
ఏ భాషలో బిజీ అయినా తెలుగు సినిమాని వదలను!
తన ‘గమ్యం’ ఏంటో తొలి సినిమాతోనే చెప్పేశారు క్రిష్.. అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణ. చేసినవి తక్కువ సినిమాలే అయినా... విలువలతో కూడిన కథాంశాలను ఎంచుకొని తెలుగు తెరపై తనదైన సంతకాన్ని లిఖించారాయన. వాణిజ్య అంశాలతో సినిమాలను మలచినా... తన మార్క్ సందేశాన్ని మాత్రం క్రిష్ మరిచిపోరు. గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుమ్ చిత్రాలే అందుకు నిదర్శనాలు. ప్రస్తుతం బాలీవుడ్ యవనికకు తెలుగువాడి వాడినీ వేడినీ రుచి చూపించే పనిలో ఉన్నారాయన. అక్షయ్‌కుమార్ కథానాయకునిగా క్రిష్ దర్శకత్వంలో సంజయ్‌లీలా బన్సాలీ నిర్మిస్తున్న ‘గబ్బర్’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా క్రిష్‌తో ‘సాక్షి’ జరిపిన చిట్‌చాట్.
ఈ పుట్టిన రోజు ప్రత్యేకతలేంటి సార్?
ప్రత్యేకించి ఏమీ లేదు. ముంబయ్‌లో సెటిల్ అయ్యాను. ‘గబ్బర్’ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ పుట్టిన రోజును అక్కడే చేసుకుంటున్నా.
తమిళ్‌లో ‘రమణ’గా, తెలుగులో ‘ఠాగూర్’గా రూపొంది.. ఘన విజయాలను అందుకున్న కథను ఎంచుకొని బాలీవుడ్‌లో ‘గబ్బర్’గా తెరకెక్కిస్తున్నారు. ఏమైనా మార్పులు చేర్పులు చేశారా?
60 శాతం మార్చేశా. ఓ థ్రిల్లర్‌లా ఉంటుంది సినిమా. నా మార్క్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అక్షయ్‌కుమార్, కరీనాకపూర్, శ్రుతిహాసన్, సుమన్, సోనూసూద్, ప్రకాశ్‌రాజ్, గోవింద్ నామ్‌దేవ్, చిత్రాంగదాసింగ్... ఇలా గ్రేట్ కాస్టింగ్ ఈ సినిమాలో నటించారు. సాంకేతికంగా వండర్ అనిపిస్తుంది.
తెలుగు పరిశ్రమకు, హిందీ పరిశ్రమకు మధ్య మీరు గమనించిన తేడా?
బాలీవుడ్‌లో ప్రొఫెషనలిజం ఎక్కువ. అంతకు మించి తేడా ఏమీ ఉండదు. అర్థం చేసుకొని ముందుకెళ్తే ఎక్కడైనా విజయం సాధించొచ్చు.
బాలీవుడ్‌లోనే కొనసాగుతారా?
అలాంటిదేం లేదు. బాలీవుడ్‌లో, తెలుగులో రెండు చోట్లా సినిమాలు చేస్తాను. నేను ఏ భాషలో బిజీ అయినా తెలుగు సినిమాను మాత్రం వదిలే పనేలేదు.
‘కృష్ణంవందే...’ తర్వాత తెలుగులో చేయలేదేం?
‘గబ్బర్’ వల్లే. ఏడాదిగా ఈ సినిమా పనే సరిపోయింది. నేషనల్ లెవల్ సినిమా చేస్తున్నప్పుడు ఆ మాత్రం టైమ్ తీసుకోవడం అవసరమే. తీరిక దొరికినప్పడల్లా తెలుగు సినిమా కథల కోసం కసరత్తులు చేస్తూనే ఉన్నాను. త్వరలో సాయిధరమ్‌తేజ్‌తో ఓ సినిమా చేయబోతున్నా. అలాగే... నిర్మాత అశ్వనీదత్‌గారికి కూడా ఓ సినిమా చేయాలి.
సాయిధరమ్ సినిమా ఎలా ఉంటుంది? ఈ కథ ద్వారా ఏ సామాజిక అంశాన్ని లేవనెత్తారు?
ఇది కమర్షియల్ లవ్‌స్టోరీ. అందరికీ నచ్చే కథాంశాన్ని ఎంచుకున్నాం. అలాగే ఆలోచింపజేసే అంశాలు కూడా ఉంటాయి. వై.రాజీవ్‌రెడ్డిగారితో కలిసి మా నాన్న జాగర్లమూడి సాయిబాబు ఈ సినిమాను నిర్మిస్తారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సెట్స్‌కి తీసుకెళ్తాం.
మహేశ్‌తో ‘శివం’ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఆ సినిమా ఏమైంది?
కొన్ని కారణాల వల్ల ఆ కథను పక్కన పెట్టాల్సి వచ్చింది. నేను ఇష్టంగా రాసుకున్న కథల్లో ‘శివం’ ఒకటి. కచ్చితంగా ఆ సినిమా చేస్తాను. అయితే... ఎప్పుడు, ఎవరితో అనే విషయాల్లో మాత్రం ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేను.
బాలీవుడ్‌లో ఏమైనా కమిట్ అయ్యారా?
కొన్ని చర్చల దశలో ఉన్నాయి. నిజంగా ఈ రెండేళ్లు క్షణం తీరిక లేదు నాకు. ఓ వైపు గబ్బర్ చేస్తూ మరో వైపు మల్టీ నేషనల్ కమర్షియల్ యాడ్స్ ఓ ముప్పై చేశాను. అది కూడా ఓ గొప్ప అనుభవం.
ఇంతకీ ‘గబ్బర్’ విడుదల ఎప్పుడు?
ముందుగా అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ ప్రథమార్ధంలో ‘గబ్బర్’ విడుదల కానుంది.
ఓకే సార్... మీ ద్వారా బాలీవుడ్‌కి తెలుగు సత్తా ఏంటో మరోసారి నిరూపణ అవ్వాలని కోరుకుంటున్నాం?
తప్పకుండా... థ్యాంక్యూ సో మచ్.