అప్పుడు నా అంత చెడ్డవాళ్లు ఉండరు!
‘‘సెలబ్రిటీ అనేది పెద్ద బాధ్యత. అందరి దృష్టి ఎప్పుడూ వాళ్ల మీద ఉంటుంది. అందుకే మాట్లాడే విధానం, ప్రవర్తన బాగుండాలి. రోల్ మోడల్స్‌గా కూడా తీసుకుంటారు కాబట్టి, వీలైనంతవరకూ మంచి పనులు చేయడానికే ట్రై చేస్తా’’ అంటున్నారు రెజీనా. సాయిధరమ్ తేజ్ సరసన ఆమె నటించిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఈ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా రెజీనాతో జరిపిన ఇంటర్వ్యూ...
మీకెలాంటి పేరొస్తుందని ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఒప్పుకున్నారు?
సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి పేరొస్తుందో తెలియదు. ఇలాంటి పేరు రావాలని నేనీ సినిమా ఒప్పుకోలేదు. ఈ సినిమాకి చేసిన ప్రతి టెక్నీషియన్ చాలా టాలెంటెడ్. దర్శకుడు హరీష్ శంకర్, కెమెరామ్యాన్ రాంప్రసాద్... అన్నింటికీ మించి ‘దిల్’ రాజుగారి బ్యానర్. స్క్రిప్ట్, అందులో నా క్యారెక్టర్ సీత... నచ్చిన విషయాలు. అందుకే ఈ సినిమా చేశాను.
అంటే.. పెద్ద బ్యానర్, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఉన్న సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారా?
మంచి నిర్మాత ఉంటే క్వాలిటీ సినిమా వస్తుంది. అలాగే, మంచి కెమెరామ్యాన్ ఉంటేనే సినిమా బాగా వస్తుంది. దర్శకుడికి టాలెంట్ లేకపోతే మంచి ప్రొడెక్ట్ రాదు. అందుకని, ఒక సినిమా ఒప్పుకునే ముందు ఇవన్నీ తప్పకుండా ఆలోచిస్తాను. ఏ సినిమా చేసినా మంచి పేరు రావాలనే చిన్న స్వార్థం ఉంటుంది. ఈ చిత్రం నాకా పేరు తెస్తుందనే నమ్మకం ఉంది.
సీత పాత్ర మీకు గ్లామర్ పరంగా పేరు తెస్తుందా? లేక పర్ఫార్మెన్స్ పరంగానా?
రెండు రకాలుగా పేరు వస్తుంది. సీత అమాయకురాలు. కానీ, ఆ అమాయకత్వం ఇతరులకు తెలియనివ్వకుండా మ్యానేజ్ చేస్తుంది. అక్కడ యాక్టింగ్‌కి అవకాశం ఉంది. గ్లామరస్ సీన్స్‌కి కూడా చాలా స్కోప్ ఉంది కాబట్టి, ఆ విధంగా కూడా పేరొస్తుంది.
హోమ్లీ ఇమేజ్ నుంచి బయట పడటానికే ఇలా గ్లామర్‌కి స్కోప్ ఉన్న పాత్ర ఒప్పుకున్నారా?
‘రెజీనా గ్లామరస్ హీరోయిన్ కాదు’ అని అందరూ అనేవారు. అలా ఎందుకంటున్నారో అర్థమయ్యేది కాదు. నాకు అవకాశం వచ్చిన పాత్రలు చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు గ్లామరస్‌గా కనిపించడానికి అవకాశం వచ్చింది. గ్లామరస్‌గా కనిపించడం అంత సులువు కాదు. దానికి హార్డ్‌వర్క్ చేయాలి.
హార్డ్ వర్కా.. ఏం చేయాలి?
రియల్ లైఫ్‌లో నేను గ్లామరస్ పర్సన్ కాదు. అందుకు భిన్నంగా కనిపించడం కష్టమే. ఈ సినిమాలో చీరల్లో కూడా కనిపిస్తాను. నా పొట్ట మీద చిన్న పుట్టుమచ్చ ఉంటుంది. చీరలో కనిపించే ప్రతి సన్నివేశంలోనూ ఆ పుట్టుమచ్చ కనిపిస్తుంది. వినడానికి ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ, చేసేవాళ్లకి కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే, ఇప్పటివరకూ చేసిన పాత్రలు నా ఫిజికల్ బ్యూటీని పెద్దగా ఆవిష్కరించలేదు. వల్గర్‌గా అనిపించకుండా హరీష్ శంకర్‌గారు నన్ను బాగా చూపించారనే చెప్పాలి
స్కిన్ షో చేసే హీరోయిన్స్‌కే అవకాశాలు వస్తాయనే అభిప్రాయంతో ఏకీభవిస్తారా?
అలా ఏం లేదండి. స్కిన్ షో అనేది ఒక భాగమే. పర్ఫార్మెన్స్ చేయాలి. అప్పుడే అవకాశాలు వస్తాయి. మా అంతట మేం ఇష్టపడో, కావాలనో స్కిన్ షో చేస్తే తప్పు. క్యారెక్టర్‌కి అవసరం ఉంటేనే ఎవరైనా చేస్తారు. హోమ్లీగా, గ్లామరస్‌గా ఏం చేసినా ఏదో ఒక కామెంట్ రావడం ఖాయం. హోమ్లీగా కనిపిస్తే, ‘గ్లామరస్ క్యారెక్టర్స్‌కి పనికి రాదు’ అనేస్తారు.
ఈ చిత్రంలో ఓ ముద్దు సన్నివేశం చేయడానికి సాయిధరమ్ ఇబ్బంది పడితే, మీరు ఎంకరేజ్ చేశారనే టాక్ ఉంది?
ఈ టాక్ ఎక్కణ్ణుంచి వచ్చింది? ఇలాంటి ఊహలు ఎవరికి వస్తాయో కానీ, భలే ఊహించేస్తారు.
ఒకవేళ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే, బికినీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
లేదు. నాకంత కంఫర్ట్‌గా అనిపించదు.
ఎందుకని బికినీకి నో అంటున్నారు?
ఇంతకుముందుకన్నా నా ఫిజిక్ ఇప్పుడు బాగుంది. అయితే ఈ ఫిజిక్ బికినీకి సూట్ కాదు.
ఒకవేళ సూట్ అవ్వాలంటే ఎక్కడ తగ్గాలనుకుంటున్నారు?
కొంచెం స్టమక్ తగ్గితే బాగుంటుందనుకుంటున్నా. తగ్గించే ప్రయత్నంలో ఉన్నా (నవ్వుతూ).
మీ లుక్స్, నటనపరంగా భేష్. కానీ, స్టార్ హీరోల సరసన అవకాశాలు తెచ్చుకోలేకపోతున్నారేంటి?
ఏమో నాక్కూడా తెలియడంలేదు. తెలిస్తే, అవకాశాలు తెచ్చుకోవడానికి ఏదైనా చేసేదాన్ని కదా. కానీ, ప్రతిదానికీ ఒక టైమ్ ఉంటుందంటారు. బహుశా నాకా టైమ్ రాలేదేమో.
మహేశ్‌బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో చేయాలని లేదా?
ఎందుకుండదు? ‘ఇఫ్ యు వర్క్ విత్ బెస్ట్.. దట్ మీన్స్ యు ఆర్ ది బెస్ట్’ అంటుంటారు. సో.. నా లుక్స్ గుడ్‌గా ఉంటాయని తెలుసు. ఇప్పుడు బెస్ట్ కూడా అనిపించుకోవాలనుకుంటున్నాను.
మీకు మీరుగా ఎవర్నీ అవకాశాలు అడగరా?
నాకలా అడగడం ఇష్టం ఉండదు. ఈగోతో చెబుతున్న మాట కాదిది. ఒకవేళ నేను సూట్ అవుతానని అనిపిస్తే, వాళ్లే పిలుస్తారు. నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. కానీ, ఆ ఫ్రెండ్‌షిప్‌ని వాడుకుని, ‘నాకో అవకాశం ఇవ్వండి. మీ నెక్ట్స్ సినిమాకి నన్ను గుర్తుపెట్టుకోండి’ అని అడిగేంత స్వార్థపరురాల్ని కాదు.
పాటలకు, రొమాంటిక్ సీన్స్‌కి పరిమితమైతే, సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినే అవకాశం లేదా?
ఆడియన్స్‌కి హీరో ఓరియంటెడ్ మూవీస్ ఇష్టం. హీరోయిన్స్ గ్లామరస్‌గా కనిపించాలని కోరుకుంటారు. ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గట్టుగా సినిమాలు, ఆర్టిస్టుల పాత్రలు ఉండాలి. అప్పుడే సినిమా సక్సెస్ అవుతుంది. ప్రేక్షకులకు నచ్చేది చేస్తున్నప్పుడు ఆత్మాభిమానం దెబ్బతినే అవకాశం ఎక్కడుంది?
సినిమా ఇండస్ట్రీలో సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయే సంఘటనలు ఎదురైతే ఎలా ఎస్కేప్ అవుతారు?
ఇప్పటివరకూ అలాంటిది రాలేదు. ఒకవేళ వస్తే, ఇగ్నోర్ చేసేస్తాను. ఆ సిచ్యుయేషన్‌కి దూరంగా వెళ్లిపోతాను. నాకు ఓపిక ఎక్కువ. ఎవరైనా నన్నేమైనా అంటే, సెలైంట్‌గా ఉంటాను. అదే వ్యక్తి ఓ పది, పన్నెండు సార్లు ఇరిటేట్ చేస్తే, అప్పుడు నా అంత చెడ్డదాన్ని చూసి ఉండరు.
.............. ఆ టేక్ ఓకే కాగానే ఏడ్చేశాను!...........
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ కోసం న్యూజెర్సీలో షూటింగ్ చేశాం. అక్కడ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలో రివర్ దగ్గర నటించాల్సి వచ్చింది. తేజ్ చక్కగా కోట్, బూట్ అంటూ ఫుల్ కవర్ చేసుకున్నాడు. నాకా అవకాశం లేదు. ఎముకలు కొరికే చలికి వణుకు పుట్టడంతో దృషి ్టఅంతా చలి మీదే ఉండేది. డైలాగ్స్ మర్చిపోయేదాన్ని. అసలు మాట్లాడటానికే కష్టమయ్యేది. ఆ ఒక్క షాట్ కోసమే 34 టేక్స్ తీసుకున్నాను. టేక్ ఓకే కాగానే ఏడ్చేశాను. ‘మనకు నటన రాదేమో’ అనే బాధతో ఏడుపొచ్చింది. ఆ తర్వాత నవ్వుకున్నాను.