
మంచి ఛాన్స్ వదులుకున్న కట్టప్ప..
చెన్నై: బాహుబలి సినిమాలో తన విలక్షణ నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్న తమిళ నటుడు సత్యరాజ్ (కట్టప్ప) ఇపుడు ఒక మంచి అవకాశాన్ని వదులుకున్నాడట. బాహుబలి 2 సినిమా కోసం.. తమిళంలో అగ్రకథానాయకుడు విజయ్ సినిమాలో విలన్గా నటించే అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడట.
బాహుబలి 2 షూటింగ్ కోసం ఎక్కువ రోజులు కేటాయించాల్సి ఉండడంతోనే ఈ ఛాన్స్ మిస్ అయినట్టు సమాచారం. ఈ మూవీ కోసం కట్టప్ప 100 రోజులు కేటాయించనున్న నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ తో కలిసి నటించే అవకాశాన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఇంకా పేరు పెట్టని హీరో విజయ్ 59వ తమిళ సినిమాలో విలన్ పాత్ర కోసం సత్యరాజ్ను సంప్రదించారట. తప్పనిసరి పరిస్థితిలో, సమయాభావం వల్లనే కట్టప్ప విజయ్ సినిమాను పక్కన పెట్టాల్సి వచ్చిందంటున్నాయి సినీ వర్గాలు.
కాగా టాలీవుడ్ రికార్డులను తిరగరాస్తున్న ప్రతిష్టాత్మక సినిమా బాహుబలి సీక్వెల్ గా తెరకెక్కుతున్న బాహుబలి 2 లో కట్టప్ప పాత్ర కీలకంగా మారింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు, ఎలా హత్య చేశాడు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక కథనాలు కూడా ప్రచారం ఉన్నాయి. 2016 సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీలో రానా, అనుష్క ప్రభాస్ రమ్యకృష్ణ, తమన్నా ప్రధానపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.