
పాక్ యువతికి బాలీవుడ్ నటుడి వార్నింగ్
ముంబై: పాకిస్తాన్ యువతిపై బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ మండిపడ్డారు. మాటలు తిన్నగా మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. గూఢచర్యం కేసులో భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించడం పట్ల రిషి కపూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతిపక్రియకు పాకిస్తాన్ విఘాతం కలిగిస్తోందని ట్విటర్ లో మండిపడ్డారు.
‘నటులు, సినిమాలు, క్రీడలు మొదలైన వాటిద్వారా రెండు దేశాల మధ్య శాంతిస్థాపనకు భారత్ ప్రయత్నిస్తుంటే పాకిస్తాన్ మాత్రం విద్వేషాన్నే కోరుకుంటోంద’ని రిషి కపూర్ ట్వీట్ చేశారు. దీంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తిడుతూ పాకిస్తానీయులు ట్వీట్లు పెట్టారు. ఒక యువతి అసభ్యకర పదజాలంతో దూషించింది. దీనిపై రిషి కపూర్ ఘాటుగా స్పందించారు. ‘మాటలు సరిగా మాట్లాడడం నేర్చుకో. పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో నీ తల్లిదండ్రులు నీకు నేర్పించలేదనుకుంటా’ అని బదులిచ్చారు.
'ఎవరితో ఎలా మాట్లాడాలో నా తల్లిదండ్రులు బాగానే నేర్పించారు. నీతి సూత్రాలతో మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోలేరు. గూఢచారుల పట్ల ఇతర దేశాలు ఎలా వ్యవరిస్తున్నాయో తెలుకోవాల'ని పాక్ యువతి సలహాయిచ్చింది. తాను అసభ్య పదజాలం వాడినట్టు రిషికపూర్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె తన ట్విటర్ లో పేర్కొంది. తాను చేసిన ట్వీట్లు తొలగించానని అబద్దాలు చెబుతున్నారని తెలిపింది. రిషి మాటలను నమ్మి ఎన్డీటీవీ తనపై అసత్య కథనాలు రాసిందని వాపోయింది.