Bajarangi Bhaijan
-
కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్ గర్ల్‌ని గుర్తు పట్టారా? వైరల్ వీడియో
మాస్ట్రో సంజయ్ లీలా బన్సాలీ హీరామండి: ది డైమండ్ బజార్‌తో డిజిటల్ ప్రపంచంలోకి ఆకట్టుకునేలా అడుగుపెట్టాడు. సంచలన టీవీ సిరీస్‌తో సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాడు. పలువురు నటీమణులు తమ అద్బుతమైన నటనతో ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా వీటన్నింటికి మించి గోల్డెన్ గర్ల్ వీడియో నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.హర్షాలీ మల్హోత్రా మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ ‘‘బజరంగీ భాయిజాన్’’లో మున్నీ పాత్రలో నటించి, ప్రశంసలందుకున్న హర్షాలీ మల్హోత్రా లేటెస్ట్ సంచలనం. హీరామండిలోని అలంజేబ్ పాత్రను రీక్రియేట్ చేసింది. ఇందులో తనదైన నటనతో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) ఈ ధారావాహికలోని ‘‘ఏక్ బార్ దేఖ్ లిజియే’’ పాటకు తనదైన అభియనంతో వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. గోల్డెన్ కలర్ లెహంగాలో మల్హోత్రా మెరిసిపోయింది. అందమైన ఆమె కళ్ళు అనేక భావోద్వేగాలను అలవోకంగా పలికించడం విశేషం. దీంతో ఒరిజినల్ సాంగ్‌తో పోలిస్తే మల్హోత్రా బాగా నటించిందంటూ అంతా కితాబిచ్చారు.1940లలోని భారత స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యానికి వ్యతిరేకంగా, ‘‘హీరామండి’’ లాహోర్‌లోని రెడ్-లైట్ డిస్ట్రిక్ట్ హీరా మండిలో తవాయిఫ్‌ల (వేశ్యల) జీవితాల చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. స్టార్-స్టడెడ్ సిరీస్‌లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ అధ్యాయాన్ వంటి ప్రఖ్యాత నటీనటులు ఉన్నారు. ఇంకా శేఖర్ సుమన్, తహా షా బదుషా, ఫరీదా జలాల్తదితరులు మరికొందరు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో వెబ్ సిరీస్ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన షోగా నిలిచిన సంగతి తెలిసిందే. -
కామెడీ హీరో కోసం బాహుబలి రైటర్
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథ అందించిన స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ త్వరలో ఓ కామెడీ హీరో సినిమాకు కథ అందించనున్నారట. బాహుబలి, భజరంగీ బాయ్‌జాన్ లాంటి సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ తెలుగుతో పాటు పరభాషా చిత్రాలకు కూడా కథ అందిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్లోనూ కామెడీ స్టార్ సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు ఆయన కథ అందించనున్నారట. ఈ సినిమాకు స్వర్ణ సుబ్బారావ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
హ్యాపీ బర్త్‌డే సల్మాన్: టాప్ 5 సినిమాలివే!
'టైగర్ జిందా హై' సినిమాతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ బుధవారం 52వ పడిలో అడుగుపెట్టారు. సినిమా కథ, కథనంతో సంబంధం లేకుండా కేవలం సల్మాన్ నటిస్తే చాలు సినిమా హిట్టవ్వడం ఖాయమంటూ అభిమానులు సంబరపడిపోతారు. సల్మాన్‌కు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు ఆయనను శుభాకాంక్షలతో ముంచెత్తారు. జయాపజయాలతో సంబంధం లేకుండా సల్మాన్ ఛరిష్మా రోజురోజుకీ పెరిగిపోతుందనేది వాస్తవం. గత దశాబ్దకాలంగా విడుదలైన సినిమాలు గమనిస్తే సల్మాన్ వివిధ రకాల పాత్రలతో అభిమానుల్ని ఆకట్టుకున్న తీరు స్పష్టమవుతుంది. వాంటెడ్ సినిమాలో రాధేగా, దబాంగ్ సినిమాలో చుల్బుల్ పాండేగా, ఏక్ థా టైగర్‌లో 'రా' ఏజెంట్‌గా వివిధ పాత్రలు పోషించి మెప్పించటం ఈ భాయీజాన్కే చెల్లింది. ఎన్ని సినిమాల్లో నటించినా.. ఎన్ని పాత్రలు పోషించినా.. కొన్ని పాత్రలు మాత్రం ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తాయి. బర్త్‌డే సందర్భంగా సల్మాన్ కెరీర్లో టాప్ 5 పర్ఫార్మెన్స్పై ఓ లుక్కేద్దాం.. 1. మై నే ప్యార్ కియా సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన మొదటి సినిమా ఇది. 28 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఆ దశాబ్దంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సల్మాన్‌తోపాటు, భాగ్యశ్రీ, సూరజ్ బర్జాత్యా కెరీర్‌కు ఊపునిచ్చింది. ఈ ప్రేమకథాచిత్రంతో చాక్లెట్ బాయ్ ఇమేజ్‌తో ‘ప్రేమ్’గా అమ్మాయిల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. 2. హమ్ ఆప్కే హై కౌన్ సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించిన ఈ కుటుంబ కథా చిత్రం 90వ దశకంలోని బిగ్గెస్ట్ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. కుటుంబం కోసం తన ప్రేమను కూడా త్యాగం చేయగల పాత్రకు జీవం పోసి, తాను కేవలం ప్రేమకథా చిత్రాలకే పరిమితం కాదని నిరూపించుకున్నాడు ఈ సల్మాన్.. 3. జుడ్వా లవర్‌బాయ్, ఫ్యామిలీమ్యాన్ పాత్రలే కాకుండా.. ఈ సినిమాలో కామిడీ పాత్రలో ఒదిగిపోయి ఏ పాత్రలోనైనా జీవించగలనని నిరూపించుకున్నాడు. ఇందులో సల్మాన్.. ప్రేమ్, రాజాగా ద్విపాత్రాభినయం చేసి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టాడు. 4. ఫిర్ మిలేంగే సల్మాన్ తన శైలికి పూర్తి భిన్నంగా, ఇమేజ్ పక్కన పెట్టి చేసిన సినిమా ఇది. హెచ్ఐవీ పేషెంట్‌గా రోహిత్ పాత్రలో నటించి ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించాడు. కొందరు ఈ పాత్రకు సల్మాన్ సూట్ అవలేదని విమర్శించినా తన నటనతో మెప్పించాడు. 5. బజ్రంగీ భాయీజాన్ హీరోగా కాకుండా ఒక నటుడిగా సల్మాన్‌ను మరో మెట్టు ఎక్కించిన సినిమా ఇది. పాకిస్తాన్ నుంచి తప్పిపోయి వచ్చిన ఓ మూగ అమ్మాయిని తన తల్లిదండ్రుల చెంతకు చేర్చే ప్రయత్నంలో భాగంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదురొడ్డి పోరాడి ఆమెను గమ్యస్థానానికి చేరుస్తాడు. పవన్ కుమార్ చతుర్వేదిగా ఒక సామాన్య యువకుని పాత్రలో ఒదిగిపోయాడు సల్మాన్. -
సల్మాన్ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో బాలీవుడ్ టాప్ స్టార్‌గా ఎదుగుతున్నాడు. ఇటీవల బజరంగీ బాయ్‌జాన్ సినిమాతో సత్తా చాటిన సల్మాన్ త్వరలో ఓ యాక్షన్ సినిమాకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో ఓ యాక్షన్ డ్రామాలో నటించనున్నాడు. సుల్తాన్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను యష్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్యచొప్రా నిర్మిస్తున్నాడు. సల్మాన్ రెజలర్ గా నటిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లార్నెల్ స్టొవల్ ఫైట్ సీక్వన్స్ను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రేమ్ రతన్ ధన్ పాయో షూటింగ్ పూర్తి చేసిన సల్మాన్, ఇప్పటికే సల్మాన్ ఖాన్ లాస్ ఏంజిల్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటుండగా అక్కడికి చేరుకున్న డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. విశాల్ - శేఖర్లు సాంగ్స్ రికార్డింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఎట్టిపరిస్థితుల్లో 2016 ఈద్‌కు రిలీజ్ ప్లాన్ చేస్తున్న యూనిట్ పక్కాప్లానింగ్‌తో సినిమా కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇంత వరకు హీరోయిన్ ఎంపిక మాత్రం పూర్తి కాలేదు. వచ్చే ఏడాది ఈద్ బరిలో తన సినిమాను కూడా ప్లాన్ చేస్తున్న షారూఖ్‌కు గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు సల్మాన్. -
డైరెక్టర్‌కు గిప్ట్ ఇచ్చిన సల్మాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇచ్చే గిప్ట్లంటే యమ క్రేజీ. తను ప్రేమించిన వారి కోసం ఏమైనా చేయగల విశాలమైన మనసు కలవాడనే పేరు సల్లూభాయ్‌కి ఉంది. కెరీర్లో జెట్ స్పీడ్‌లో దూసుకు పోతున్న సల్మాన్ తన విజయాలకు సహకరించిన వారికి మెమరబుల్ బహుమతులు ఇవ్వడం మనకు తెలిసిందే. తాజాగా సల్మాన్ హీరోగా విడుదలైన 'బజరంగీ బాయ్‌జాన్' ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఇంతటి ఘనవిజయాన్ని అందించిన దర్శకుడు కబీర్ ఖాన్‌కు... మరిచిపోలేని గిప్ట్ ఇచ్చాడు. తానే స్వయంగా వేసిన ఓ బ్లాక్ అండ్ వైట్ పొట్రాయిట్ను కబీర్‌కు ప్రెజెంట్ చేశాడు. అంతేకాదు ఈ పొట్రాయిట్కు బజరంగీ బాయ్ జాన్ అని పేరు పెట్టాడు. కండలవీరుడు ఇచ్చిన గిప్ట్‌తో పొంగిపోయిన కబీర్ తన ఆనందాన్ని ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. సల్మాన్ ప్రజెంట్ చేసిన పెయింటింగ్‌ను షేర్ చేస్తూ తన లైఫ్‌లో ఇదే బెస్ట్ గిప్ట్ అంటూ కామెంట్ చేశాడు. గతంలో 'ఏక్ థా టైగర్' సినిమా కోసం కలిసి పనిచేసిన సల్మాన్, కబీర్లు బజరంగీ బాయ్‌జాన్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాశారు. ఈ మూవీ తరువాత కబీర్ డైరెక్ట్ చేసిన ఫాంటమ్ కూడా మంచి వసూళ్లను రాబడుతున్న నేపథ్యంలో సల్మాన్ గిప్ట్ కబీర్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. Just got the best gift... From my producer, my actor, my friend -
కండల వీరుడి కొత్త అవతారం
'బజరంగీ భాయిజాన్' విజయం కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు కొత్త కిక్ ఇచ్చింది. చాలా రోజులుగా వివాదాలతో ఇమేజ్ పాడు చేసుకున్న సల్మాన్ ఈ మూవీ సక్సెస్‌తో ఒక్కసారిగా అభిమానులతో పాటు సినీ, రాజకీయవర్గాలకు చెందినవారి మనసు కూడా గెలుచుకున్నాడు. అందుకే తన తదుపరి సినిమాలు కూడా అన్ని వర్గాలను అలరించేవిగా ఉండాలని తెగ కష్టపడిపోతున్నాడు. దాంతో యాక్టింగ్‌తో పాటు మేకింగ్ విషయంలో కూడా తన మార్క్ కనిపిచేలా జాగ్రత్త పడుతున్నాడు సల్లూబాయ్.. ఇప్పటి వరకు నటుడిగానే కొనసాగిన కండల వీరుడు ప్రస్తుతం ఇండస్ట్రీలోని ఇతర రంగాల మీద కూడా పట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు. హీరోగా చాలా అనుభవం ఉన్న సల్మాన్ నిర్మాతగా కూడా సక్సెస్ సాదించాడు. తనకున్న మాస్ ఇమేజ్‌కు భిన్నంగా ఓ ఎమోషనల్ ట్రావెల్ డ్రామను నిర్మించి సమ్ థింగ్ స్పెషల్ అని ప్రూవ్ చేసుకున్నాడు. బజరంగీ భాయిజాన్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాసిన సల్మాన్ తన ప్రొడక్షన్ లో వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఆదిత్య పంచోలి తనయుడు సూరజ్ పంచోలిని హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్నచిత్రం కోసం సల్మాన్ ఖాన్ గాయకుడిగా కూడా మారాడు. అంతేకాకుండా ఎడిటింగ్‌ను కూడా తానే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. అలాగే సల్మాన్ హీరోగా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' ఎడిటింగ్ కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇటీవలే ఈ సినిమా రషెస్ చూసిన అతడు స్వయంగా ఎడిటింగ్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే హీరో నుంచి నిర్మాతగా మారిన సల్మాన్, గాయకుడిగా, ఎడిటర్‌గా కూడా మారటంతో ముందు ముందు ఇంకెన్ని అవతారాలు చూపిస్తాడో తెలియాలంటే వెయిట్ అండ్ సీ... -
డబుల్ సెంచరీ 'కిక్' కొట్టాడు!
తన సినిమా మొదటి వార్షికోత్సవం రోజున.. తన మరో సినిమా రికార్డు సృష్టించడం అంటే ఎవరికైనా ఆనందమే కదా. సరిగ్గా ఇదే ఆనందాన్ని ఇప్పుడు సల్మాన్ ఖాన్ అనుభవిస్తున్నాడు. తెలుగు కిక్ సినిమాకు రీమేక్‌గా హిందీలో అదే పేరుతో తీసి బ్రహ్మాండమైన విజయం సొంతం చేసుకున్న సల్మాన్.. ఆ సినిమా వార్షికోత్సవం రోజున బజరంగీ భాయీజాన్ 200 కోట్ల మార్కును అందుకున్నాడు. సరిగ్గా శనివారం రోజునే ఈ 200 కోట్ల క్లబ్‌లోకి సల్మాన్ బజరంగీ చేరిపోయాడు. శుక్రవారం వరకు ఈ సినిమాకు రూ. 198 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. శనివారం మార్నింగ్ షోతోనే మిగిలిన రెండుకోట్లు వచ్చేశాయి. దాంతో 200 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలోకి బజరంగీ భాయీజాన్ కూడా చేరిపోయింది. సాజిద్ నడియాడ్వాలా దర్శకత్వం వహించిన హిందీ కిక్ సినిమా గత సంవత్సరం జూలై 25న విడుదలైంది. ఆ సినిమా మొత్తం రూ. 233 కోట్లు వసూలు చేసింది. బజరంగీ సినిమా ఆ మొత్తాన్ని సులభంగా దాటేస్తుందని అనలిస్టులు అంటున్నారు. -
బజరంగీ భాయ్‌జాన్-రివ్యూ
*మానవత్వం పరిమళించే మంచి సినిమాకు స్వాగతం! చిత్రం - బజరంగీ భాయ్‌జాన్ (హిందీ), తారాగణం - సల్మాన్‌ఖాన్, కరీనా కపూర్ ఖాన్, బేబీ హర్షాలీ మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్దిఖీ, శరత్ సక్సేనా, ఓంపురి, కథ - వి. విజయేంద్రప్రసాద్, స్క్రీన్‌ప్లే - కబీర్ ఖాన్, పర్వీజ్ షేక్, అసద్ హుస్సేన్, సంగీతం - ప్రీతమ్ చక్రవర్తి, కెమేరా - అసీమ్ మిశ్రా, ఎడిటింగ్ - రామేశ్వర్ ఎస్. భగత్, నిర్మాతలు - సల్మాన్‌ఖాన్, 'రాక్‌లైన్' వెంకటేశ్, దర్శకత్వం - కబీర్‌ఖాన్ ............................................ అన్నీ లెక్కలేసుకొనే చేస్తే దాన్ని జీవితమనీ, మనల్ని మనుషులనీ ఎవరూ అనరు. అనలేరు. యంత్రానికి లేని మనసుంది కాబట్టే, మనం ప్రత్యేకమయ్యాం. కొన్ని భావాలకూ, బంధాలకూ లాజిక్‌లు ఉండవు. అది అంతే! కానీ, మనకు మనమే కులం, మతం, ప్రాంతం, భాష, దేశం - అనే విభజన రేఖలు గీసుకున్నాం. మన లాంటి తోటి మనిషిని కూడా ఈ మరుగుజ్జు ప్రమాణాలతో జడ్జ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సాటివాడికి చేయందించడానికి కూడా ఈ లెక్కలు వేస్తాం. సరిగ్గా అలాంటి మనస్తత్త్వమున్న మన లాంటి ఒక వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో తన దేశం, మతం కాని ఒక చిన్నారికి దగ్గరైతే? మాటలు రాని ఆరేళ్ల ఆ మూగ చిన్నారిని సురక్షితంగా తన ఇంటికి చేర్చడానికి