నేనే రాణి.. నేనే మంత్రి | Special Chit Chat With Heroine Kajal Aggarwal | Sakshi
Sakshi News home page

నేనే రాణి.. నేనే మంత్రి

Published Sun, Jan 20 2019 1:24 AM | Last Updated on Sun, Jan 20 2019 8:29 AM

Special Chit Chat With Heroine Kajal Aggarwal - Sakshi

నా లైన్‌ నాదే. నా లైఫ్‌ నాదే.  ‘ఇండస్ట్రీలో అలా ఉంటుంది కదా.. ఇలా ఉంటుంది కదా’ అంటే.. ఎలాగున్నా..  మనం మనలా ఉండగలిగితే మన వరకు ఇబ్బందులు రావు.  అంటే.. మనల్ని మనం ప్రొటెక్ట్‌ చేసుకోగలగాలి.  అందరికీ అది చేత కాకపోవచ్చు.  నా వరకైతే, నేనే రాణి. నేనే మంత్రి!  అంటున్న కాజల్‌ అగర్వాల్‌తో సాక్షి ఎక్స్‌క్లూజివ్‌..

చాలా సన్నగా అయిపోయారు. ఏం చేశారేంటి?
కాజల్‌: అవునా? చూడ్డానికి సన్నగా కనిపిస్తున్నానేమో కానీ యాక్చువల్లీ నేను బరువు పెరిగాను. విచిత్రంగా చాలామంది నన్ను సన్నగా అయ్యారేంటి? అని అడుగుతున్నారు.

ఇంతకీ ఎంత పెరిగారు? తగ్గాలనుకుంటున్నారా?
ఇంతకుముందు 54 ఉండేదాన్ని.. 3 కిలోలు పెరిగినట్టున్నా. అయితే తగ్గాలని మాత్రం అనుకోవడంలేదు. ఎందుకంటే కంఫర్ట్‌బుల్‌గానే ఉన్నాను (నవ్వుతూ).  

గతంలో వంద సూర్య నమస్కరాలు చేసేవారు? ఇప్పుడూ చేస్తున్నారా?
లేదు. దిష్టి తగిలినట్టుంది (నవ్వుతూ). మళ్లీ స్టార్ట్‌ చేస్తాను.

హీరోయిన్‌ అయి పదేళ్లవుతోంది? ఈ టెన్‌ ఇయర్స్‌ జర్నీ ఎలా అనిపిస్తోంది? 
చాలా బాగుంది. పదేళ్లు గడిచాయి అని మాత్రం అనిపించడం లేదు. గ్రేట్‌ రన్‌. నేను చాలా ‘బ్లెస్డ్‌’ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఇంత ప్రేమ దొరుకుతుందని అనుకోలేదు. నన్ను తెలుగుమ్మాయిగా స్వీకరించిన నా ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు. అఫ్‌కోర్స్‌ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలను మరచిపోకూడదు. 

ఈ పదేళ్లలో ఎప్పుడైనా బ్రేక్‌ వస్తుందని భయపడిన సందర్భాలున్నాయా?
ఆ భయం ఎప్పుడూ కలగలేదు. ఎందుకంటే ఒక సినిమా కంప్లీట్‌ అయ్యేసరికి ఇంకో సినిమా చేతిలో ఉండేది. ఒక్కోసారి రెండు మూడు సినిమాలు ఉండేవి. అయితే రెండే రెండు సార్లు బ్రేక్‌ వచ్చింది. అవి కూడా నా అంతట నేను తీసుకున్నవి. నా చెల్లెలు నిషా పెళ్లి కోసం ఒక బ్రేక్‌ తీసుకున్నాను. అక్కగా అన్నీ దగ్గరుండి చేయాలి కాబట్టి నెల రోజులు షూటింగ్స్‌కి ఎటెండ్‌ కాలేదు. ఆ తర్వాత 2018 స్టార్టింగ్‌లో ఆరోగ్యం బాగాలేక మూడు నెలలు ఇంటిపట్టున ఉన్నాను.

పదేళ్లు కంటిన్యూస్‌గా పని చేసి, ఏదో అలా రిలాక్స్‌ అవ్వడానికి కొన్ని రోజులంటే ఓకే. ఏకంగా మూడు నెలలంటే బోరింగ్‌గా అనిపించిందా?
బోర్‌ సంగతి పక్కన పెడితే ప్రతి రోజూ జ్వరంతో ఒళ్లు కాలిపోయేది. ‘హెల్త్‌ ఈజ్‌ వెల్త్‌’ అంటారు కదా. ఆరోగ్యంగా ఉండటం లైఫ్‌లో అన్నింటికన్నా ముఖ్యం. అందుకే ఫుల్‌గా రిలాక్స్‌ అవ్వాలని ఏ టెన్షన్సూ పెట్టుకోలేదు. ఈ మూడు నెలలు ‘ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌’తో బాధపడ్డా.

మూడు నెలలూ మీవాళ్లు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుని ఉంటారు...
మా అమ్మానాన్నలకు పిల్లలంటే చాలా శ్రద్ధ. నేను సినిమాల్లోకి వచ్చాక నాతో పాటే ఉంటూ, నాక్కావాల్సినవన్నీ సమకూర్చేవారు. అమ్మ అయితే స్వయంగా వంట చేసి పెట్టేది. ఇప్పుడు అమ్మని షూటింగ్‌ స్పాట్‌కి రావద్దని నేనే చెప్పేశాను. ఎందుకంటే ఇంకా ఎంతకాలం నాకోసం కష్టపడతారు. ఇది విశ్రాంతి తీసుకునే వయసు కదా. అమ్మ నాతో రావడంలేదు కాబట్టి నేను హోమ్‌ ఫుడ్‌ని చాలా మిస్సవుతున్నాను. అందుకే ఇంట్లో ఉన్న ఆ 3 నెలలూ మా అమ్మమ్మ, అమ్మ నెయ్యి విపరీతంగా దట్టించి, పరాటాలు చేసి పెట్టేశారు. పంజాబీ ఇల్లంటే స్వీట్లు, నెయ్యి, పన్నీర్‌ ఫుల్లుగా ఉంటాయి. అందుకే కాస్త బరువు పెరిగాను. 

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లయింది కాబట్టి బోలెడంతమంది ఫ్రెండ్స్, పార్టీలు కామన్‌. కానీ మీరు పార్టీల్లో పెద్దగా కనిపించరెందుకని?
నా ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటాను. వాళ్లంతా ముంబైలో ఉంటారు. ఇండస్ట్రీలో కూడా ఏదైనా పార్టీ ఉంటే ఫార్మాలిటీగా అటెండ్‌ అవుతాను. పర్సనల్, ప్రొఫెషనల్‌ జీవితాన్ని మిక్స్‌ చేయకూడదని అనుకుంటాను. నా చైల్డ్‌ హుడ్‌ ఫ్రెండ్స్‌తో కంఫర్ట్‌బుల్‌గా ఉంటుంది. స్విచ్చాన్‌ స్విచ్చాఫ్‌ బటన్‌లాగా. వర్క్‌ అప్పుడు పార్టీలు చేసుకోలేను. ఎందుకంటే మళ్లీ మరుసటిరోజు నిద్ర లేవాలి. జిమ్‌కి వెళ్లాలి. షూట్‌కి వెళ్లాలి. ఇన్ని పనులు చేశాక ఎప్పుడెప్పుడు ముసుగు తన్నేద్దామా అనిపిస్తుంటుంది. ఇక పార్టీ అనే ఆలోచన ఉంటుందా? టీవీ చూస్తుంటాను. ఇంట్లో వాళ్లతో ఫోన్‌లో మాట్లాడతాను. 

అయితే జనరల్‌గా మీ రోజు ఎలా మొదలవుతుంది?
ఉదయం ఐదు గంటలకు నిద్రలేస్తాను. అలారంతో పని లేదు. కొన్నేళ్లుగా ఐదింటికి నిద్రలేస్తున్నాను కాబట్టి శరీరం అలవాటు పడిపోయింది. అయితే షూటింగ్స్‌ లేనప్పుడు ఎక్కువసేపు నిద్రపోతా. రాత్రి నిద్రపోవడానికి దాదాపు పదకొండు అవుతుంది. 5 టు 11 వర్కవుట్స్, షూటింగులు. షూటింగులు లేకపోతే వేరే పనులు.. అలా బిజీబిజీ.

ఈ మధ్య కొందరు హీరోయిన్లు పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ‘ఇది పెళిళ్ల్ల సీజన్‌. నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది’ అని ఓ సందర్భంలో అన్నారు. మరి పెళ్లెప్పుడు?
ఏదో సరదాగా జోక్‌ చేశాను. అంతేకానీ ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్‌ అవ్వాలని లేదు.

లవ్‌ మ్యారేజా? అరేంజ్డ్‌ మ్యారేజా?
లవ్‌ అంటే లవ్‌ అనలేను. నచ్చిన అబ్బాయి దొరికితే ఓకే. లేకపోతే అరేంజ్డ్‌ మ్యారేజ్‌ చేసుకుంటా. ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకోవడంలేదు.

ఇండస్ట్రీలో వాళ్లను చేసుకోకూడదని ఎందుకు అనుకుంటున్నారు?
అలా అని కాదు. ఒకవేళ ఎవరైనా నచ్చితే తప్పకుండా చేసుకుంటా. ఇండస్ట్రీలో అందరూ నాకు తెలుసు. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్లలో నాకు లైఫ్‌ పార్టనర్‌ కనిపించలేదు. అందుకే ఇండస్ట్రీ నుంచి ఎవర్నీ పెళ్లాడను అన్నాను.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోయే ముందు ఇది సాధించాలి, అది సాధించాలి అని పెట్టుకున్న లిస్ట్‌ అంతా ఫినిష్‌ చేసేశారా?
రాసుకున్న లిస్ట్‌ అంటూ ఏదీ లేదు. మైండ్‌లోనే క్వాలిటీ సినిమాలు చేయాలనుకున్నాను. కెరీర్‌లో చెప్పుకోవడానికి ఓ 5 సినిమాలుంటే చాలనుకున్నా. ఆ సినిమాల గురించి ఎప్పుడు అనుకున్నా గర్వంగా అనిపించాలి. ‘మగధీర, నేనే రాజు నేనే మంత్రి, మిస్టర్‌ పర్ఫెక్ట్, వివేగమ్‌ (తమిళం), అ!’ సినిమాలు నాకు బాగా ఇష్టం. ‘అ!’లో నాది చిన్న రోల్‌ కానీ చాలా ఇంపాక్ట్‌ ఉంటుంది. ఇప్పుడు తేజాగారితో ఓ సినిమా చేస్తున్నాను. అందులో నాది అద్భుతమైన పాత్ర. నేను గర్వంగా చెప్పుకునే సినిమాలలో ఇది కూడా ఉంటుంది.

హిస్టారికల్‌ సినిమాలో నటించాలనుందా? ఉంటే.. ఎలాంటి పాత్ర?
ఇండియన్‌ హిస్టరీ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నాకు ఝాన్సీ లక్ష్మీభాయ్‌ అంటే ఇష్టం. ఆమె భయం లేని గుణం, ఆత్మవిశ్వాసం గురించి మనందరం చదువుకున్నాం. స్క్రీన్‌ మీద ఆవిడ పాత్ర చేయాలని ఉంది. 

ఝాన్సీ లక్ష్మీభాయ్‌ లక్షణాల్లో మీకున్నవి?
ఆవిడ అంత ధైర్యం లేకపోయినా కొంతవరకూ ధైర్యవంతురాలినే. కొన్నిసార్లు లక్ష్మీభాయ్‌ అవ్వాల్సి వస్తుంది కూడా. ఇక ఆ సమయంలో చుట్టు పక్కలవారి గురించి, పరిసరాల గురించి పట్టించుకోను కూడా. కొన్నిసార్లు సౌమ్యంగా, కొన్నిసార్లు సింహంలా, కాళీ మాతలా మారాల్సి ఉంటుంది.

కాళీలా మారిన సందర్భం ఏదైనా గుర్తుందా?
మా ఫ్రెండ్‌తో ఒక అబ్బాయి తప్పుగా ప్రవర్తించాడని రోడ్డు మీద కాలర్‌ పట్టుకుని ముఖం వాచిపోయేలా కొట్టాను. అది ప్లస్‌ టు చదువుతున్నప్పుడు అనుకుంటా. మేం ఉండే ఏరియాలో రాత్రి ఎనిమిదింటికి ఫ్రెండ్స్‌ అందరం సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నా ఫ్రెండ్‌తో తప్పుగా ప్రవర్తించాడు. అప్పుడు మా గ్యాంగ్‌లో ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. వాడు పారిపోయాడు. నాకు చాలా చిరాకు, కోపం వచ్చేశాయి. ఆకతాయి ఒంటి మీద ఒక్కటిచ్చి కళ్లు కనిపించడం లేదా? అన్నాను. ఆ తర్వాత ఇంటికెళితే మా నాన్నగారు అలా కొట్టకూడదు అన్నారు.

సినిమాల్లోకి వచ్చాక చేదు అనుభవాలేవైనా?
లేవు.

కానీ కొందరు హీరోయిన్లు ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ అంటూ తమను వేధించారని పలువురు ప్రముఖుల పేర్లు బయటపెట్టారు కదా? 
క్యాస్టింగ్‌ కౌచ్‌ అస్సలు లేదు అనను. బయటకు వచ్చి చెబుతున్న వాళ్లందరి బాధ వింటున్నాం. వాళ్లు అబద్ధాలు చెప్పరు కదా. అయితే నాకు అలాంటి అనుభవం ఏదీ లేదంటున్నాను. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరే కదా. నాకు మా ఫ్యామిలీ సపోర్ట్‌ ఉండేది. చాలా ఏళ్లు మా అమ్మగారు నాతోనే ఉన్నారు. నావరకూ చేదు అనుభవం ఒక్కటి కూడా లేదు. అయితే నాకేం కాలేదని ఆనందపడిపోకూడదు. ఆడవాళ్లు హాయిగా పని చేసుకునే వాతావరణం ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని రంగాల్లోనూ ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో దారుణమైన మనుషులు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. అందుకే ‘నాతో పెట్టుకోవద్దు’ అనే సంకే తాలను పంపిస్తా. బహుశా నా జోలికి ఎవరూ రాకపోవడానికి అది కూడా ఓ కారణం అయ్యుండొచ్చు.

నటి తనుశ్రీ దత్తాను తీసుకుందాం.. ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన హెరాస్‌మెంట్‌ ఇప్పుడు చెప్పారామె. నిజం చెప్పడానికి పదేళ్లు అవసరమా?
ఏం చేస్తారో అని భయం. ఏ వ్యక్తికైనా కెరీర్‌ అంటే ఓ భయం ఉంటుంది. ఎవరైనా నష్టం చేస్తారనే భయంతో మాట్లాడలేరు. 

భయం లేకుండా చెప్పే ధైర్యం మీకుందా? 
ఓ. సపోజ్‌ నాకు ఏదైనా కాస్ట్యూమ్‌ ఇబ్బందిగా అనిపిస్తే చెప్పేదాన్ని. ఇది నాకు కంఫర్ట్‌బుల్‌గా ఉండదు.. వేసుకోలేను అని కరాఖండిగా చెప్పిన రోజులున్నాయి. అయితే ఇప్పుడు ఇంత అనుభవం సంపాదించుకున్న తర్వాత కాదు.. కెరీర్‌ స్టార్టింగ్‌ లోనే అలానే ఉండేదాన్ని.

అవకాశాలు తగ్గిపోతాయని భయపడలేదా?
లేదు. అలా తెగువ చూపించడమే నన్ను సేవ్‌ చేసిందని భావిస్తాను. కోల్పోయేవాటి గురించి అసలు కేర్‌ చేయను. ఎలా రాసుందో అలా జరుగుద్ది అనుకుంటాను. 

ఒకవేళ అవకాశాలు కోల్పోయుంటే ధైర్యం...
(మధ్యలో అందుకుంటూ) చాలా సినిమాలు మిస్‌ అయ్యాను. అవి పెద్ద పెద్ద సినిమాలు. వదులుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ నేను సంతోషంగా ఉన్నాను. మనం  తీసుకున్న చాయిస్‌ల వల్ల మనం హ్యాపీగా ఉండాలని నమ్ముతాను. వేరేవాళ్ల సంతోషం కోసం నేను బతకడంలేదు కదా.

కొన్నిసార్లు పాత్ర స్వభావానికి, మీ పర్సనల్‌ అభిప్రాయాలకు తేడా వస్తే చేసేవారా? లేదా దర్శకుడితో డిస్కస్‌ చేసేవారా?
ఈ మధ్య కాలంలో డిస్కషన్‌ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కెరీర్‌ స్టార్టింగ్‌లో క్యారెక్టర్స్‌ విషయంలో నాలెడ్జ్‌ లేదు. ఇప్పుడు ఏదైనా నచ్చకపోయినా, స్త్రీలను కొంచెం తక్కువగా, అసభ్యకరంగా చూపించడానికి ట్రై చేసినా నేను చేయనని చెప్పేస్తా. మార్చండి అని అడుగుతా. వీటిని ఎంకరేజ్‌ చేయను. 

కెమెరా యాంగిల్స్‌ మీద కూడా పూర్తి అవగాహన వచ్చే ఉంటుంది కదా?
ఇప్పుడు వచ్చేసింది. కెరీర్‌ స్టార్టింగ్‌లో ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నా, నాకు నేను స్క్రీన్‌ మీద ఈ యాంగిల్‌లో బాగా కనిపించను అనిపించినా ఆ ఫ్రేమ్‌ మార్చండి అని అడుగుతాను. 

మీరు పని చేసిన దర్శకుల్లో మీకు చాలెంజింగ్‌ అనిపించింది ఎవరు?
ఒక్కళ్లు అని చెప్పలేను. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌. ఇంత మంది దర్శకులతో కలసి పనిచేయడం అదృష్టం అని భావిస్తాను. చాలా నేర్చుకున్నాను. కొత్త దర్శకుడు అయినా స్టార్‌ డైరెక్టర్‌ అయినా కూడా నాకేదోటి నేర్పిస్తూనే ఉన్నారు. అది నా కెరీర్‌కు చాలా హెల్ప్‌ అవుతుంది. 

ఫైనల్లీ.. మీ పదేళ్ల కెరీర్‌ని ఒక పదంలో పెట్టమంటే?
నేర్చుకుంటున్నాను. 
– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement