
1500 ఏళ్ల నాటి ఆలయంలో...
మైసూర్‌కు 40 కిలో మీటర్ల దూరంలో గల తొన్నూరు గ్రామంలోని ఓ పురాతన దేవాలయం అది. అక్కడ వేణుగోపాల స్వామి, నంబి నారాయణ స్వామి కొలువై యున్నారు. కర్ణాటకలో ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయాన్ని 1500 ఏళ్ల క్రితం నిర్మించారట. నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ, నాజర్, సంపత్, చలపతిరావు, బ్రహ్మాజీ తదితరులంతా సంప్రదాయ దుస్తుల్లో ఈ గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం కోసం వీరందరిపై ఈ సన్నివేశాలను చిత్రీకరించారు.
తేజ, పోసాని కృష్ణ మురళి తదితరుల దగ్గర పనిచేసిన కల్యాణ్ కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘అష్టాచమ్మా’ ఫేమ్ రామ్మోహన్‌తో కలిసి నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మనం’ తర్వాత కొంత విరామం తీసుకుని బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంపై ఫోకస్ చేసిన నాగార్జున, ఈ కథ నచ్చడంతో వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ కథానాయికలు. ఒకప్పుడు నాగ్-రమ్యకృష్ణలది హిట్ పెయిర్.
‘హలో బ్రదర్’ లాంటి హిట్ సినిమాల్లో నటించిన ఈ జంట 15 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి చేస్తున్నారు. గత మూడు రోజులుగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ షూటింగ్ మైసూర్ పరిసరాల్లో జరుగుతోంది. ఈ నెల 15 వరకు అక్కడే షెడ్యూలు జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకూ అధికారిక సమాచారం లేదు. అయితే నాగార్జున మాత్రం చాలా ఉత్సాహంగా సోషల్ మీడియాలో షూటింగ్ లొకేషన్‌లోని పలు ఫొటోలను పోస్ట్ చేస్తూ, సినిమా గురించి పలు వాఖ్యలు చేస్తున్నారు. పైన ఉన్న ఫొటో కూడా ఆయనే పోస్ట్
చేశారు.