కండల వీరునితో మగధీరుడు?
పట్టుదలకు కేరాఫ్ అడ్రస్ చిరంజీవి. కెరీర్‌లో ఎన్నో ఆటుపోటుల్ని తట్టుకున్న హీరో ఆయన. ఎక్కడైతే ఓడాడో.. అక్కడే గెలవడం చిరంజీవి ప్రత్యేకత. రామ్‌చరణ్ కూడా ఇప్పుడు తండ్రి బాటలోనే నడుస్తున్నారు. బాలీవుడ్‌లో ఆయన నటించిన ‘జంజీర్’ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే.
ఎక్కడైతే.. ఎదురుదెబ్బ తిన్నాడో... మళ్లీ అక్కడే విజయకేతనం ఎగరవేయాలనే కసితో ఉన్నాడు చరణ్. బాలీవుడ్‌లో బంపర్‌హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ముందుకెళతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంలో చరణ్‌కి కొండంత అండగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ నిలబడ్డట్టు తెలుస్తోంది. తానూ సల్మాన్ కలిసి నటించాలనుకుంటున్నట్లు కొన్ని రోజుల క్రితం చరణ్ మీడియా ముందు కూడా చెప్పారు.
దాన్ని నిజం చేస్తూ ఇటీవలే సల్మాన్ నివాసంలో వీరి కొత్త సినిమాకు సంబంధించిన చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని సల్మాన్ కానీ లేక ఆయన తమ్ముడు సోహైల్‌ఖాన్ కానీ నిర్మించనున్నట్లు బాలీవుడ్ సమాచారం. సల్మాన్, చరణ్ కలిసి నటించే ఈ చిత్రం కోసం అప్పుడే కథాచర్చలు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం సల్మాన్ ‘కిక్’ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక... సల్మాన్, చరణ్‌ల ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని వినికిడి.