జీవితాన్నే రిస్క్‌లో పడేసుకుంటే? ఆ క్రమంలో డబ్బు, ప్రేమ, పెళ్ళి, చివరకు ప్రాణం కూడా పణంగా ఒడ్డడానికి సిద్ధపడితే? మనుషుల మధ్య పెరగాల్సింది ప్రేమే తప్ప, కుల, మత, ప్రాంతాల పేరిట ద్వేషం కాదని గుర్తు చేస్తూ - వెండితెరపై చాలా కాలం తరువాత గుబాళించిన మానవతా పరిమళం 'బజరంగీ భాయ్‌జాన్' మాట రాని(వ్వని) పసిపాప కథ! ఈ సినిమా కథ చాలా సింపుల్. పాకిస్తాన్లో ఉన్న కాశ్మీర ప్రాంతానికి చెందిన ఒక మహమ్మదీయ కుటుంబం. గొర్రెలు కాసుకొనే ఆ భార్యాభర్తల ఏకైక సంతానం - షాహిదా (బేబీ హర్షాలీ మల్హోత్రా). ఆరేళ్ళ వయసొచ్చినా ఇంకా మాటలు రాని పసిపాప. భారతదేశంలోని ఢిల్లీలో ఉన్న ప్రసిద్ధ దర్గాకు వచ్చి మొక్కుకుంటే, మాటలు వస్తాయని ఎవరో అంటారు. తండ్రి ఒకప్పుడు సైన్యంలో పనిచేసినవాడు కాబట్టి, అతనికి వీసా వచ్చే అవకాశం లేదనే తీర్మానానికి వస్తారు. గొర్రెల్ని అమ్మేసి, ఆ వచ్చిన డబ్బుతో తల్లి, పిల్లను తీసుకొని, పాస్‌పోర్ట్, వీసాలతో రైలులో సరిహద్దు దాటి వస్తుంది. దర్గాలో ప్రార్థనలు చేసి, రైలులో తిరిగొస్తున్నప్పుడు అనుకోకుండా పాప తప్పిపోతుంది. మాటలు రాని ఆ పాప కురుక్షేత్రకు వచ్చిన పవన్ కుమార్ చతుర్వేదీ (సల్మాన్‌ఖాన్)కు తారసపడుతుంది. మెడలో ఆంజనేయుడి గద బొమ్మను లాకెట్‌గా వేసుకున్న వీర హనుమద్భక్తుడైన పవన్‌ను అందరూ ముద్దుగా 'బజరంగీ' అని పిలుస్తుంటారు. అందరిలానే ఆ పసిపాపను మొదట వదిలించుకుందామని అనుకున్నా, బజరంగీలోని మానవత్వం ఒప్పుకోదు. తండ్రి పోవడంతో, నాన్న ఫ్రెండ్ (తెలుగులో చిరంజీవి 'ముఠామేస్త్రి' సహా అనేక చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు శరత్ సక్సేనా) ఇంట్లో ఢిల్లీలో తలదాచుకుంటున్న హీరో... అతని వెంటే ఆ పాప. హీరోను ప్రేమిస్తున్న ఆ ఇంటివాళ్ళ అమ్మాయి రసిక (కరీనా కపూర్ ఖాన్) కూడా ఆ ప్రయత్నానికి అండ. ఆ అమ్మాయి ఏ ఊరిదని హీరో ఎలా తెలుసుకున్నాడు? తెలుసుకున్నాక ఏం చేశాడు? పాస్‌పోర్ట్, వీసా ఏమీ లేని ఆ పాప అక్కడకు ఎలా తీసుకువెళ్ళాడు? ఏమైందన్నది మిగతా కథ. కనిపించేది పాత్రలే! నటులు కాదు!! సూపర్‌స్టార్ మామూలు మనిషిలా చేస్తే, ఒక చిన్నపిల్ల పాత్ర సూపర్‌స్టార్ హోదాకు ఎదగడం ఈ చిత్రంలోని ఒక గమ్మత్తు. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించినా, ఇందులో బజరంగీ పాత్ర తప్ప సల్మాన్‌ఖాన్ ఇమేజ్, దాని తాలూకు పర్యవసానాలూ కనిపించవు. 'అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు' అని దీక్షగా బతికే మామూలు మనిషి కనిపిస్తాడు. అటు అమాయకత్వం, ఇటు ఇచ్చినమాటకు కట్టుబడాలనే దీక్ష ఉన్న మంచి మనిషి పాత్రలోకి పరకాయప్రవేశం చేశాడు. ఈ సినిమాకు హీరో కాని హీరో... హాలంతా ప్రేమలో పడేది మాత్రం మాటలు రాని ఆ చిన్నారి పాత్రతో. డైలాగులు లేకుండా కేవలం అభినయంతో మెప్పించిన ఆ పసిపాపతో అప్రయత్నంగా ప్రేమలో పడిపోతాం. సినిమా మొదటి ఫ్రేమ్ దగ్గర నుంచి ఆఖరు దాకా ఆమె ఎమోషన్‌తో ప్రయాణిస్తాం. కరీనా కపూర్ కనిపించేది కాసేపే. కానీ, ఆ పాత్రకు తగ్గ న్యాయం చేశారు.సెకండాఫ్‌లో టీవీ రిపోర్టర్ చాంద్ నవాబ్‌గా నవాజుద్దీన్ సిద్దిఖీ అచ్చంగా ఆ పాత్రే తాను అనిపించేలా జీవించారు. కులం, మతంతో కుస్తీ పట్టే ఛాందసులు (శరత్ సక్సేనా), ఎవరొచ్చినా ఆనందంగా ఆశ్రయమిచ్చే గడియ వేయని మసీదుల్లోని మౌల్వీ (ఓంపురి)లు, ఇంటికొచ్చిన అతిథికి ఆకలెరిగి అన్నం (ఇక్కడ పరోఠాలు) పెట్టే అన్నపూర్ణలు, దేశం ఏదైనా ఏ స్టోరీ వేస్తే ఎంత రేటింగులొస్తాయన్నదే తొలి ప్రాధాన్యంగా మారిన టీవీ చానల్ హెడ్లు, ముళ్ళకంచెలు, సైనికుల గస్తీలు విడదీసినా మంచితనం ఇంకా మాసిపోలేదని నిరూపించే ఒక మారుమూల ప్రాంతపు చిన్న న్యూస్ స్ట్రింగర్ (నవాజుద్దీన్ సిద్దిఖీ), బస్ కండక్టర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ - ఇలా చాలా పాత్రల్లో మనల్నీ, మన చుట్టుపక్కలి వాతావరణాన్నీ, ఉండాలనుకుంటున్న మనుషుల్నీ చూస్తాం. మెప్పించే సాంకేతికత, కథనం ఒక మంచి కథాంశం ఉంటే, దాన్ని మరెంత ఎఫెక్టివ్ స్క్రీన్‌ప్లేగా మలుచుకోవచ్చో ఈ సినిమాలో చూడవచ్చు. పాప ఎక్కడ నుంచి వచ్చిందని తెలుసుకొనే క్రమం దాకా సాగిన ఫస్టాఫ్ విసుగు లేకుండా అలా అలా నడిచిపోతుంది. అనుకున్న లక్ష్యానికి హీరో ఎలా చేరాడన్నది చెప్పే సెకండాఫ్ మొదట కాస్తంత స్లో అనిపించినా, కొద్దిక్షణాలకే పుంజుకొంటుంది. నవాజుద్దీన్ సిద్దిఖీ తెరపైకి వచ్చినప్పటి నుంచి, క్రమ క్రమంగా గ్రాఫ్ పెరుగుతూ, మనల్ని ఆర్ద్రభరితమైన క్లైమాక్స్‌కు చేరుస్తుంది. 'సెల్ఫీ లేలే' అంటూ సాగే హీరో పరిచయ గీతం లాంటి కమర్షియల్ జిమ్మిక్కులున్నా, అవీ కథను నడపడానికి ఉద్దేశించినవే. అయితే, పదే పదే వినాలనిపించే పాటలేవీ లేకున్నా సన్నివేశాన్ని ప్రభావశీలంగా మార్చే సంగీతం ఈ సినిమాకు ప్లస్. ప్రముఖ పాకిస్తానీ గాయకుడు అద్నాన్ సమీ (తెలుగులో 'గుండె జారి గల్లంతయ్యిందే', 'టెంపర్'తో సహా పలు చిత్రాల్లో పాడిన సింగర్) తెరపై కనిపిస్తూ, పాడిన 'భర్ దో ఝోలీ మేరీ...' అనే పాపులర్ పాకిస్తానీ ఖవ్వాలీ గుర్తుండిపోతుంది. అలాగే, డైలాగులు, కెమేరా, ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, పగటిపూట తీసిన దృశ్యాలను రాత్రి జరిగినవిగా చూపిన డి.