
పూరి రాసిన ప్రేమకథ!
‘‘నా సినిమాలు డార్క్‌గా, హారర్, మాఫియా నేపథ్యంలో ఉంటాయి. ప్రేమకథలు తీయడం నాక్కొంచెం కష్టమే. రొమాంటిక్ ప్రేమకథలు తీయాలంటే నాకన్నా పూరీ బెస్ట్’’ అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. సాయిరామ్‌శంకర్ హీరోగా గోపీగణేశ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రోమియో’. ‘పూరి రాసిన ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించడం ఓ విశేషమైతే... రవితేజ ఇందులో ప్రత్యేక పాత్ర పోషించడం మరో విశేషం. టచ్‌స్టోన్ దొరైస్వామి నిర్మాత.
సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని రామ్‌గోపాల్‌వర్మ ఆవిష్కరించి ఎస్వీ కష్ణారెడ్డికి అందించారు. వర్మ ఇంకా మాట్లాడుతూ- ‘‘ ‘రోమియో జూలియట్’ నా ఫేవరెట్ సినిమా. ‘రోమియో’ అని ఈ సినిమాకు టైటిల్ పెట్టడం బావుంది. పాటల్లో, ప్రచార చిత్రాల్లో సాయిరామ్ ఎనర్జీ ఏంటో తెలుస్తోంది’’ అన్నారు. షూటింగ్ పనిమీద అబ్రాడ్ వెళ్లినప్పుడు రోమియో, జూలియట్ పుట్టిన ప్రాంతానికి వెళ్లానని, అక్కడే ఈ కథ రాశానని, ఆ కథకు నా తమ్ముడు కథానాయకుడవ్వడం ఆనందంగా ఉందని పూరి జగన్నాథ్ చెప్పారు. కథ ఇచ్చిన అన్నయ్యకు, ప్రత్యేక పాత్ర పోషించిన రవితేజకు కృతజ్ఞతలని సాయిరామ్‌శంకర్ చెప్పారు. సినిమా విజయంపై నిర్మాత నమ్మకం వెలిబుచ్చారు.