షారుక్ ఖాన్‌కు యశ్ చోప్రా అవార్డు
హైదరాబాద్: బాలీవుడ్ దర్శక నిర్మాత యశ్ చోప్రా జ్ఞాపకార్థం ప్రతి ఏటా అందజేసే యశ్ చోప్రా జాతీయ స్మారక అవార్డును ఈ ఏడాది బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ముంబైలో జరిగే ఓ కార్యక్రమంలో షారుక్‌కు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, రేఖ, శ్రీదేవి, రాణి ముఖర్జీ, ఐశ్వర్యా రాయ్, జయప్రద, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ తదితర బాలీవుడ్ ప్రముఖులు పాల్గొంటారు. టీఎస్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, కేంద్ర మాజీ మంత్రి టీ సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేశారు.
టీఎస్‌ఆర్, యశ్ చోప్రా సతీమణి పమేలా చోప్రా, పద్మిని కొల్హాపురి, బోనీ కపూర్‌లతో కూడా జ్యూరీ ఈ అవార్డుకు షారుక్‌ను ఎంపిక చేసింది. 2012లో యశ్ చోప్రా కన్నుమూశారు. యశ్ చోప్రా జ్ఞాపకార్థం టీఎస్‌ఆర్ ఫౌండేషన్ ఆయన పేరుమీద ఈ అవార్డును నెలకొల్పింది. ఇంతకుముందు ఈ అవార్డును ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, రేఖలకు అందజేశారు.