
తమిళసినిమా: బాల తారలుగా రంగప్రవేశం చేసి, ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి కథానాయకి స్థాయికి చేరి రాణించిన వారు చాలామందే ఉన్నారు. సింపుల్‌గా చిన్న ఉదాహరణ చెప్పాలంటే అతిలోక సుందరి శ్రీదేవినే. తాజాగా తనకుంటూ నటిగా ఒక స్థానం ఉంటుందనే ప్రగాఢ నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది నటి సాధిక. ఇటీవల తెరపైకి వచ్చిన దర్శకుడు సుశీంద్రన్ చిత్రం నెంజిల్ తుణివిరుందాల్‌లో కథానాయకుడు సందీప్‌కు చెల్లెలిగా నటుడు విక్రాంత్‌కు చెలియగా వైవిధ్య పాత్రలో నటించి మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సంతోషాన్ని తను పత్రికల వారితో పంచుకుంటూ తాను ఎంటెక్ కరస్పాండెంట్ కోర్స్‌లో చేస్తున్నానని తెలిపింది. అయితే రెండేళ్ల వయసులోనే అంటే మాటలు కూడా రాని వయసులో కెమెరా ముందుకొచ్చానని చెప్పింది.
మంగై అనే సీరియల్‌లో బాలతారగా బుల్లితెరపై కనిపించానని, ఆ తరువాత వీరనడై చిత్రంతో వెండితెరపైకి వచ్చానని చెప్పింది. ఇక కాస్త ఎదిగిన తరువాత చుట్టి ఛానల్‌లో మూడేళ్ల పాటు యాంకర్‌గానూ, పలువురు బాలతారలకు గొంతును అరువిచ్చిన అనుభవంతో చిత్తి, కోలంగళ్ వంటి మెగా సీరియళ్లలో మంచి పాత్రల్లో నటించానని, పలు లఘు చిత్రాలు చేశానని చెప్పింది. నటి రేవతి దర్శకత్వంలో రూపొందిన కయల్‌విళి లఘు చిత్రంలో టైటిల్ పాత్రధారిని తానేనంది. ఇక బెర్లిన్ అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికైన తొలి తమిళ లఘు చిత్రం తాను నటించిన ఎన్ వీట్టుట్రిల్ ఒరు మా మరం అని గర్వంగా చెప్పుకోగలనంది. నటిగా తనకు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం నాన్ మహాన్ అల్ల అని అంది. నెంజిల్ తుణివిరుందాల్ చిత్రంలో హీరో సందీప్‌కు చెల్లెలిగా, విక్రాంత్‌కు ప్రేయసిగా నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించే అవకాశాన్ని సుశీంద్రన్ ఇచ్చారని చెప్పింది. నటనకు అవకాశం ఉన్న పాత్ర ఏదైనా చేస్తానంటోంది.
Comments
Please login to add a commentAdd a comment