
బెగ్గర్‌గా మారి.. రోడ్డుపక్కన సింగర్ పాటలు!
నగర జీవితమంటేనే ఉరుకులు, పరుగులతో గజిబిజీగా సాగిపోతుంటుంది. తమ చుట్టుపక్కల పరిసరాల్లో ఏం జరుగుతుందో ఆగి చూసి.. తెలుసుకొనే తీరిక ఇప్పుడు ఎవరికీ లేదు. ఎవరి పనుల్లో వారు మునుగుతూ వేగంగా సాగిపోవడమే జీవిత పరమార్థంగా మారిపోయింది. మన పరిసరాల్లో ఓ అద్భుతం జరుగుతున్నా.. ఓ అద్భుతమైన స్వరం గొంతెత్తి పాడుతున్నా.. ఆగి విని ఆస్వాదించే ఓపిక నగర జనానికి లేకపోయింది. అంతా కాలమహిమ!
ఇదే విషయం తాజాగా ఓ ప్రఖ్యాత సినీ గాయకుడి విషయంలోనూ రుజువైంది. బాలీవుడ్ మధుర గాయకుడు సోను నిగమ్ ఇటీవల బిచ్చగాడి అవతారంలో ముంబైలో ప్రత్యక్షమయ్యాడు. నిత్యం రద్దీగా ఉండే ఓ కార్నర్‌లో రోడ్డుపక్కన హార్మోనియం పెట్టుకొని జీవిత సత్యాలను గానం చేస్తుండగా.. సోనును ఎవరు గుర్తించలేదు సరికదా! మొదట్లో ఎవరు ఒక రెండు సెకన్లు ఆగి ఆయన గాన మాధుర్యాన్ని ఆస్వాదించే ప్రయత్నించలేదు. మెల్లమెల్లగా ఒకరిద్దరు మూగి ఆయన గాన గాంధర్వాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టారు. కొందరు సంగీతప్రియులు ఆయన మధుర గానాన్ని తమ ఫోన్లలో రికార్డు చేసుకున్నారు. కొందరు డబ్బులు ఇచ్చారు. ఓ యువకుడు ముందుకొచ్చి 'నువ్వు ఏమైనా తిన్నావని' బెగ్గర్ వేషంలో ఉన్న సోను నిగమ్ ను అడిగాడు. సోను చేతిలో 12 రూపాయలు పెట్టి మౌనంగా వెనుదిరిగాడు.
'బీయింగ్ ఇండియన్' యుట్యూబ్ చానెల్‌తో కలిసి సోను నిగమ్ ఈ సామాజిక ప్రయోగాన్ని (సోషల్ ఎక్స్‌పెరిమెంట్) చేశారు. చివరివరకు తాను ఎవరిననే విషయాన్ని చెప్పకుండా ఆయన తన గానాన్ని కొనసాగించారు. దేశంలో ప్రముఖ సంగీత స్వరమైన సోను నిగమ్ గొంతును ఎవరు గుర్తుపట్టకపోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.