వెబ్‌సైట్‌లో సింగం 3 సన్నివేశాలు
పెరంబూర్: తమిళ్ రాకర్స్ కోర్టు తీర్పును ధిక్కరించి నిర్మాతపై చేసిన తన ఛాలెంజ్‌ను నెగ్గించుకుంది. కొంత కాలంగా ఈ వెబ్‌సైట్ కొత్త చిత్రాలను విడుదల రోజునే తమిళ్‌రాకర్స్ వెబ్‌సైట్ అక్రమంగా ప్రచారం చేస్తూ చిత్ర పరిశ్రమకు కంటకంగా మారింది. చాలా మంది నిర్మాతలు ఆ వెబ్‌సైట్ ప్రచారాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేక పోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో సూర్య కథానాయకుడిగా సీ–3 చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌రాజా తమిళ్‌రాకర్స్ వెబ్‌సైట్ నిర్మాహకుల అంతుచూస్తానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుకు ఆ వెబ్‌సైట్ నిర్వాహకుడు సీ–3 చిత్రాన్ని విడుదల రోజునే తన వెబ్‌సైట్‌లో పెడతానని ఛాలెంజ్ చేశాడు. కాగా నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ వెబ్‌సైట్‌పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనుమతి లేకుండా సీ–3 చిత్రాని వెబ్‌సైట్‌లో ప్రచారం చేయరాదని కోర్టు పేర్కొంది.
అయినా తమిళ్‌రాకర్స్ నిర్వాహకుడు తను ఛాలెంజ్ చేసినట్లుగానే గురువారం సీ–3 చిత్రం విడుదల కాగా ఇదే రోజున చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తన వెబ్‌సైట్‌లో ప్రచారం చేశాడు. అంతే కాదు మరో కొన్ని నిమిషాల్లో పూర్తి చిత్రాన్ని ప్రచారం చేస్తానని పేర్కొన్నాడు.దీంతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి చెందుతోంది.