'టైగర్ జిందా హై' సినిమాతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ బుధవారం 52వ పడిలో అడుగుపెట్టారు. సినిమా కథ, కథనంతో సంబంధం లేకుండా కేవలం సల్మాన్ నటిస్తే చాలు సినిమా హిట్టవ్వడం ఖాయమంటూ అభిమానులు సంబరపడిపోతారు. సల్మాన్‌కు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు ఆయనను శుభాకాంక్షలతో ముంచెత్తారు.
జయాపజయాలతో సంబంధం లేకుండా సల్మాన్ ఛరిష్మా రోజురోజుకీ పెరిగిపోతుందనేది వాస్తవం. గత దశాబ్దకాలంగా విడుదలైన సినిమాలు గమనిస్తే సల్మాన్ వివిధ రకాల పాత్రలతో అభిమానుల్ని ఆకట్టుకున్న తీరు స్పష్టమవుతుంది. వాంటెడ్ సినిమాలో రాధేగా, దబాంగ్ సినిమాలో చుల్‌బుల్ పాండేగా, ఏక్ థా టైగర్‌లో 'రా' ఏజెంట్‌గా వివిధ పాత్రలు పోషించి మెప్పించటం ఈ భాయీజాన్‌కే చెల్లింది.
ఎన్ని సినిమాల్లో నటించినా.. ఎన్ని పాత్రలు పోషించినా.. కొన్ని పాత్రలు మాత్రం ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తాయి. బర్త్‌డే సందర్భంగా సల్మాన్ కెరీర్‌లో టాప్ 5 పర్ఫార్మెన్స్‌పై ఓ లుక్కేద్దాం..
1. మై నే ప్యార్ కియా
సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన మొదటి సినిమా ఇది. 28 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఆ దశాబ్దంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సల్మాన్‌తోపాటు, భాగ్యశ్రీ, సూరజ్ బర్జాత్యా కెరీర్‌కు ఊపునిచ్చింది. ఈ ప్రేమకథాచిత్రంతో చాక్‌లెట్ బాయ్ ఇమేజ్‌తో ‘ప్రేమ్’గా అమ్మాయిల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు.
2. హమ్ ఆప్‌కే హై కౌన్
సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించిన ఈ కుటుంబ కథా చిత్రం 90వ దశకంలోని బిగ్గెస్ట్ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. కుటుంబం కోసం తన ప్రేమను కూడా త్యాగం చేయగల పాత్రకు జీవం పోసి, తాను కేవలం ప్రేమకథా చిత్రాలకే పరిమితం కాదని నిరూపించుకున్నాడు ఈ సల్మాన్..
3. జుడ్వా
లవర్‌బాయ్, ఫ్యామిలీమ్యాన్ పాత్రలే కాకుండా.. ఈ సినిమాలో కామిడీ పాత్రలో ఒదిగిపోయి ఏ పాత్రలోనైనా జీవించగలనని నిరూపించుకున్నాడు. ఇందులో సల్మాన్.. ప్రేమ్, రాజాగా ద్విపాత్రాభినయం చేసి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టాడు.
4. ఫిర్ మిలేంగే
సల్మాన్ తన శైలికి పూర్తి భిన్నంగా, ఇమేజ్ పక్కన పెట్టి చేసిన సినిమా ఇది. హెచ్‌ఐవీ పేషెంట్‌గా రోహిత్ పాత్రలో నటించి ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించాడు. కొందరు ఈ పాత్రకు సల్మాన్ సూట్ అవలేదని విమర్శించినా తన నటనతో మెప్పించాడు.
5. బజ్‌రంగీ భాయీజాన్
హీరోగా కాకుండా ఒక నటుడిగా సల్మాన్‌ను మరో మెట్టు ఎక్కించిన సినిమా ఇది. పాకిస్తాన్ నుంచి తప్పిపోయి వచ్చిన ఓ మూగ అమ్మాయిని తన తల్లిదండ్రుల చెంతకు చేర్చే ప్రయత్నంలో భాగంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదురొడ్డి పోరాడి ఆమెను గమ్యస్థానానికి చేరుస్తాడు. పవన్ కుమార్ చతుర్వేదిగా ఒక సామాన్య యువకుని పాత్రలో ఒదిగిపోయాడు సల్మాన్.
Comments
Please login to add a commentAdd a comment