
సోగ్గాడి ఎంట్రీ మరింత ఆలస్యం
'మనం' సినిమా తరువాత ఇంతవరకు వెండితెర మీద కనిపించని కింగ్ నాగార్జున తదుపరి సినిమా మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. ప్రస్తుతం నాగ్ రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్నా, అభిమానులు ఆ సినిమాల కోసం కొత్త ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే అని తెలుస్తోంది.
నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న 'సొగ్గాడే చిన్నినాయన' ఈ ఏడాది చివర్లో రిలీజ్ అవుతుందని భావించారు. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్లను రీషూట్ చేయాల్సి రావటంతో సినిమా మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా, మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా రషెస్ చూసిన రచయిత సాయి మాధవ్ బుర్రా కొన్ని సన్నివేశాలను తిరిగి చిత్రీకరించాలని సూచించడంతో రీషూట్ ఆలోచనలో ఉన్నారు యూనిట్. దీంతో ఈ డిసెంబర్ లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా, ఇప్పుడు మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.
సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున తాత, మనవడిగా రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నాగ్ ఆత్మ రూపంలో కూడా కనిపించనున్నాడట. నాగార్జున ఈ సినిమాతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా ఊపిరి షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు.