌కు వెళ్లినప్పుడు పాప్పా అని అభిమానంగా పిలుస్తుంటారు.
ప్ర: బాలీవుడ్ రంగప్రవేశం చేయనున్నారట?
జ: అవును. ఒక హిందీ చిత్రంలో నటించనున్నాను. ముగ్గురు అంధులు బ్యాంక్ రాబరింగ్ చేసి కోట్ల రూపాయలు దోచుకునే ఇతివృత్తంతో తెరపైకి వచ్చిన చిత్రం ఆంఖే. దానికి సీక్వెల్‌గా రూపొందనున్న చిత్రంలో నటించనున్నాను. ఇది ముగ్గురు అంధులు ఒక పేకాట క్లబ్‌లో ఎలా దోచుకుంటారన్న ఇతివృత్తంతో తెరకెక్కనుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, అనిల్‌కపూర్ తదితర ప్రముఖ నటులు నటించనున్నారు. ఈ చిత్రం జనవరిలో ప్రారంభం కానుంది.
ప్ర: వివాహ వదంతుల గురించి?
జ: అదా సరదాగా అన్నాను. అది అంత దుమారం రేపుతుందని భావించలేదు. సోషల్‌మీడియా ద్వారా నా అభిమానులకు చిన్న షాక్ ఇవ్వాలని త్వరలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానని పోస్ట్ చేశాను. అందుకు రియాక్ష¯ŒS ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దామనుకుంటే నిప్పంటించిన అడవిలా పెద్ద కలకలాన్నే సృష్టించింది.
ప్ర: సరే, మరి పెళ్లెప్పుడూ?
జ: నాకు ఏ విషయంలోనూ ముందుగా ప్రణాళిక ఉండదు. అయినా ఏదైనా విధిని బట్టే జరుగుతుంది. పెళ్లి ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది. ఎప్పుడు జరిగినా నాది ప్రేమ వివాహమే అవుతంది.