సల్మాన్ చెప్పినట్లే... జరిగిందా? | Salman says that has happened ...? | Sakshi
Sakshi News home page

సల్మాన్ చెప్పినట్లే... జరిగిందా?

Published Wed, Feb 17 2016 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

సల్మాన్ చెప్పినట్లే... జరిగిందా?

సల్మాన్ చెప్పినట్లే... జరిగిందా?

ఎప్పుడో జరిగిన సంఘటనలు చాలా కాలం తరువాతెప్పుడో వెలుగులోకి వస్తుంటాయి. సినీ రంగంలో అలాంటివి చాలానే జరుగుతాయి. అలా వెలుగులోకి వచ్చినప్పుడు అందరూ వాటి గురించే మాట్లాడుకుంటారు. ఇప్పుడు హిందీ రంగంలో అదే జరుగుతోంది. 2009లో హీరో సల్మాన్ ఖాన్ చేసిన ఓ రచ్చ గురించి తాజాగా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఆ రచ్చకూ, నటి కత్రినా కైఫ్‌కూ లింక్ ఉంది. ఈ బ్యూటీ సినిమాల్లోకొచ్చిన కొత్తల్లో అందానికి మాత్రమే మంచి మార్కులు తెచ్చుకుని, అభినయం విషయంలో మైనస్ అనిపించుకున్నారు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ అండదండలతో కత్రినాకు అవకాశాలు వచ్చాయి. ఓ నాలుగైదు సినిమాలు చేశాక, తనలో కూడా మంచి నటి ఉందని నిరూపించుకున్నారామె. ఏదైతేనేం తాను నిలదొక్కుకోవడానికి కారణమైన సల్మాన్ అంటే కత్రినాకు ముందు అభిమానం, ఆ తర్వాత అది ప్రేమగా మారడం జరిగిపోయాయి. కొన్నాళ్లు ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని బాగానే తిరిగారు. ఆ తర్వాత విడిపోయారు. అనంతరం మరో యువ హీరో రణ్‌బీర్ కపూర్‌కి కత్రినా మనసిచ్చారు.

అది సల్మాన్ భరించలేకపోయారు. ఓ రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి, కత్రినా ఇంటికెళ్లి రచ్చ రచ్చ చేశారట. ‘రణ్‌బీర్ కోసం నన్ను వదిలేశావ్. తప్పు చేస్తున్నావ్. కచ్చితంగా నీ మనసు ముక్కలవుతుంది. అప్పుడు పశ్చాత్తాపపడతావ్’ అంటూ సల్మాన్ నానా యాగీ చేశారనే విషయం అతని సిబ్బంది ద్వారా ఇప్పుడు వెలుగులోకొచ్చింది. ఆ రోజు సల్మాన్ నోటికొచ్చినట్లు కత్రినాను నిందించారట. చివరకు ఆయన డ్రైవర్ అతి కష్టం మీద సల్మాన్‌ను అక్కణ్ణుంచి తీసుకెళ్లారని భోగట్టా. అప్పుడు సల్మాన్‌ను పట్టించుకోని కత్రినా ఇప్పుడు రణ్‌బీర్ నుంచి విడిపోయాక... ఆ రోజు అతను అన్న మాటల్లో సత్యం ఉందని గ్రహించారేమో... ఇప్పుడు మళ్లీ దగ్గరయ్యారట! మరి... ఈ జంట మళ్ళీ దూరం కాకుండా ఎప్పటికీ  దగ్గరగానే ఉంటారా? ఏమో! కాలమే చెప్పాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement