అయిదు పదుల వయసులో ఎనిమిది పలకలు!
అయిదు పదుల వయసులో సిక్స్ ప్యాక్ చేయడం అంటేనే రిస్క్. ఆ వయసులో ఉన్న షారుక్ ఖాన్ ఇంకో అడుగు వేసి ఏకంగా ఎయిట్ ప్యాక్ చేసేసి, బాలీవుడ్ మొత్తాన్ని నివ్వెరపోయేట్లు చేశారు. ప్రస్తుతం ఫరా ఖాన్ దర్శకత్వంలో ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రంలో షారుక్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసమే ఎనిమిది పలకల దేహంతో దృఢకాయుడిగా మారారు షారుక్. ప్రశాంత్ సావార్ అనే శిక్షకుని నేతృత్వంలో ఆయన ఈ ఫీట్ చేశారు. ‘ఓం శాంతి ఓం’ సినిమా కోసం గతంలో షారుక్ సిక్స్ ప్యాక్ చేశారు.
ఆ సినిమాకు కూడా ఫరాఖానే దర్శకురాలు కావడం విశేషం. ఏదో ఆడంబరం కోసం కాకుండా కథకు అవసరం కాబట్టే షారుక్ ఎయిట్ ప్యాక్ చేసినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలో షారుక్‌తో పాటు అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొనే, సోనూసూద్ కూడా ముఖ్య భూమికలు పోషిస్తున్న విషయం తెలిసిందే. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై షారుక్ భార్య గౌరీఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.