జీవితంపై విరక్తి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇక్కడి విజయనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బెంగళూరు : జీవితంపై విరక్తి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇక్కడి విజయనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన సాఫ్ట్‌వేర్ సురేష్‌బాబు (29)కు ఆరు నెలల క్రితమే వివాహమైంది. అతని భార్య కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీరే. దంపతులు ఇద్దరు బెంగళూరు విజయనగర్‌లోని మూడపాళ్యలో నివాసముంటున్నారు.
ఇద్దరు బెంగళూరులోనే వేరువేరు కంపెనీల్లో పని చేస్తున్నారు. గురువారం రాత్రి సురేష్ బాబు ఇంటిలో ఉరి వేసుకున్నాడు. భార్య అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించింది. చికిత్స విఫలమై అతను మరణించాడు. వేధింపుల వల్లే సురేష్‌బాబు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కార్యాలయంలో వేధింపులా.. ఇంటిలో వేధింపులా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉందని విజయనగర పోలీసులు తెలిపారు.