ఇప్పుడు అవేవీ ఇంటికి తేవడం లేదు!
‘‘మీరు ఎంత మంచి నటి అయినా, అపారమైన ప్రతిభావంతురాలైనా విజయం మీ వైపు ఉండకపోతే వృథాయే. తెలుగులో నా తొలి చిత్రమే విజయం తాలూకు రుచి చూపించింది. తమిళంలో మాత్రం ముందు చేదు అనుభవం ఎదురైంది. ఆ తర్వాతే అక్కడ కూడా విజయం సాధించా’’ అని సమంత అన్నారు. ఇటీవల ఓ సందర్భంలో సమంత తన కెరీర్‌ను విశ్లేషించుకున్నారు. కథానాయిక అయిన కొత్తలో జయాపజయాలకు చాలా విలువ ఇచ్చేదాన్నని ఆమె అన్నారు. దానివల్ల ఎక్కువ ఒత్తిడికి గురయ్యేదాన్నని చెబుతూ - ‘‘విజయం ఎప్పుడూ తియ్యగానే ఉంటుంది.
కానీ, అపజయం భరించలేనంత చేదుగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండూ నాకు ఒకే విధంగానే అనిపిస్తున్నాయి. ఒకప్పుడు నా సినిమా ఏదైనా అపజయంపాలైతే చాలు, ‘ఎందుకిలా జరిగింది’ అని పదే పదే ప్రశ్నించుకునేదాన్ని. దానివల్ల నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడేవాళ్లు. ఆ తర్వాత నా తీరు మార్చుకున్నా. నటనను కేవలం వృత్తిగా చూస్తున్నా. ఇంటికి వరకూ తీసుకెళ్లడం లేదు. అప్పటి నుంచీ హాయిగా ఉంటోంది. నా గురించి పత్రికల్లో వచ్చే విమర్శలను పట్టించుకోవడం మానేశా. చివరికి వెబ్‌సైట్స్‌లో వచ్చే సినిమా సమీక్షలను కూడా పట్టించుకోవడం లేదు’’ అన్నారు.