రూ.100 కోట్లకు 'సరైనోడు' పరుగు
బన్నీ, బోయపాటి కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్ ‘సరైనోడు’
ఎర్ర తోలు కదా స్టయిల్‌గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర మాస్... అని ఏ ముహూర్తాన ‘సరైనోడు’ టీజర్ రిలీజ్ చేశారో కానీ, ఆనాటి నుండి ఆ డైలాగ్ అల్లు అర్జున్ అభిమానులు, తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నోట పదే పదే పలకడం విశేషం. టీజర్ విడుదలైనప్పట్నుంచీ ఈ చిత్రం కోసం అల్లు అభిమానులందరూ వెయిట్ చేసారు.
ఏప్రిల్ 22న రిలీజైన ‘సరైనోడు’ అల్లు అర్జున్ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చి, ఊర మాస్‌కి కనెక్ట్ అయితే సినిమా రేంజ్ ఎలా ఉంటుందో నిరూపించింది. మంచి మౌత్ టాక్‌తో కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోందీ చిత్రం. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం స్టయిల్‌గా ఉండాలి కదా.. ఊర మాస్ ఏంటి? అని అనుకున్న వాళ్ల అంచనాలు తారుమారు చేస్తూ వారినే ఓసారి ఆలోచింపజేసే విధంగా ‘సరైనోడు’ బాక్సాఫీస్‌పై తన పంజా విసురుతున్నాడు. చాలా ఏరియాల్లో ఇప్పటికే (వారం రోజులకే) టాప్ గ్రాసర్‌గా నిలిచింది ‘సరైనోడు’ చిత్రం.
దర్శకుడు బోయపాటి శ్రీనుకి మాస్ ప్రేక్షకుల నీరాజనాలు మెండుగా ఉన్నాయనటంలో అతిశయోక్తి కాదు. బోయపాటి శ్రీను గత చిత్రాలు దీనికి నిదర్శనం. అయితే స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ కమర్షియల్ డెరైక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎలా ఉండ బోతుంది? అని మీమాంసలో ఉన్న కొందరి ఊహలను తారుమారు చేస్తూ, బ్రహ్మాండమైన కలెక్షన్లతో మాస్, యూత్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ విజయపథంలో సాగుతోంది.
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో ఇప్పటికే మూడు చిత్రాలు ‘రేసుగుర్రం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘రుద్రమదేవి’ (స్పెషల్ రోల్) 50 కోట్ల క్లబ్‌లో ఉండగా ఇప్పుడు ‘సరైనోడు’ నాలుగో చిత్రంగా చేరబోతోంది. ఎంటైర్ ఫ్యామిలీ ఆడియన్స్ ‘సరైనోడు’ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ‘‘కేవలం 7 రోజుల్లో 72 కోట్ల గ్రాస్ వసూలు చేసి, 2016 బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రికార్డు క్రియేట్ చేసింది’’ అని ట్రేడ్ విశ్లేషకులు త్రినాథ్ రావు మీడియాకు తెలిపారు.
విజయనగరం, పార్వతీపురం లాంటి సెంటర్స్‌లో ఆల్ టైం రికార్డుగా కలెక్షన్లు రావటం, నెల్లూరు, సీడెడ్, వైజాగ్ వంటి ఏరియాల్లో బిగ్గెస్ట్ కలెక్షన్లతో దూసుకుపోవటం, వెస్ట్, ఈస్ట్, కృష్ణ, గుంటూరులో బన్నీ రేంజ్‌ని డబుల్ చేసే విధంగా కలెక్షన్ల రికార్డు క్రియేట్ అవ్వటం... మొత్తం మీద ఈ చిత్రం బన్నీ, బోయపాటి కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. గతంలో బన్నీ నటించిన చాలా చిత్రాలకు ఈ విధంగానే మిక్స్‌డ్ టాక్ రావటం.. అవి బన్నీ కెరీర్‌లో బెస్ట్ మూవీస్‌గా నిలవటం విశేషం. బన్నీ పెర్‌ఫార్మెన్స్, బోయపాటి శ్రీను దర్శకత్వం వంటి అంశాలు ఓవర్‌సీస్‌లో కూడా డాలర్ల వర్షం కురవడానికి కారణమయ్యాయి.