ఫైల్ ఫోటో
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో సోనూసూద్ (46) వలస కార్మికుల సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్ మహమ్మారి, లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులకు ఎనలేని సేవ చేసి సూపర్ హీరోగా నిలిచిన సోనూసూద్ తాజాగా వారికి ఉపాధిని అందించేందుకు ఒక కొత్తయాప్‌ను విడుదల చేశారు. కరోనా సంక్షోభంతో ఉపాధి లేక అల్లాడుతున్న వలస కార్మికులను ఆదుకునే లక్ష్యంతో ఈ యాప్‌ను ఆవిష్కరించారు. 'ప్రవాసీ రోజ్‌గార్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఉచిత ఆన్లైన్ ప్లాట్ ఫామ్‌ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాల కల్పనలో సహకారం అందించనున్నారు.
గత కొన్ని నెలలుగా దీనిపై కసరత్తు చేసినట్టు సోనూ సూద్ వెల్లడించారు. ఉపాధి కోల్పోయి సొంత ప్రదేశాలకు చేరుకున్న కార్మికులకు సాయం అందించేలా వివిధ టాప్ సంస్థలు, ఎన్‌జీవోలు, దాతృత్వ సంస్థలు, ప్రభుత్వ కార్యనిర్వాహకులు, స్ట్రాటజీ కన్సల్టెంట్స్, టెక్నాలజీ స్టార్ట్ యాప్స్ తో విస్తృతంగా చర్చించి దీన్ని తీసుకొచ్చినట్టు సూద్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వలస కార్మికులకు సరైన ఉపాధి అవకాశాలు అందించేలా ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ రూపొందించినట్టు చెప్పారు. ప్రధానంగా నిర్మాణ రంగం, దుస్తులు, ఆరోగ్య సంరక్షణ, ఇంజనీరింగ్, బీపీవోలు, సెక్యూరిటీ, ఆటోమొబైల్, ఇ-కామర్స్, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన 500 ప్రసిద్ధ కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నామన్నారు. అలాగే స్పోకెన్ ఇంగ్లీషు శిక్షణతోపాటు నిర్దిష్ట ఉద్యోగాలకు కూడా శిక్షణా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోయంబత్తూర్, అహ్మదాబాద్, తిరువనంతపురంలో 24x7 హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment