నా జీవితం ఏ మగాడి సాయం లేకుండా సాగుతోంది: రేణు | Renu Desai Emotional Comments On Spreading Rumours | Sakshi
Sakshi News home page

నా జీవితం ఏ మగాడి సాయం లేకుండా సాగుతోంది: రేణు

Published Fri, Feb 14 2020 7:34 PM | Last Updated on Fri, Feb 14 2020 8:03 PM

Renu Desai Emotional Comments On Spreading Rumours - Sakshi

తనపై వస్తున్న రూమర్స్‌ మీద నటి రేణు దేశాయ్ ఘాటుగా స్పందించారు. మాజీ భర్త పవన్ కల్యాణ్ ఖరీదైన ఇంటిని రేణు దేశాయ్‌కు బహుమతిగా ఇచ్చారని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఆద్య, అకీరాల కోసం హైదరాబాద్‌లో పవన్‌ ఇల్లు కొనిచ్చినట్టు వార్తలు షికార్లు చేశాయి. అంతేకాకుండా ప్రస్తుతం పుణేలో ఉంటున్న రేణు దేశాయ్.. పవన్ కొనిచ్చిన ఇంటికి మారుతున్నట్లు ఆ వార్తల్లో సారాంశం. అయితే.. ఆ వదంతులను రేణు దేశాయ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తప్పడు వార్తలు తనపై ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో తన కష్టార్జితంతో ఇల్లు కొనుక్కున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ రూమర్స్‌పై రేణు దేశాయ్  సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. రేణు మునుపెన్నడూ లేనంతగా ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశారు.  (రేణూ దేశాయ్ హార్ట్ టచింగ్ మెసేజ్)

రేణు దేశాయ్ ఫేస్‌బుక్ పోస్ట్
నేను ఇప్పుడు మీ అందరికీ ఈ విషయం గురించి వివరణ ఇవ్వడానికి ఒకే ఒక్క కారణం, నిన్నటి నుండి నాకు మీడియా వాళ్ళ నుండి, స్నేహితుల నుండి వస్తున్న ఎన్నో మెసేజెస్, ఫోన్ కాల్స్ ఆధారంగా నాకు ఈ విషయం చాలా సీరియస్ అయింది అని అర్థమయ్యింది. వాళ్ళు చెప్పింది విని నాకు చాలా బాధ వేసింది అందుకే ఈ వివరణ...
ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన ఆత్మగౌరవం
ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన నిజాయితీ
ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన అస్తిత్వం
ఇది మీకు తెలియనిదా..?

నేను, నా జీవిత మనుగడ కోసం ఒంటరిగా, తీవ్రంగా, నిబద్దతతో ఎంతగానో శ్రమిస్తున్నాను… శ్రమిస్తూనే పోరాడుతున్నాను. ఇప్పటి వరకూ కనీసం మా తండ్రి గారి దగ్గర్నుంచి కూడా ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించలేదు, పొందలేదు. అలాగే, నేనిప్పటివరకూ నా మాజీ భర్త దగ్గర్నుంచి కూడా ఎలాంటి అన్యాయ పూరితమైన భరణాన్నీ ఆశించలేదు, పొందలేదు. అది నా వ్యక్తిత్వం!!! అయినప్పటికీ మీరు నా గురించి అన్యాయంగా, అసంబద్దమైన అబద్దపు వార్తలను ప్రచారం చేస్తూనే ఉన్నారు! మీరందరూ అనుకుంటున్నట్టు, ప్రచారం చేస్తున్నట్టు ఇప్పుడు హైదరాబాద్‌లో నేను కొన్న ఫ్లాట్ నిజంగా మాకెవరూ కొనివ్వలేదు.

అది నా కష్టార్జితంతో ఒక్కో రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న నా సొంత ఇల్లు. అది నా మాజీ భర్త మాకు కొనిచ్చారన్న ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల నా నిజాయితీకీ, ఆత్మగౌరవానికీ, నా అస్థిత్వానికీ, చివరగా నా ఉనికికే ప్రమాదం సంభవిస్తుందనే చిన్న ఆలోచన మీకెవ్వరికీ రాలేదా? నాకు తెలిసినంతవరకూ, ఈ వార్తకూ నా మాజీ భర్తకూ ఎలాంటి సంబంధం ఉండి ఉండదు. కనీసం ఈ ప్రచారం ఆయన దృష్టికి కూడా వెళ్ళి ఉండదు. అలాంటిది, ఒక వార్తను రాసేటప్పుడు, అది నిజమో కాదో నిర్ధారించుకోకుండానే, అత్యుత్సాహంతోనో, తొందరపాటుతోనో, లేక మీ సంస్థల మనుగడ కోసమో, ఒక ఒంటరి స్త్రీ మనుగడను ప్రమాదంలో నెట్టడం ఎంతవరకూ సమంజసం? 

ఇలాంటి వార్తలు ఎంత వేగంగా ప్రజల్లోకి వెళ్తాయో మీకు తెలియదా? ప్రజలు ఈ అబద్దపు వార్తను నిజమని నమ్మితే, సంఘంలో నాకున్న గౌరవం మసకబారదా? ఏది జరిగినా చెక్కు చెదరని నా అస్థిత్వం, వ్యక్తిత్వం, నా ఆత్మగౌరవం, నేను అనే ఒక నిజం అసత్యం అయిపోదా? నా ఆత్మ ఎంత ఘోషిస్తుంది! ఎంతలా చితికిపోతుంది!? దయచేసి ఆలోచించండి.. నా ఈ జీవితంలో ఇప్పటివరకూ ఏ మగవాడి సాయం లేకుండా సాగుతున్న నాలాంటి ఒంటరి తల్లి జీవన గమనానికీ, పోరాటానికి గౌరవం ఇవ్వకపోయినా సరే… దయచేసి, ఇలా కించపరచకండి. నేను మీతో పంచుకుంటున్న ఈ బాధను సరిగ్గా అర్థం చేసుకోకుండా మళ్ళీ నాకూ, నా మాజీ భర్త అభిమానులకూ మధ్య, దయచేసి ఎలాంటి గొడవలూ సృష్టించకండి అంటూ రేణు దేశాయ్ సుదీర్ఘమైన పోస్ట్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

వారిది నా రక్తం.. పవన్‌ రక్తం కాదు: రేణూదేశాయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement