వైరస్‌: మూవీ రివ్యూ | special story about virus movie review | Sakshi
Sakshi News home page

వైరస్‌: మూవీ రివ్యూ

Jul 3 2017 10:35 PM | Updated on Nov 6 2018 8:08 PM

వైరస్‌: మూవీ రివ్యూ - Sakshi

వైరస్‌: మూవీ రివ్యూ

‘బర్నింగ్‌ స్టార్‌’గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంపూర్ణేష్‌ బాబు సినిమాలంటే.. టాలీవుడ్‌లో ఒక వెరైటీ గుర్తింపు ఉంది. అతని సినిమాలంటే..

‘బర్నింగ్‌ స్టార్‌’గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంపూర్ణేష్‌ బాబు సినిమాలంటే.. టాలీవుడ్‌లో ఒక వెరైటీ గుర్తింపు ఉంది. అతని సినిమాలంటే.. మొదటినుంచి చివరివరకు బాగా నవ్వుకోవచ్చనేది ఆ ఇమేజ్‌. అందుకే...... సంపూ సినిమాలంటే ఆడియెన్స్‌ కాస్త ఆసక్తి చూపుతారు. తాజాగా అతను చేసిన ‘వైరస్‌’కీ అలాంటి క్రేజే నెలకొంది. ఈ చిత్రంపై సంపూర్ణేశ్‌బాబు చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఎస్‌.ఆర్‌.కృష్ణ దర్శకత్వం వహించిన వైరస్‌ మునుపటి చిత్రాల్లాగే ఆడియన్స్‌ని మెప్పించిందా? లేదా? సమీక్షలోకి వెళ్లి  తెలుసుకుందాం పదండి....   

కథ
కిట్టు (సంపూర్ణేష్‌ బాబు) ఓ పేదకుటుంబానికి చెందిన అబ్బాయి. ఇతను కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో యూనివర్సిటీ టాపర్‌గా నిలుస్తాడు. అయితే.. మాస్టర్‌ డిగ్రీ చదివేందుకు ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవడంతో ఓ కాఫీ షాప్‌లో పనిచేస్తుంటాడు. ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న అనన్య (నిదిషా)కి కిట్టు టాలెంట్‌ గురించి తెలుస్తుంది. దాంతో... ఆ అమ్మాయి అతనికి ఆర్థికంగా సహాయం చేస్తుంది. ఆమె సాయం చేయడంతో కిట్టు అమెరికా వెళ్లి మాస్టర్‌ డిగ్రీ చేసి, అక్కడే ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరుతాడు.

కట్‌ చేస్తే....  తనకు ఎంతో సహాయం చేసిన అనన్య ఆత్మహత్య చేసుకుందని కిట్టుకి విషయం తెలుస్తుంది. ఈ వార్త విని కిట్టు హుటాహుటిన ఇండియాకి తిరిగి వస్తాడు. అసలు అనన్య ఎందుకు ఆత్మహత్య చేసుకుందోనని తెలుసుకోవడం కోసం ఆమె చనిపోయిన అపార్ట్‌మెంట్‌లోనే ఓ నెట్‌వర్క్‌ ఆపరేటర్‌గా అవతారం ఎత్తుతాడు. ఈ క్రమంలో అతనికి ఓ షాకింగ్‌ విషయం తెలుస్తుంది. ‘వైరస్‌ డాట్‌ కాం’ అనే వెబ్‌సైట్‌లో అమ్మాయిల అశ్లీల వీడియోలు పెడుతూ ఓ ముఠా దారుణాలకు     పాల్పడుతోందని, వారికి అనన్య చావుకి మధ్య సంబంధం ఉందని తెలుసుకుంటాడు. అసలు ఆ వెబ్‌సైట్‌ని ఎవరు నిర్వహిస్తున్నారు? అనన్య ఆత్మహత్య మిస్టరీని కిట్టు ఎలా చేధించాడు? ఈ కథలో దుర్గాప్రసాద్‌ ఎవరు? అనే విషయాలతో ఈ సినిమా కథ నడుస్తుంది.

నటీనటులు
సంపూర్ణేశ్‌బాబు ఎప్పటిలాగే తనదైన మేనరిజం, యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. అన్నీతానై సినిమాని నడిపించాడు. క్లైమాక్స్‌లో అతను చెప్పే డైలాగ్స్‌ అదిరిపోయాయి. హీరోయిన్‌గా చేసిన గీత్‌షా అందాల్ని బాగానే ఆరబోసింది కానీ.. నటనపరంగా ఆకట్టుకోలేదు.  సినిమాలో మరో ఆసక్తికర పాత్ర వాచ్‌మెన్‌ బాబా పాత్రలో నటించిన వెన్నెల కిషోర్‌. సినిమాలో వెన్నెల కిషోర్‌ ఇచ్చే ట్విస్ట్‌ మామూలుగా ఉండదు. ఆ విషయం ఇప్పుడే చెబితే మీరు థ్రిల్‌ మిస్సవుతారు కాబట్టి అందుకే చెప్పడం లేదు. నటనపరంగా వెన్నెల కిషోర్‌ బాగా చేశాడు. ఇంతకు మించి సినిమాలో అంతగా చెప్పుకోదగ్గ పాత్రలేమీ లేవు. మొత్తం మీద సంపూర్ణేష్‌ బాబు చేసిన ఈ చిత్రం నిరుత్సాహపరిచేదిగానే ఉంది. ఎంచుకున్న పాయింట్‌ బాగానే ఉన్నా కథనం మాత్రం రొటీన్‌గా, చప్పగా ఉంది. ఖాళీ సమయం దొరికి, సంపూర్ణేష్‌ బాబు అందించే వెరైటీ తరహా ఎంటర్‌టైన్‌మెట్‌ చూడటానికి ఇష్టపడే వారు ఒకేసారి ఈ సినిమాను చూడొచ్చు

సాంకేతిక విభాగం
దర్శకుడు కృష్ణ సినిమా ద్వారా ప్రస్తుతం సోషల్‌ మీడియా వలన జరిగే అనర్ధాలని చెప్పాలనుకున్న ప్రయత్నం కాస్తా మెచ్చుకోవాల్సిన విషయం. అయితే దాని కోసం ఆయన రాసుకున్న స్క్రీన్‌ ప్లే ప్రేక్షకులని పూర్తిగా నిరాశ పరిస్తుంది. సినిమాలో డైలాగ్స్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా సునీల్‌ కశ్యప్‌ సినిమాకి కాస్తా మైనస్‌ అని చెప్పుకోవాలి. అటు పాటలు, ఇటు బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ రెండు విషయాల్లో ఆయన విఫలం అయ్యాడనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఉన్నంతలో భాగానే ఉంటుంది. ఇక ఎడిటింగ్‌ అంటే సినిమాలో చాలా సన్నివేశాలకి కత్తెర వేయొచ్చు. నిర్మాణ విలువలు ఉన్నంతంలో బాగానే ఉన్నాయి.– సాక్షి స్కూల్‌ ఎడిషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement