
‘ఇంద్రగంటిగారు నాకు ‘సమ్మోహనం’ కథ చెప్పినప్పుడే సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని అప్పుడే చెప్పా. నా మాట నిజమైంది. సుధీర్‌బాబు కెరీర్‌లోనే ఈ సినిమా ది బెస్ట్ అవుతుందని ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చెప్పా. నేను అన్నట్లుగానే జరిగింది’’ అని నటుడు నరేశ్ అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘సమ్మోహనం’ సినిమా ఈనెల 15న విడుదలైంది. ఈ చిత్రంలో హీరో తండ్రిగా నటించిన నరేశ్ మాట్లాడుతూ– ‘‘అన్ని చిత్ర పరిశ్రమలు ఇప్పుడు టాలీవుడ్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.
పెద్ద డైరెక్టర్స్‌తో పాటు చిన్న డైరెక్టర్స్ ఆరోగ్యకరమైన, మంచి సినిమాలు చేస్తున్నారు. సినిమాను సినిమాగా తీస్తే సక్సెస్ కావు. సామాన్య ప్రేక్షకుడి దృష్టితో తీయాలని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమాలో నేను భాగమైనందుకు గర్వపడుతున్నా. నటుడిగా ఎస్.వి.రంగారావుగారిని, కమల్‌హాసన్‌గారిని ఇష్టపడుతుంటాను. అందుకే నా కెరీర్ బిగినింగ్ నుంచి విలక్షణమైన పాత్రలు చేస్తున్నా’’ అన్నారు.