‘‘జంబలకిడి పంబ’ చిత్రానికి కథే హీరో. చాలా బాగుంటుంది. అమ్మాయి ఆత్మ అబ్బాయిలోకి, అబ్బాయి ఆత్మ అమ్మాయిలోకి ప్రవేశించడం ఇందులో ప్రత్యేకత. అమ్మాయిలాగా చేయడానికి ప్రత్యేకించి హోమ్‌వర్క్ చేయలేదు. చిరంజీవిగారి ‘చంటబ్బాయి’, నరేశ్‌గారి, రాజేంద్రప్రసాద్‌గారి సినిమాలు చూశా. ఇంట్లో కూడా కాసేపు మా ఆవిడ నైటీ వేసుకుని ఎలా ఉంటుందో చూశా’’ అని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన హీరోగా, సిద్ధి ఇద్నాని హీరోయిన్‌గా జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ నిర్మించిన ‘జంబలకిడి పంబ’ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి పంచుకున్న విశేషాలు...
∙ఈవీవీగారి ‘జంబలకిడి పంబ’కి, మా సినిమాకి పొంతన ఉండదు. ఆ చిత్రంలో ఊర్లో వాళ్లందరూ అటూ ఇటూ మారితే, మా సినిమాలో ఒక కుటుంబంలోని భార్యాభర్తలు మాత్రమే మారతారు.
∙ఈ పాత్ర చేయడానికి ఇబ్బందులు పడలేదు. కాకపోతే నైటీలు, లిప్‌స్టిక్‌లు వేసుకుని కేరవ్యాన్ నుంచి దిగేటప్పుడు కొంత సేపు ఇబ్బందిగా అనిపించింది. నాకు ఇద్దరమ్మాయిలు. మా ఆవిడతో మా పెద్దమ్మాయి ఆకృతి ‘చూడమ్మా.. మనింటికి చమేలీ రాణి వచ్చింది’ అని ఆటపట్టించేది.
∙మను తొలి చిత్రం ‘రైట్ రైట్’ నేను చూడలేదు. ‘జంబలకిడి పంబ’ కథ బాగుందనిపించింది. రెండు సార్లు విన్నా. మొన్న సినిమా చూశాక చెప్పింది చెప్పినట్టు తీశాడనిపించింది. మనుకి సంగీత దర్శకుడు గోపీసుందర్ ఎప్పటి నుంచో ఫ్రెండ్. కథ నచ్చే గోపీసుందర్ ఈ సినిమా చేశారు. పాటలు చూసి మా అమ్మా నాన్న కూడా మెచ్చుకున్నారు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు.
∙ఈ చిత్రంలో ఓ చోట పీరియడ్స్ గురించి చాలా సెన్సిటివ్‌గా చెప్పాం. సున్నితమైన అంశాలను చాలా చక్కగా డీల్ చేశారని సెన్సార్ బోర్డులోని మహిళలు అనడం సంతోషంగా ఉంది.
∙నేను హీరోని అనుకోను. మంచి కాన్సెప్ట్ సినిమాలు చేస్తున్నానని అనుకుంటా. దానివల్ల నాపై ఒత్తిడి ఉండదు. త్రివిక్రమ్‌గారు కూడా అలాంటి ప్రెజర్‌ని మోయవద్దనే చెబుతారు. నేను సెట్లోకి వెళ్లగానే ‘మనది మల్టీస్టారర్ సినిమా. శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు’ అని కొందరు ఆట పట్టిస్తుంటారు. ‘ఫ్లైయింగ్ కలర్స్’ అని మేం 13 మంది ఒక గ్రూప్‌లో ఉంటాం. అందరం ఓ ప్రొడక్షన్ హౌస్ పెడతాం. ప్రతిభ ఉన్నవాళ్లతో సినిమాలు చేస్తాం.
∙‘జంబలకిడి పంబ’ క్లైమాక్స్‌లో మా చిన్నపాప ఆశ్రితి కనిపిస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌గారి మూవీ, రవితేజ సినిమా, పంతం, వీరభోగ వసంతరాయలు’ సినిమాల్లో చేస్తున్నా. హీరోగానూ ఓ సినిమా ఉంది. వివరాలు త్వరలోనే చెబుతాం. ‘గీతాంజలి 2’ చిత్రం కోసం ఇంకా నన్ను ఎవరూ సంప్రదించలేదు.
చమేలీ రాణి అని నన్ను ఆటపట్టించింది
Published Thu, Jun 21 2018 12:35 AM | Last Updated on Thu, Jun 21 2018 9:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment