నీతులు చెప్పడానికి బూతులు అవసరంలేదు
సోనియా అగర్వాల్ గర్తుంది కదా! ‘7/జి బృందావన కాలనీ’ అనే ఒకే ఒక్క సినిమాతో స్టార్ అయిపోయారామె. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా ఏదీ బ్రేక్ ఇవ్వలేదు. కొంత విరామం తర్వాత తెలుగులో ‘నాకు కొంచెం టైమ్ కావాలి’ అనే చిత్రం అంగీకరించారామె. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. సీతారామ ఫిలింస్ పతాకంపై వెంకటేశ్ రెబ్బ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భానూరు నాగరాజు (జడ్చర్ల) నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచాన్‌చేయగా, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి క్లాప్ ఇచ్చారు.
దర్శకుడు వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘రేపు గురించి మనకు ఈరోజే తెలిసిపోతే సంతోషంగా ఉండలేం... అందుకే భవిష్యత్తుని తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. నీతులు చెప్పడానికి బూతులు అవసరంలేదని చెబుతున్నాం’’ అన్నారు. మూడు షెడ్యూల్స్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తామని నాగరాజు చెప్పారు. కాలేజ్ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం ఇదని సోనియా అగర్వాల్ తెలిపారు. నాగేంద్ర, వంశీ, ఫణిచంద్ర, పల్లవి, శ్రేష్ట హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి.