ముఖం చాటేసిన సల్లూభాయ్ | salman khan escapes from scribes in mumbai airport | Sakshi
Sakshi News home page

ముఖం చాటేసిన సల్లూభాయ్

Published Thu, Jun 23 2016 8:19 AM | Last Updated on Sat, Jul 28 2018 8:35 PM

ముఖం చాటేసిన సల్లూభాయ్ - Sakshi

ముఖం చాటేసిన సల్లూభాయ్

సుల్తాన్ సినిమా షూటింగ్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత తన పరిస్థితి రేప్‌కు గురైన మహిళలా ఉందని వ్యాఖ్యలు చేసి, అప్రతిష్ఠను మూటగట్టుకున్న బాలీవుడ్ ముదురు బ్రహ్మచారి సల్మాన్ ఖాన్.. మీడియాకు ముఖం చాటేశాడు. ముంబై విమానాశ‍్రయంలోకి వెళ్తున్న సల్మాన్ ఖాన్ను పలు జాతీయ మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు చుట్టుముట్టారు. రేప్ వ్యాఖ్యలను పలువురు హీరోయిన్లతో పాటు మహిళా కమిషన్ కూడా ఖండించిన నేపథ్యంలో, దీనిపై మీ స్పందన ఏంటని ఎంత అడుగుతున్నా సల్మాన్ మాత్రం అస్సలు ఎవరికీ సమాధానం ఇవ్వకుండా, పెదవి విప్పకుండా లోనికి వెళ్లిపోయాడు.

ఆయన చుట్టూ పోలీసులు, సొంత బాడీగార్డులు, విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది వలయంలా ఉండి ఎవరినీ దగ్గరకు కూడా వెళ్లనివ్వలేదు. చిరునవ్వు నవ్వుకుంటూ లోపలకు వెళ్లిపోయిన సల్మాన్ ఖాన్ ఏ ఒక్కరి ప్రశ్నకూ సమాధానం చెప్పలేదు. నేటితరం టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ దగ్గర నుంచి నిన్నటి తరం హీరోయిన్ నగ్మా, గాయని సోనా మహాపాత్ర, జాతీయ మహిళా కమిషన్ చీఫ్ లలితా కుమారమంగళం.. ఇలా ప్రతి ఒక్కరూ సల్మాన్ వ్యాఖ్యలను ఖండించారు. సుల్తాన్ సినిమాలో రెజ్లర్ పాత్రలో నటిస్తున్న సల్మాన్.. ఆ షూటింగ్ చాలా శ్రమతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. ఆ విషయం చెప్పడానికే ఆరు గంటల షూటింగ్ అయిన తర్వాత తన పరిస్థితి రేప్కు గురైన మహిళలా ఉందని అనడం దుమారం రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement