
750 నాటౌట్!
‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో...’ – ‘గులాబి’ చిత్రంలోని ఈ పాటతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సుమధుర గాయని సునీత ఇప్పటివరకూ కొన్ని వేల పాటలు పాడారు. ఆమె మంచి గాయని మాత్రమే కాదు... డబ్బింగ్ ఆర్టిస్ట్, యాంకర్ కూడా. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన నూరవ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సునీతకి 750వ సినిమా. అందులో శ్రియ పాత్రకి ఆమె డబ్బింగ్ చెప్పారు. సంక్రాంతికి విడుదలైన శాతకర్ణి చిత్రం సునీత డబ్బింగ్‌కి సర్వత్రా ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా సునీత సంతోషం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ – ‘‘బాలకృష్ణగారి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రంలో నేనూ ఓ భాగం కావడం, చారిత్రక కథతో రూపొందిన శాతకర్ణి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నా 750వ చిత్రం కావడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు.
ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ, ‘‘సినిమా రంగంలో రకరకాల పాత్రలు పోషించినా, నాకు అత్యంత సంతృప్తికరమైన అంశం డబ్బింగే! ఏ సినిమాకు ఆ సినిమాలో పాత్రకు తగ్గట్లు, సీన్‌లోని భావోద్వేగానికి తగ్గట్టు పర కాయప్రవేశం చేసి స్వరదానం చేయడం ఒక సవాల్’’ అన్నారు. ‘శ్రీరామదాసు’లో స్నేహకీ, ‘శ్రీరామరాజ్యం’లో నయనతారకీ చెప్పిన డబ్బింగ్ ఎప్పటికీ మర్చిపోలేననీ, బాపు లాంటి మహానుభావులతో పనిచేయడం అదృష్టమనీ అన్నారు.