'అది తప్ప అంతా సేమ్ టు సేమ్'
ముంబై: చరిత్ర పొడవునా ఒకటిగా ఉండి, 60 ఏళ్ల కిందట విడిపోయిన పాకిస్థానీ, హిందుస్థానీల మధ్య ప్రధాన తేడా ఏంటి? బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మాటల్లో చెప్పాలంటే.. 'రూపం, భాష, వేషం, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం.. అన్నీ సేమ్ టు సేమ్. ఒక్క క్రికెట్ విషయంలోతప్ప! ఇన్ని సిమిలారిటీస్ ఉన్న దేశాల మధ్య కళాసంబంధాలు క్షీణించడానికి రాజకీయపరమైన కారణాలు ఎన్నైనా ఉండొచ్చు.
కానీ నిజజీవిత గాథ ఆధారంగా రూపొందించిన 'నీర్ జా' లాంటి సినిమాను పాకిస్థాన్ లో నిషేధించడం దారుణం' అని అంటోదామె. అంతేకాదు, అసలు నీర్ జా సినిమాను ఎందుకు బ్యాన్ చేశారో బాహాటంగా వెల్లడించాలని దాయాది దేశాన్ని డిమాండ్ చేస్తోంది. ఆమె ఆగ్రహం వెనుక బలమైన కారణం ఉంది. అది ఏంటంటే..
ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా నీర్ జా ఘన విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సోనమ్.. తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ గంటలుగంటలు లైవ్ చాటింగ్ లు చేస్తోంది. ఆ క్రమంలో పాకిస్థాన్ లోని ఆమె అభిమానులు కూడా 'మేడం.. సినిమా చాలా బాగుంది. మీరు అద్భుతంగా నటించారు' అని కాంప్లిమెంట్లు ఇచ్చారట. పాక్ లో రిలీజ్ కాకున్నా వాళ్లెలా చూశారు చెప్మా? అని ఆరా తీయగా.. ఆ దేశంలో నీర్ జా పైరసీ డీవీడీలు లక్షల సంఖ్యలో అమ్ముడవుతున్నట్లు తెలుసుకుంది. అంతే.. ప్రెస్ మీట్ పెట్టిమరీ పాక్ ను కడిగేసింది సోనమ్.
'ఇది బాధాకరమైన విషయం. పాకిస్థాన్ తీరు నన్ను నిరాశపర్చింది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. రెండువైపులా రాజకీయాలు ఉండొచ్చు. కానీ నేను ముందు నుంచి చెబుతున్నట్లు కళలు, క్రీడా రంగాలకు రాజకీయాలను ముడిపెట్టొద్దు' అని సోనమ్ కపూర్ అభ్యర్థించింది. హైజాకర్ల చెరనుంచి ప్రయాణికులను కాపాడే క్రమంలో తాను ప్రాణాలు కోల్పోయిన ఎయిర్ హోస్టెస్ నిర్ జా బానోత్ జీవితం ఆధారంగా రూపొందించిన నీర్ జా సినిమా భారత్ లో ఫిబ్రవరి 19న విడుదలైన సంగతి తెలిసిందే.