నృత్యదర్శకుడు ముక్కురాజు కన్నుమూత | Senior Actor/Choreographer Mukku Raju is No More | Sakshi
Sakshi News home page

నృత్యదర్శకుడు ముక్కురాజు కన్నుమూత

Published Thu, Jul 31 2014 11:19 PM | Last Updated on Tue, Jul 31 2018 5:31 PM

నృత్యదర్శకుడు ముక్కురాజు కన్నుమూత - Sakshi

నృత్యదర్శకుడు ముక్కురాజు కన్నుమూత

ప్రముఖ సినీ నృత్యకళాకారుడు, నృత్య దర్శకుడు, నటుడు... సాగిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు(83) గురువారం తెల్లవారుజామున పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన. ముక్కురాజుకి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. నృత్య దర్శకుడు శివసుబ్రమణ్యం, ఎడిటర్ భూపతి కృష్ణంరాజు... ముక్కురాజుకు బావమరుదులే. స్వాతంత్య్రోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు ముక్కురాజు.
 
  1941 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని... ఇంగ్లిష్ చదువులు మాకొద్దంటూ.. ఆంగ్ల పుస్తకాలను బహిష్కరించిన చరిత్ర ముక్కురాజుది. సినీ స్వర్ణయుగంలో నృత్య కళాకారునిగా ముక్కురాజు ఓ వెలుగు వెలిగారు. ‘మాయాబజార్’(1955)లోని మోహినీ భస్మాసుర నృత్యరూపకంతో తెరకు పరిచయమయ్యారాయన. దాదాపు అయిదొందల చిత్రాల్లో తన నృత్యాలతో అలరించారు. రెండొందల పైచిలుకు చిత్రాలకు నృత్య దర్శకునిగా పనిచేశారు. ముక్కురాజు నర్తించిన ప్రత్యేకగీతాలు ఆ రోజుల్లో చాలానే ఉన్నాయి.
 
  ‘వెలుగునీడలు’(1964) చిత్రంలోని ‘పాడవోయి భారతీయుడా..’ పాటలో ముక్కురాజు నృత్యాభినయాన్ని తేలిగ్గా మరచిపోలేం. ముక్కురాజు కెరీర్‌లో తలమానికం ‘దక్షయజ్ఞం’(1962). ఆ సినిమా పతాక సన్నివేశంలో శివుని పాత్ర పోషించిన ఎన్టీఆర్ చేసిన ప్రళయతాండవం రూపకల్పనలో ముక్కురాజు పాత్ర చాలానే ఉంది. క్లోజప్‌లో ఎన్టీఆర్ కనిపించినా.. దూరం నుంచి ఆ నృత్యాన్ని అభినయించింది ముక్కురాజే. ఎన్టీఆర్‌కి తొలి రోజుల్లో వ్యక్తిగత నృత్య దర్శకునిగా వ్యవహరించారాయన. అలాగే.. చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’(1978), పునాదిరాళ్లు(1979), మనవూరి పాండవులు(1978) చిత్రాలకు నృత్య దర్శకునిగా పనిచేశారు. 80ల్లో కూడా పలు చిత్రాలకు నృత్యాలను సమకూర్చిన ముక్కురాజును నటునిగా ప్రోత్సహించినవారిలో ఆర్.నారాయణమూర్తిని ప్రముఖంగా చెప్పుకోవాలి.
 
 నారాయణమూర్తి రూపొందించిన దాదాపు ప్రతి సినిమాలో ముక్కురాజు ఉండేవారు. ముఖ్యంగా ‘ఎర్రసైన్యం’(1994)లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ‘1940లో ఓ గ్రామం’(2008) చిత్రంలో ముక్కురాజు నటనకు ఉత్తమ సహాయ నటునిగా నంది అవార్డు లభించింది. ‘చండాలిక నృత్యరూపకాన్ని’ ప్రముఖ నృత్య దర్శకులతో కలిసి దేశవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చారు ముక్కురాజు. హైదరాబాద్‌లో నృత్య దర్శకుల సంఘం ఏర్పాటు చేసింది కూడా ఆయనే. గత కొంతకాలంగా వృద్ధాప్యం కారణంగా తెరపై అంతగా కనిపించలేదాయన. ముక్కురాజు మరణం పట్ల తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా చెరుకువాడలో శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement