చిన్నారి ఫ్యాన్ కు స్టార్ హీరో ఫోన్
మన హీరోలు తెర మీదే కాదు.. తెర వెనుక కూడా హీరోలుగా నిరూపించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా ఓ హాలీవుడ్ హీరో తన అభిమాని కోసం స్పందించిన తీరు అందరిని ఆకట్టుకుంది. హాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సీరీస్ గా పేరు తెచ్చుకున్న డెడ్ పూల్ తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో ర్యాన్ రెనాల్డ్స్. అతీంద్రియ శక్తులతో తనను అంతమొందించాలనుకున్న వారి ఆట కట్టించే హీరో కథలో ఈ సినిమా తెరకెక్కింది.
డెడ్ పూల్ సినిమా చూసిన ఐదేళ్ల చిన్నారి డేనియల్ డానింగ్.. ర్యాన్ రెనాల్డ్స్ కు వీరాభిమానిగా మారిపోయాడు. ప్రస్తుతం బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న డేనియల్, మరికొద్ది రోజుల్లో మాత్రమే జీవిస్తాడని తెలియడంతో అతని అభిమాన హీరో స్పందించాడు. తన బుల్లి అభిమాని స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడాడు.
తాను ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నాడు, ఆ సినిమా ఎలా ఉండబోతుంది అన్న విషయాలను ఆ చిన్నారితో పంచుకున్నాడు. అంతేకాదు ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నానని, త్వరలోనే స్వయంగా వచ్చి కలుస్తానని మాట ఇచ్చాడు. తన అభిమాన హీరో కాల్ చేయడానికి ముందు వరకు చాలా నీరసంగా కనిపించిన తన కొడుకు ర్యాన్ ఫోన్ చేసిన తరువాత చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడని.. ఆ చిన్నారి తల్లి తెలిపారు.