ఐ. (డిజిటల్ ఇంటర్మీడియట్) నైపుణ్యం, కొండలు, కోనలు, ప్రకృతి దృశ్యాల చిత్రీకరణ - ఇవన్నీ ఈ సినిమాకు కలిసొచ్చినవే. గతంలో 'కాబూల్ ఎక్స్‌ప్రెస్', సల్మాన్‌తోనే 'ఏక్ థా టైగర్' లాంటి చిత్రాల్లో భారత, పాకిస్తాన్ల మధ్య అంశాన్ని చిత్రించిన దర్శకుడు కబీర్‌ఖాన్ ఈసారి మరో అడుగు ముందుకేశారు. మాస్ హీరో ఉన్నాడని పిచ్చి ఫైట్లు, గ్లామర్ హీరోయిన్ ఉందని ఆమెకు అందమైన డ్రెస్‌లతో పాటలు, అనుకోకుండా వచ్చిపడే ఐటమ్ సాంగ్‌ల లాంటి రొటీన్ స్టఫ్ కోసమైతే ఈ సినిమాకు వెళ్ళద్దు! వెళితే నిరాశపడతాం!ముందస్తు ఇమేజెస్ ఏమీ లేకుండా తెరపై రెండుమ్ముప్పావు గంటల సినిమా చూడడానికని వెళితే, పాస్‌పోర్ట్ ఏజెంట్, హోటల్ దృశ్యాల దగ్గర హీరో కంట కన్నీరొలికే దృశ్యం, క్లైమాక్స్ ముందర దర్గా దగ్గర అతని ఆవేదన లాంటివన్నీ భావోద్వేగానికి గురిచేస్తాయి. లాజిక్‌లు వెతికితే ఈ కథలో, కథనంలో లోపాలు కనిపించవచ్చు. కానీ, ఇలాంటి కథలు, కథనాలు మన దగ్గర నుంచే (రాజమౌళి తండ్రి, 'బాహుబలి' కథా రచయిత అయిన వి.విజయేంద్ర ప్రసాద్ అందించిన కథే ఇదీ) బాలీవుడ్‌కు వెళ్ళి, ఇంత చక్కని సినిమాగా రూపొందాయని తెలిసినప్పుడు గర్వంతో పాటు సిగ్గూ వేస్తూంది. చట్రంలో నుంచి బయటపడని మన తెలుగు సినీ ప్రయత్నాల అశక్తత మీద జాలి కలుగుతుంది. స్ర్కీన్ పై... ఎమోషనల్ రోలర్‌కోస్టర్ రైడ్! సినిమా అంటే వట్టి విజువల్ వండరే కాదు... మనసుకు మేత కూడా కావాలి. మనిషిని మంచివాడిగా మార్చే ప్రయత్నం... కనీసం అటువైపు ఆలోచింపజేసే ప్రయత్నం చేయాలి. అందుకే, వీలుంటే కాదు... వీలు చేసుకొని మరీ ఒకసారి ఈ సినిమాకు వెళ్ళండి. ధార్మిక విశ్వాసాలు బలంగా ఉన్నవారైతే... తప్పకుండా వెళ్ళండి. మీరొక్కరే కాదు... మనసుపై బలంగా ముద్రపడే పిల్లల్ని తీసుకొని మరీ వెళ్ళండి. ఈ సినిమా మీ గుండె గుడి తలుపులు తెరుస్తుంది. కళ్ళు తెరిస్తే... సాటి మనిషిలోనే ఆంజనేయుడు, అల్లా, ఏసుక్రీస్తు... అందరూ ఒక్కటై కొలువున్నారని మరోసారి గుర్తు చేస్తుంది. తెరపై చూస్తున్నది కల్పనే అయినా, అప్రయత్నంగా అనేకచోట్ల కన్నీరు తెప్పిస్తుంది. మనమూ ఇలా చేస్తున్నామా అని ఆలోచనలో పడేస్తుంది. వెండితెర సామూహిక స్వప్నంగా ఒక సినిమాకు అంత కన్నా ప్రయోజనం ఏముంటుంది! కమర్షియల్‌గా ఎటూ రికార్డులు సృష్టించే ఈ సినిమా, ఇండియా, పాకిస్తాన్ - హిందూ, ముస్లిమ్ అంటూ విద్వేషాలు పెంచుకొనే కన్నా ఇరువురూ ఏకమై, ప్రేమను పంచుకోవడంలోని తీయదనం ముఖ్యమని ఇరుపక్షాల్లో ఏ ఒక్కరిని మార్చినా ఈ సినిమాకు అంత కన్నా ఇంకేం సక్సెస్ కావాలి! అందుకే, ఒక్కమాటలో... రంజాన్‌కు ఒక రోజు ముందే వెండితెరపై కనిపించిన ఆశల నెలవంక... ఈ 'బజరంగీ భాయ్‌జాన్'. 'మానవతా కా ఈద్ ఔర్ చాంద్... యే బజరంగీ (ప్లస్) భాయ్‌జాన్' - రెంటాల జయదేవ