సంక్రాంతి సోగ్గాడు | soggade chinni nayana movie review | Sakshi
Sakshi News home page

సంక్రాంతి సోగ్గాడు

Published Sat, Jan 16 2016 10:34 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

సంక్రాంతి సోగ్గాడు - Sakshi

సంక్రాంతి సోగ్గాడు

చిత్రం: ‘సోగ్గాడే చిన్ని నాయనా’
తారాగణం: నాగార్జున, లావణ్యా త్రిపాఠీ, రమ్యకృష్ణ
మూలకథ: పి. రామ్మోహన్
స్క్రీన్‌ప్లే: సత్యానంద్
కళ: ఎస్. రవీందర్
కెమేరా: పి.ఎస్. వినోద్, ఆర్. సిద్ధార్థ్

ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత: అక్కినేని నాగార్జున
రచన - దర్శకత్వం: కల్యాణ్‌కృష్ణ కురసాల

 
కొత్త సినిమా గురూ!
సాంఘికం, పౌరాణికం, జానపదం, సోషియో ఫ్యాంటసీ- ఇలా సిన్మాలు పలు కోవలు. ఒక్కో కోవలో - రొమాంటిక్ లవ్, రివెంజ్ ఫార్ములా, ఘోస్ట్, యాక్షన్ లాంటి సవాలక్ష ఫార్ములాలు. ఇవన్నీ పాత చింతకాయలే కావచ్చు. కానీ ఆ రకరకాల జానర్స్ సినిమాలకూ, ఈ పలు రకాల ఫార్ములాలకూ అంటు కడితేనో? పువ్వులు, పండ్లు కొత్తగా ఉంటాయి. రొమాంటిక్ కథ, సోషియో- ఫ్యాంటసీ లైన్, రివెంజ్ యాంగిల్- ఇలా అన్నిటికీ అంటుకట్టడంతో వచ్చిన వెరైటీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’. గోదావరి జిల్లాల్లోని శివపురం గ్రామంలో బంగార్రాజు (నాగార్జున) పిల్ల జమీం దార్.
 
ఆ సరసాల సోగ్గాడి భార్య సత్యభామ (రమ్యకృష్ణ). ఆమె కడుపుతో ఉన్నప్పుడు యాక్సిడెంట్‌లో చనిపోతాడు. ‘ఎక్కని గడప, దూకని గోడ లేని’ భర్త లానే పుట్టిన కొడుకు రాము (నాగార్జునే)ను అమ్మాయిలకు దూరంగా, అతి జాగ్రత్తగా పెంచుతుంది. రాము భార్య సీత (లావణ్యా త్రిపాఠీ). అమెరికాలోని టాప్ ఫైవ్ డాక్టర్స్‌లో ఒకడిగా స్థిరపడ్డ రాముకి పనే లోకం.
 
భార్య మీద ప్రేమను కూడా పైకి వ్యక్తం చేయని అమాయకుడు. దాంతో, విడాకులకు సిద్ధమై, సత్యభామకు చెప్పడం కోసం ఇండియాలోని ఊరికొస్తారు. వీటన్నిటికీ మొగుడు బంగార్రాజు కారణమని తల్లి నిందిస్తుంది. అప్పుడు యముడి అనుమతితో తండ్రి ఆత్మ భూలోకానికి వస్తుంది. ఈ ఫ్రెండ్లీ ఘోస్ట్ ఇక్కడ భార్యకు మాత్రమే కనపడుతూ, వినపడుతూ కొడుకు కాపురం చక్కదిద్దడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే కథ చాలా మలుపులు తిరుగుతుంది.
 
ఒకదానికొకటి సంబంధం లేని బంగార్రాజు, రాము పాత్రల్ని గెటప్, మనిషి, మాట తీరుతో సహా నాగ్ చాలా సహజంగా చేశారు. బంగార్రాజు లాంటి నవ మన్మథ పాత్రలు ఆయనకు స్వభావసిద్ధం. అమాయ కుడైన కొడుకుగా కూడా అంతే డిగ్నిఫైడ్ లుక్‌తో, యాక్షన్‌తో మెప్పించారు. ఇక, వయసు మీద పడుతున్నా అందాన్నీ, దర్పాన్నీ వదులుకోని ఈ సత్యభామ పాత్రకు రమ్యకృష్ణ సరిగ్గా సరిపోయారు.
 
పెళ్ళయి మూడేళ్ళయినా, మూడుసార్లకు మించి కలవని కెరీరిస్ట్ డాక్టర్ భర్తతో విడాకులు కావాలని కోరుకొనే భార్య సీత పాత్ర వేదన ఆధునిక సమాజంలో కనిపించేదే. అందులో లావణ్యా త్రిపాఠీ ఒదిగారు. ఆత్మలతో మాట్లాడతాననే ‘ఆత్మానంద’ స్వామిగా బ్రహ్మానందం నవ్విస్తారు. కుర్ర నాగార్జున పక్కన వరసయ్యే మరదళ్ళుగా అనసూయ, హంసానందిని కనువిందు కోసం కనిపిస్తారు.
 
