బజరంగీ భాయ్‌జాన్-రివ్యూ | salman khan bajarangi bhaijan-Movie Review | Sakshi
Sakshi News home page

బజరంగీ భాయ్‌జాన్-రివ్యూ

Published Sat, Jul 18 2015 12:56 PM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

బజరంగీ భాయ్‌జాన్-రివ్యూ

బజరంగీ భాయ్‌జాన్-రివ్యూ

*మానవత్వం పరిమళించే మంచి సినిమాకు స్వాగతం!

చిత్రం - బజరంగీ భాయ్‌జాన్ (హిందీ), తారాగణం - సల్మాన్‌ఖాన్, కరీనా కపూర్ ఖాన్, బేబీ హర్షాలీ మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్దిఖీ, శరత్ సక్సేనా, ఓంపురి, కథ - వి. విజయేంద్రప్రసాద్, స్క్రీన్‌ప్లే - కబీర్ ఖాన్, పర్వీజ్ షేక్, అసద్ హుస్సేన్, సంగీతం - ప్రీతమ్ చక్రవర్తి, కెమేరా - అసీమ్ మిశ్రా, ఎడిటింగ్ - రామేశ్వర్ ఎస్. భగత్, నిర్మాతలు - సల్మాన్‌ఖాన్, 'రాక్‌లైన్' వెంకటేశ్, దర్శకత్వం - కబీర్‌ఖాన్
 ............................................

అన్నీ లెక్కలేసుకొనే చేస్తే దాన్ని జీవితమనీ, మనల్ని మనుషులనీ ఎవరూ అనరు. అనలేరు. యంత్రానికి లేని మనసుంది కాబట్టే, మనం ప్రత్యేకమయ్యాం. కొన్ని భావాలకూ, బంధాలకూ లాజిక్‌లు ఉండవు. అది అంతే! కానీ, మనకు మనమే కులం, మతం, ప్రాంతం, భాష, దేశం - అనే విభజన రేఖలు గీసుకున్నాం. మన లాంటి తోటి మనిషిని కూడా ఈ మరుగుజ్జు ప్రమాణాలతో జడ్జ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సాటివాడికి చేయందించడానికి కూడా ఈ లెక్కలు వేస్తాం.

 

సరిగ్గా అలాంటి మనస్తత్త్వమున్న మన లాంటి ఒక వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో తన దేశం, మతం కాని ఒక చిన్నారికి దగ్గరైతే? మాటలు రాని ఆరేళ్ల ఆ మూగ చిన్నారిని సురక్షితంగా తన ఇంటికి చేర్చడానికి జీవితాన్నే రిస్క్‌లో పడేసుకుంటే? ఆ క్రమంలో డబ్బు, ప్రేమ, పెళ్ళి, చివరకు ప్రాణం కూడా పణంగా ఒడ్డడానికి సిద్ధపడితే? మనుషుల మధ్య పెరగాల్సింది ప్రేమే తప్ప, కుల, మత, ప్రాంతాల పేరిట ద్వేషం కాదని గుర్తు చేస్తూ - వెండితెరపై చాలా కాలం తరువాత గుబాళించిన మానవతా పరిమళం 'బజరంగీ భాయ్‌జాన్'
 
మాట రాని(వ్వని) పసిపాప కథ!

ఈ సినిమా కథ చాలా సింపుల్. పాకిస్తాన్‌లో ఉన్న కాశ్మీర ప్రాంతానికి చెందిన ఒక మహమ్మదీయ కుటుంబం. గొర్రెలు కాసుకొనే ఆ భార్యాభర్తల ఏకైక సంతానం - షాహిదా (బేబీ హర్షాలీ మల్హోత్రా). ఆరేళ్ళ వయసొచ్చినా ఇంకా మాటలు రాని పసిపాప. భారతదేశంలోని ఢిల్లీలో ఉన్న ప్రసిద్ధ దర్గాకు వచ్చి మొక్కుకుంటే, మాటలు వస్తాయని ఎవరో అంటారు. తండ్రి ఒకప్పుడు సైన్యంలో పనిచేసినవాడు కాబట్టి, అతనికి వీసా వచ్చే అవకాశం లేదనే తీర్మానానికి వస్తారు. గొర్రెల్ని అమ్మేసి, ఆ వచ్చిన డబ్బుతో తల్లి, పిల్లను తీసుకొని, పాస్‌పోర్ట్, వీసాలతో రైలులో సరిహద్దు దాటి వస్తుంది. దర్గాలో ప్రార్థనలు చేసి, రైలులో తిరిగొస్తున్నప్పుడు అనుకోకుండా పాప తప్పిపోతుంది. మాటలు రాని ఆ పాప కురుక్షేత్రకు వచ్చిన పవన్ కుమార్ చతుర్వేదీ (సల్మాన్‌ఖాన్)కు తారసపడుతుంది. మెడలో ఆంజనేయుడి గద బొమ్మను లాకెట్‌గా వేసుకున్న వీర హనుమద్భక్తుడైన పవన్‌ను అందరూ ముద్దుగా 'బజరంగీ' అని పిలుస్తుంటారు.

అందరిలానే ఆ పసిపాపను మొదట వదిలించుకుందామని అనుకున్నా, బజరంగీలోని మానవత్వం ఒప్పుకోదు. తండ్రి పోవడంతో, నాన్న ఫ్రెండ్ (తెలుగులో చిరంజీవి 'ముఠామేస్త్రి' సహా అనేక చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు శరత్ సక్సేనా) ఇంట్లో ఢిల్లీలో తలదాచుకుంటున్న హీరో... అతని వెంటే ఆ పాప. హీరోను ప్రేమిస్తున్న ఆ ఇంటివాళ్ళ అమ్మాయి రసిక (కరీనా కపూర్ ఖాన్) కూడా ఆ ప్రయత్నానికి అండ. ఆ అమ్మాయి ఏ ఊరిదని హీరో ఎలా తెలుసుకున్నాడు? తెలుసుకున్నాక ఏం చేశాడు? పాస్‌పోర్ట్, వీసా ఏమీ లేని ఆ పాప అక్కడకు ఎలా తీసుకువెళ్ళాడు? ఏమైందన్నది మిగతా కథ.
 
కనిపించేది పాత్రలే! నటులు కాదు!!

సూపర్‌స్టార్ మామూలు మనిషిలా చేస్తే, ఒక చిన్నపిల్ల పాత్ర సూపర్‌స్టార్ హోదాకు ఎదగడం ఈ చిత్రంలోని ఒక గమ్మత్తు. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించినా, ఇందులో బజరంగీ పాత్ర తప్ప సల్మాన్‌ఖాన్ ఇమేజ్, దాని తాలూకు పర్యవసానాలూ కనిపించవు. 'అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు' అని దీక్షగా బతికే మామూలు మనిషి కనిపిస్తాడు. అటు అమాయకత్వం, ఇటు ఇచ్చినమాటకు కట్టుబడాలనే దీక్ష ఉన్న మంచి మనిషి పాత్రలోకి పరకాయప్రవేశం చేశాడు. ఈ సినిమాకు హీరో కాని హీరో... హాలంతా ప్రేమలో పడేది మాత్రం మాటలు రాని ఆ చిన్నారి పాత్రతో. డైలాగులు లేకుండా కేవలం అభినయంతో మెప్పించిన ఆ పసిపాపతో అప్రయత్నంగా ప్రేమలో పడిపోతాం. సినిమా మొదటి ఫ్రేమ్ దగ్గర నుంచి ఆఖరు దాకా ఆమె ఎమోషన్‌తో ప్రయాణిస్తాం. కరీనా కపూర్ కనిపించేది కాసేపే. కానీ, ఆ పాత్రకు తగ్గ న్యాయం చేశారు.సెకండాఫ్‌లో టీవీ రిపోర్టర్ చాంద్ నవాబ్‌గా నవాజుద్దీన్ సిద్దిఖీ అచ్చంగా ఆ పాత్రే తాను అనిపించేలా జీవించారు.

కులం, మతంతో కుస్తీ పట్టే  ఛాందసులు (శరత్ సక్సేనా), ఎవరొచ్చినా ఆనందంగా ఆశ్రయమిచ్చే గడియ వేయని మసీదుల్లోని మౌల్వీ (ఓంపురి)లు, ఇంటికొచ్చిన అతిథికి ఆకలెరిగి అన్నం (ఇక్కడ పరోఠాలు) పెట్టే అన్నపూర్ణలు, దేశం ఏదైనా ఏ స్టోరీ వేస్తే ఎంత రేటింగులొస్తాయన్నదే తొలి ప్రాధాన్యంగా మారిన టీవీ చానల్ హెడ్‌లు, ముళ్ళకంచెలు, సైనికుల గస్తీలు విడదీసినా మంచితనం ఇంకా మాసిపోలేదని నిరూపించే ఒక మారుమూల ప్రాంతపు చిన్న న్యూస్ స్ట్రింగర్ (నవాజుద్దీన్ సిద్దిఖీ), బస్ కండక్టర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ - ఇలా చాలా పాత్రల్లో మనల్నీ, మన చుట్టుపక్కలి వాతావరణాన్నీ, ఉండాలనుకుంటున్న మనుషుల్నీ చూస్తాం.
     
 మెప్పించే సాంకేతికత, కథనం

 ఒక మంచి కథాంశం ఉంటే, దాన్ని మరెంత ఎఫెక్టివ్ స్క్రీన్‌ప్లేగా మలుచుకోవచ్చో ఈ సినిమాలో చూడవచ్చు. పాప ఎక్కడ నుంచి వచ్చిందని తెలుసుకొనే క్రమం దాకా సాగిన ఫస్టాఫ్ విసుగు లేకుండా అలా అలా నడిచిపోతుంది. అనుకున్న లక్ష్యానికి హీరో ఎలా చేరాడన్నది చెప్పే సెకండాఫ్ మొదట కాస్తంత స్లో అనిపించినా, కొద్దిక్షణాలకే పుంజుకొంటుంది. నవాజుద్దీన్ సిద్దిఖీ తెరపైకి వచ్చినప్పటి నుంచి, క్రమ క్రమంగా గ్రాఫ్ పెరుగుతూ, మనల్ని ఆర్ద్రభరితమైన క్లైమాక్స్‌కు చేరుస్తుంది. 'సెల్ఫీ లేలే' అంటూ సాగే హీరో పరిచయ గీతం లాంటి కమర్షియల్ జిమ్మిక్కులున్నా, అవీ కథను నడపడానికి ఉద్దేశించినవే. అయితే,  పదే పదే వినాలనిపించే పాటలేవీ లేకున్నా సన్నివేశాన్ని ప్రభావశీలంగా మార్చే సంగీతం ఈ సినిమాకు ప్లస్.

ప్రముఖ పాకిస్తానీ గాయకుడు అద్నాన్ సమీ (తెలుగులో 'గుండె జారి గల్లంతయ్యిందే', 'టెంపర్'తో సహా పలు చిత్రాల్లో పాడిన సింగర్) తెరపై కనిపిస్తూ, పాడిన 'భర్ దో ఝోలీ మేరీ...' అనే పాపులర్ పాకిస్తానీ ఖవ్వాలీ గుర్తుండిపోతుంది. అలాగే, డైలాగులు, కెమేరా, ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, పగటిపూట తీసిన దృశ్యాలను రాత్రి జరిగినవిగా చూపిన డి.ఐ. (డిజిటల్ ఇంటర్‌మీడియట్) నైపుణ్యం, కొండలు, కోనలు, ప్రకృతి దృశ్యాల చిత్రీకరణ - ఇవన్నీ ఈ సినిమాకు కలిసొచ్చినవే. గతంలో 'కాబూల్ ఎక్స్‌ప్రెస్', సల్మాన్‌తోనే 'ఏక్ థా టైగర్' లాంటి చిత్రాల్లో భారత, పాకిస్తాన్‌ల మధ్య అంశాన్ని చిత్రించిన దర్శకుడు కబీర్‌ఖాన్ ఈసారి మరో అడుగు ముందుకేశారు.

మాస్ హీరో ఉన్నాడని పిచ్చి ఫైట్లు, గ్లామర్ హీరోయిన్ ఉందని ఆమెకు అందమైన డ్రెస్‌లతో పాటలు, అనుకోకుండా వచ్చిపడే ఐటమ్ సాంగ్‌ల లాంటి రొటీన్ స్టఫ్ కోసమైతే ఈ సినిమాకు వెళ్ళద్దు! వెళితే నిరాశపడతాం!ముందస్తు ఇమేజెస్ ఏమీ లేకుండా తెరపై రెండుమ్ముప్పావు గంటల సినిమా చూడడానికని వెళితే, పాస్‌పోర్ట్ ఏజెంట్, హోటల్ దృశ్యాల దగ్గర హీరో కంట కన్నీరొలికే దృశ్యం, క్లైమాక్స్ ముందర దర్గా దగ్గర అతని ఆవేదన లాంటివన్నీ భావోద్వేగానికి గురిచేస్తాయి. లాజిక్‌లు వెతికితే ఈ కథలో, కథనంలో లోపాలు కనిపించవచ్చు. కానీ, ఇలాంటి కథలు, కథనాలు మన దగ్గర నుంచే (రాజమౌళి తండ్రి, 'బాహుబలి' కథా రచయిత అయిన వి.విజయేంద్ర ప్రసాద్ అందించిన కథే ఇదీ) బాలీవుడ్‌కు వెళ్ళి, ఇంత చక్కని సినిమాగా రూపొందాయని తెలిసినప్పుడు గర్వంతో పాటు సిగ్గూ వేస్తూంది. చట్రంలో నుంచి బయటపడని మన తెలుగు సినీ ప్రయత్నాల అశక్తత మీద జాలి కలుగుతుంది.
     
స్ర్కీన్ పై... ఎమోషనల్ రోలర్‌కోస్టర్ రైడ్!

సినిమా అంటే వట్టి విజువల్ వండరే కాదు... మనసుకు మేత కూడా కావాలి. మనిషిని మంచివాడిగా మార్చే ప్రయత్నం... కనీసం అటువైపు ఆలోచింపజేసే ప్రయత్నం చేయాలి. అందుకే, వీలుంటే కాదు... వీలు చేసుకొని మరీ ఒకసారి ఈ సినిమాకు వెళ్ళండి. ధార్మిక విశ్వాసాలు బలంగా ఉన్నవారైతే... తప్పకుండా వెళ్ళండి. మీరొక్కరే కాదు... మనసుపై బలంగా ముద్రపడే పిల్లల్ని తీసుకొని మరీ వెళ్ళండి. ఈ సినిమా మీ గుండె గుడి తలుపులు తెరుస్తుంది. కళ్ళు తెరిస్తే... సాటి మనిషిలోనే ఆంజనేయుడు, అల్లా, ఏసుక్రీస్తు... అందరూ ఒక్కటై కొలువున్నారని మరోసారి గుర్తు చేస్తుంది. తెరపై చూస్తున్నది కల్పనే అయినా, అప్రయత్నంగా అనేకచోట్ల కన్నీరు తెప్పిస్తుంది. మనమూ ఇలా చేస్తున్నామా అని ఆలోచనలో పడేస్తుంది.

వెండితెర సామూహిక స్వప్నంగా ఒక సినిమాకు అంత కన్నా ప్రయోజనం ఏముంటుంది! కమర్షియల్‌గా ఎటూ రికార్డులు సృష్టించే ఈ సినిమా, ఇండియా, పాకిస్తాన్ - హిందూ, ముస్లిమ్ అంటూ విద్వేషాలు పెంచుకొనే కన్నా ఇరువురూ ఏకమై, ప్రేమను పంచుకోవడంలోని తీయదనం ముఖ్యమని ఇరుపక్షాల్లో ఏ ఒక్కరిని మార్చినా ఈ సినిమాకు అంత కన్నా ఇంకేం సక్సెస్ కావాలి! అందుకే, ఒక్కమాటలో... రంజాన్‌కు ఒక రోజు ముందే వెండితెరపై కనిపించిన ఆశల నెలవంక... ఈ 'బజరంగీ భాయ్‌జాన్'. 'మానవతా కా ఈద్ ఔర్ చాంద్... యే బజరంగీ (ప్లస్) భాయ్‌జాన్'


 -  రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement