
ముంబై: బాలీవుడ్ నటుడు సోనూసూద్ వలస కార్మికులపట్ల తనకున్న ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటికే పలు రైళ్లు, బస్సులు ఇతర రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేసిన సోనూసూద్ తాజాగా 20 వేల మందికి ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఆశ్రయం కల్పించనున్నట్లు సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రకటించారు.
(చదవండి : త్వరలోనే వస్తా.. మిమ్మల్ని కలుస్తా: సోనూసూద్)
‘‘20 వేల మంది వలస కార్మికులకు వసతి, గార్మెంట్ ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలూ కల్పిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రవాసీ రోజ్‌గార్ ద్వారా ఈ మంచి పని కోసం అందరం కష్టపడ్డామని, ఎన్‌ఏఈసీ అధ్యక్షుడు లలిత్ ఠుక్రాల్ ఎంతో సాయం చేశారని, కార్మికులందరికీ ఆరోగ్యకరమైన వాతావరణంలో వసతి కల్పిస్తామని సోనూసూద్ హామీ ఇచ్చారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందుల పడుతున్న వలస కార్మికుల సాయం కోసం సోనూసూద్ ఓ టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అవసరమైన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ఆయన ఇటీవల ఒక స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను కూడా ప్రారంభించారు.