బంగార్రాజు ఆత్మ కిందకు రావడమేమిటి, భార్యకే కనపడడం, వినపడడమేమిటి, మళ్ళీ ఆత్మానందా నికీ కన్వీనియంట్‌గా తెలియడమేమిటి లాంటి లాజిక్‌లు అడ్డం పడినప్పుడల్లా యముడి పాత్రలో నాగబాబు వచ్చి, కన్వీనియంట్‌గా వివరణలిస్తారు. స్వర్గీయ ఏయన్నార్ హిట్ పాట ‘సోగ్గాడే చిన్ని నాయనా...’ రీమిక్స్ ఫ్యాన్స్‌కు పండగ. ప్రధానంగా చెప్పు కోవాల్సింది - కెమేరా వర్క్. గ్రామీణ వాతావరణాల సొగసును ప్రతిఫలిం చింది. ఒకరికి నలుగురు అమ్మాయిలతో తిరిగే పిల్ల జమీందార్లు పల్లెటూళ్ళలో సాధారణం.
 
కానీ, హీరోకు అలాంటి క్యారెక్టరైజేషన్ పెట్టి, అదే సమయంలో అతడు మంచివాడనిపించేలా చేయడం ఒక సవాలు. దానికి తోడు చిలిపి చేష్టల్ని చెబుతూ, చూపెడుతూనే, హద్దులు దాటకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఒప్పించడం మరొక సవాలు. దర్శక, రచయితలు ఆ పరీక్ష పాసయ్యారు. మగవాళ్ళే కాదు... ఆడవాళ్ళు కూడా ముసిముసి నవ్వులతో మురిసి పోతూ కథకు కనెక్టయ్యేలా ఆ సెన్సుయల్ రొమాన్స్‌ను ఎంటర్‌టైనింగ్‌గానే తెరపైకి తేగలిగారు. ఒకప్పుడు ఇలాంటివన్నీ ‘అశ్లీలం’ అనుకొన్న ప్రేక్షకులు కాలంతో పాటు ఎంతగా మారారనడానికి ఇదే పెద్ద ఉదాహరణ.
 
అలాగే, తండ్రి, కొడుకుకు సరసాన్ని నేర్పించడమనేది నిజానికి వినడానికీ, ఏ మాత్రం తేడా వచ్చినా తెర మీద చూపించడానికీ తప్పుగా ధ్వనించే ప్రమాదం ఉంది. కానీ, అంగీకారయోగ్యంగా చూపించడం రచన చేసిన అనుభవజ్ఞుల నేర్పుకు నిదర్శనం. ‘చిత్రిక పట్టిన టేకు చెక్కలాగా వట్రంగా ఉన్నావే’, ‘తొక్కి నార తీయడం’ లాంటి సహజమైన తెలుగు పలుకుబడులు చాలా రోజులకి తెరపై వినిపించాయి.   
 
కథలో ‘మూడు పుష్కరాల (36 ఏళ్ళ) క్రితం... శివరాత్రి ముందు రాత్రి’ విలన్ ముఠాకు తాచుపాము కాటు, బంగార్రాజు చనిపోవడం లాంటివి జరుగుతాయి. కానీ, సినిమాలో 30 ఏళ్ళ క్రితం బంగార్రాజు పోయాడని ఒకటి, రెండుసార్లు అనిపి స్తారు. పాటలో అలా మెరిసి, ముగిసే కృష్ణకుమారి పాత్రలో హాట్ హీరోయిన్ అనూష్క కనిపించడం ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్. అయితే, బంగార్రాజు అమితంగా ఇష్టపడ్డ ఆ కృష్ణకుమారి పాత్రకు క్లారిటీ, కన్‌క్లూజన్ వెతక్కూడదు. ఎంత ఆత్మ వచ్చి దూరినా, కొడుకు పాత్రొచ్చి ఆమెతో అప్పటి సరసాలు సరదాలు గుర్తు చేసినప్పుడు అసహనం సహజం.
 
బంగార్రాజు ఆత్మను మళ్ళీ భూలోకానికి యముడు పంపడానికి కారణం లాంటివి వెతక్కూడదు. సినిమా చూసి బయటకొచ్చాక దీర్ఘంగా ఆలోచిస్తే, ఇలాంటివన్నీ బుర్రకు తడతాయి. కానీ, గమ్మత్తేమిటంటే చూస్తున్నంత సేపూ అసలీ ఆలోచనలేవీ రానివ్వకుండా సినిమాను నడిపించడం! అది ఈ సినిమాకు పెద్ద ప్లస్.
 
తొలిచిత్ర దర్శకుడైన కల్యాణ్‌కృష్ణకు సమష్టి కృషి తోడుగా, సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌కు ఇది ముందడుగు. వెరసి, మన పల్లెటూళ్ళు, మన వాతావరణం, మన తెలుగువారి పంచెకట్టు, మన బంధుత్వాలు, సరదాలను తెరపైకి తేవడంతో ఇది అచ్చమైన సంక్రాంతి ఫెస్టివల్ ఫిల్మ్. కుటుంబమంతా హ్యాపీగా చూసే అవకాశాలతో సంక్రాంతి రిలీజుల బాక్సాఫీస్ పందెంలో గెలుపుకోడి.
 
- రెంటాల జయదేవ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement