హీరోను అంకుల్ అంటే కోపం రాదా!
హీరోను అంకుల్ అంటే కోపం రాదా!
Published Tue, Feb 7 2017 8:42 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ ముదురు బ్రహ్మచారి ఎవరంటే.. ముందుగా గుర్తుకొచ్చే పేరు సల్మాన్ ఖాన్ (51). ఓపక్క ఐదు పదుల వయసు దాటిపోయినా, ఇప్పటికీ కుర్రహీరోలతో పోటీపడుతూ సినిమాలు తీస్తుంటాడు. తాజాగా కూడా సుల్తాన్ సినిమాతో బాక్సాఫీసును షేక్ చేశాడు. అయితే, ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా రూమర్లతోనే కాలం గడిపేస్తూ తనను తాను కుర్రాడిలాగే భావిస్తున్నాడు. అలాంటి సల్మాన్ ఖాన్‌ను పట్టుకుని ఎవరైనా కుర్ర హీరోలు 'అంకుల్' అని పిలిస్తే ఊరుకుంటాడా? 1997లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా జుడ్‌వా ట్రయల్ షో సందర్భంగా కుర్ర హీరో వరుణ్ ధావన్ ఇదే పని చేశాడట. సల్లూని భాయ్ అనకుండా అంకుల్ అని పిలిచాడు. ఎందుకంటే, ఆ సినిమా తీసే సమయానికి వరుణ్ వయసు కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే!!
ఈ విషయం మొత్తాన్ని వరుణ్ ధావన్ ఈమధ్య మీడియాతో పంచుకున్నాడు. ''నేను ఆ సినిమా ట్రయల్‌కు వెళ్లి, సల్మాన్ అంకుల్ అని పిలిచాను. ఆయన చాలా అప్‌సెట్ అయ్యారు. మరోసారి అలా పిలిస్తే కొడతానని, సల్మాన్ భాయ్ అని పిలవమని చెప్పారు. డేవిడ్ ధావన్ కొడుకైనా సరే తాను లెక్కచేసేది లేదని, మరోసారి తనను అంకుల్ అని పిలిస్తే నన్ను థియేటర్‌లోకి రానివ్వబోనని వార్నింగ్ ఇచ్చారు'' అని వరుణ్ ముంబైలో మీడియాకు చెప్పాడు. ఇంతకీ సందర్భం ఏమిటా అంటే.. జుడ్‌వా సినిమాకు సీక్వెల్‌గా జుడ్‌వా 2 తీస్తున్నారు. అందులో వరుణ్ ధావన్ హీరో. జుడ్‌వా మొదటి సినిమాకు దర్శకుడు డేవిడ్ ధావన్. ఈ సినిమాతో ఇప్పుడు తాను సల్మాన్‌ను గానీ, సాజిద్ ఖాన్‌ను గానీ, డేవిడ్ ధావన్‌ను, ప్రేక్షకులను కూడా నిరాశపరచాలనుకోవట్లేదని, సల్మాన్ ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని అన్నాడు. ఈ సినిమాలో రాజా పాత్ర పోషించేటప్పుడు ధరించడానికి తనకు ఒక బాక్సు నిండా జీన్స్ ప్యాంట్లను సల్మాన్ భాయ్ పంపాడని కూడా వరుణ్ చెప్పాడు.
Advertisement