
సీనియర్ నటుడు కేఎన్.కాళై కన్నుమూత
తమిళసినిమా: సీనియర్ నటుడు, నడిగర్‌సంఘం ఉపాధ్యక్షుడు కేఎన్.కాళై(84) శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. వివిధ పాత్రల్లో 200 చిత్రాలకు పైగా నటించిన కేఎన్.కాళై అసలు పేరు కాళీశ్వరన్. తంజావూర్ జిల్లా కోవలడి గ్రామానికి చెందిన ఈయన తొలి రోజుల్లో దేవి నాటకసభ డ్రామా ట్రూప్‌లో రంగస్థల నటుడుగా కొనసాగారు.10 వేలకు పైగా నాటకాలు ఆడిన ఘనత కేఎన్.కాళైది. ఎమ్జీర్,శివాజీగణేశన్, ఎస్‌ఎస్.రాజేంద్రన్ పలువురు ప్రఖ్యాత నటులతో నటించారు. సినీ నటుడిగా 200లకు పైగా చిత్రాల్లో నటించారు. ఈయన డబ్బింగ్ కళాకారుడు కూడా.వెయ్యి చిత్రాలకు తన గొంతును అరువిచ్చారు. చంద్రముఖి చిత్రంలో రజనీకాంత్ వేటగాడి వేషంలో కనిపించిన ప్పుడు నేపథ్యంలో రాజాధిరాజ రాజగంభీర అనే మాటలు వినిపిస్తాయి.
అవి చెప్పింది కేఎన్.కాళైనే. ఈయన చివరిగా ఇటీవల తెరపైకి వచ్చిన శశికుమార్ హీరోగా నటించిన కిడారి. రాష్ట్రప్రభుత్వ కలైమామణి అవార్డుతో పాటు నడిగర్‌సంఘం అందించిన కళెసైల్వం అవార్డు, మలేషియా ప్రభుత్వం చేత నాటక కావలన్ వంటి పలు అవార్డులు కాళైను వరించాయి. నడిగర్ సంఘం కోశాధికారిగానూ, ఉపాధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. స్థానిక తే నాంపేటలో నివశిస్తున్న కేఎన్.కాళై భౌతిక కాయానికి నటుడు శరత్‌కుమార్, రాధారవి, దర్శకుడు కేఆర్.సెల్వరాజ్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. కేఎన్.కాళైకి భార్య టీకే.వసంత, కొడుకులు రాజు,రఘునాథన్ ఉన్నారు. కేఎన్.కాళై భౌతిక కాయానికి ఆదివారం స్థానిక ట్రిప్లికేన్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.