అక్కడ ఆస్తులు లేవుఅంతస్తులు లేవు డిగ్రీలు లేవు కులమతాలు లేవు ఉన్నదల్లా మనుషులువారి మధ్య నెలకొన్నఅభిమానాలుఅవే, ‘నుక్కడ్’ సీరియల్‌ని సంపన్నం చేశాయి. ప్రేక్షకుల మదిలో చిరకాలం నిలిచి పోయాయి.
మన కాలనీలోని కార్నర్ ప్లేస్‌లో ఏమేం దుకాణాలు ఉంటాయో ఎప్పుడైనా గమనించారా. ఓ చాయ్ బండి, దానిని ఆనుకొని ఫాస్ట్‌ఫుడ్ బండి, ఓ పాన్ షాప్, ఆ పక్కనే ఎలక్ట్రిక్ వస్తువుల రిపేర్ షాప్, వస్తువులను తాకట్టు పెట్టుకొని పదో పరకో ఇచ్చే సేట్ షాప్, ఒకవైపు కూరగాయలు, మరోవైపు ఇస్త్రీ షాప్, షూ షాప్, సెలూన్ షాప్.. ఇలా చిన్న చిన్న దుకాణాలన్నీ ఉంటాయి. ఆ షాపుల్లో పనిచేసేవారంతా సాయంత్రమైందంటే ఓ చోట చేరుతారు. వేడి వేడి చాయ్ చప్పరిస్తూనో, బీడీ ముక్కను నోట్లో పెట్టుకొని పొగ ఊదుతూనో పక్కవారితో బాతాఖాని వేస్తుంటారు. అంతా దిగువతరగతి. అక్కడ ఒకరి కష్టం అందరిది. ఒకరి ఆనందమూ అందరిది. ప్రపంచాన్ని దర్శించాలంటే ఇలా వీధి మూలన ఉన్న జీవితాలతో ఓ అరగంట గడిపితే చాలు. నగరాల్లో తక్కువ ఆదాయపు ప్రజల సాంఘిక, ఆర్థిక పోరాటాలను 80ల కాలంలోనే కళ్లకు కట్టింది దూరదర్శన్. వారం వారం శ్రమ జీవుల కష్టాన్ని, వారు పంచుకున్న ఆనందాన్ని హాస్యభరితంగా ఆవిష్కరించింది. నిరంతరం ఆర్థికసమస్యలతో, నెరవేరని కలలతో పోరాటం చేస్తుండే కార్నర్ జీవితాలను ‘నుక్కడ్’ సీరియల్‌గా మూడు దశాబ్దాల క్రితం 40 ఎపిసోడ్లలో పరిచయం చేసింది చిన్నతెర.
గరీబుల కార్నర్
ఎలక్ట్రీషియన్ గురు నుక్కడ్ గ్యాంగ్‌కి చిన్నపాటి లీడర్. నుక్కడ్‌లో ఎవరికి ఏ కష్టం వచ్చినా పరిష్కరించడంలో తను ముందుంటాడు. కదేరిభాయ్ తినుబండారాల షాప్ ఓనర్. నుక్కడ్‌లో ఉన్నవారంతా ఇతని షాపు ముందే చేరుతుంటారు. మరీ తిండికి లేని వారికి ఉచితంగా టీ, స్నాక్న్ ఇచ్చే మంచి మనసు ఉన్నవాడు. హరికి చిన్న సైకిల్ రిపేర్‌షాప్ ఉంటుంది. ఇతడు గుప్తా సేత్ కూతురును ప్రేమిస్తుంటాడు. గోపాల్ అనే వ్యక్తి తాగుబోతు. కానీ అందరినీ ప్రేమించే గుణం ఉన్న వ్యక్తి. నేనేదైనా చేయగలను అని సూటు బూటులో కనిపించే వ్యక్తి రాజా పటేల్. చిన్న హెయిర్‌కటింగ్ సెలూన్‌ని నడుపుకునే బార్బర్ కరీమ్. నుక్కడ్‌లోని ఇళ్లలో పనిచేస్తూ, అందరికీ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటుంది రాధ. సింగిల్ ఉమెన్ మారియా టీచర్. గురు–మారియాలు ప్రేమించుకుంటారు. కానీ, తమ ప్రేమను ఒకరికొకరు చెప్పుకోరు. దుఖియా షాయర్ నిరుద్యోగి. గురు దగ్గర ఉంటూ అందరినీ పదో పరకో అడుక్కుంటూ జీవితం గడుపుతుంటాడు. ఘనశ్యామ్ బిక్షగాడు. చౌరాషియా పాన్‌వాలా. గుప్తాసేత్ కిరణా, మానిక్‌లాల్‌సేత్ ఆభరణాల షాప్‌ను నిర్వహిస్తుంటారు. వీరితో పాటు అలా ఇలా వచ్చిపోయే మరో పది మంది మనుషులతో నుక్కడ్ సందడిగా కనిపిస్తుంది.
పండగతో మొదలు
పేద–ధనిక బేధం లేకుండా ఆనందాన్ని పంచుకునేవే పండగలు. మరి నగరాల్లో దీపావళి పండగ అంటే.. టపాసులకు, కొత్త బట్టలకు వేలల్లో డబ్బు ఖర్చు పెట్టాలి. అంతంత మాత్రంగా ఉండే శ్రమజీవుల సంపాదనతో పూట గడవడమే కష్టం. అలాంటిది టపాసులు కొనుగోలు చేయాలంటే పెద్ద యుద్ధమే. అందుకే నుక్కడ్‌లో ఉండేవారంతా తలా కొంత చందా వేసుకుంటారు. గుప్తా, సేట్‌లు మాత్రం ఒక్కొక్క టపాసు అందరి మధ్య భయం భయంగా కాల్చడం నవ్వు తెప్పిస్తుంది. టపాస్ కాదు బాంబ్ అంటూ దబాయించే పోలీసు హడావిడి, చర్చ ఆసక్తికరంగా ఉంటుంది. చందా డబ్బుతో మిఠాయిలు కొనుక్కొని దీపావళి పండగ జరుపుకుంటారు అంతా. ఇలాగే అన్ని పండగలు అందరూ కలిసి జరుపుకుంటారనే విషయాన్ని నుక్కడ్ జనం పరిచయం చేస్తారు.
పంచుకునే ప్రేమలు
పెళ్లిళ్లకు ట్రాపెంట్ వాయించే బ్యాండ్ మాస్టర్ ఎందరిచేతనో గౌరవం అందుకున్న వ్యక్తే. ముసలివాడైపోతాడు. కానీ, పూట గడవక తానెంతో ఇష్టపడే ట్రాంపెట్‌ను 200 రూపాయలకు సేట్‌కి అమ్మేస్తాడు. ‘వృద్దాప్యంలో చివరకు ట్రాంపెట్ కూడా లేకపోతే ఎలా బతుకుతావు’ అని అడిగితే ‘నా రెక్కల కష్టమ్మీద బతికేస్తా..’ అని దుఖిస్తాడు. గురు, మిగతా బృందమంతా కలిసి బ్యాండ్ మాస్టర్ ట్రాంపెట్‌ను తాకట్టు నుంచి విడిపించి, అతని చేత ట్రాంపెట్‌ను వాయించేలా చేయాలనుకుంటారు. కానీ, మాస్టర్ నిపించుకోడు. చివరకు ట్రాంపెట్‌ను అతను వాయించడం, అతని చుట్టూ చేరి నుక్కడ్ జనం అంతా గంతులేస్తూ ఆనందాన్ని పంచుకుంటారు. ఒకరి కష్టం అందరూ పంచుకుంటే జీవితం ఎంత సింపుల్‌గా గడిపేయొచ్చో దీంట్లో తెలుసుకోవచ్చు.
నాయకులను నిలదీసే నైజం
నుక్కడ్‌కి రాజకీయ నేత వస్తాడు ఈ సారీ ఓట్లు వేసి గెలిపించమని. గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తారు ఒక్కొక్కరు. మారియా టీచర్ రాజకీయనాయకుడిని ‘మీ కొడుకు ఎక్కడున్నాడ’ని అడుగుతుంది. అమెరికాలో ఉన్నాడని, అక్కడే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడని గర్వంగా చెబుతాడు. పదవుల కోసం వచ్చే నాయకులు చెప్పేవి ఒకటి, చేసేది ఒకటి అంటూ క్లాస్ తీసుకుంటుంది టీచర్. తనను తప్పుపడుతున్నారనే కోపంతో మండిపడుతూ అక్కణ్ణుంచి వెళ్లిపోతాడు రాజకీయ నాయకుడు. హామీలు ఇచ్చి నెరవేర్చని నాయకుల దుమ్ము దులపాలంటే అందుకు సామాన్యులే సరైనవారని చూపుతారు.
దొంగ నుంచి మంచి
నుక్కడ్‌లో దొంగతనం జరుగుతుంది. అక్కడి జనానికి పట్టుబడిన వ్యక్తి తాను దొంగగా మారిన పరిస్థితుల గురించి వివరిస్తాడు. పోలీసులు దొంగను పట్టుకోవడానికి వస్తే అతను తమకు పరిచయం ఉన్న వ్యక్తే అని, దొంగ కాదని టీచర్ చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత నుక్కడ్‌లో అతనూ ఓ మెంబర్ అవుతాడు. ఏ వ్యక్తీ పుట్టుకతో చెడ్డవాడు కాదని, పరిస్థితులే వారనలా మారుస్తాయని, మంచి మనుసుల మధ్య ఉంటే దొంగలైనా మంచివారుగా మారుతారనే నిజాన్ని కళ్లకు కడతారు. ఇలా ఒక్కో వారం ఒక్కో సమస్య నుక్కడ్ జనాల మధ్య నడుస్తూ ఉంటుంది. ఆ సమస్య నుంచి ఓ పరిష్కారం చూపుతుంది. కొన్ని పరిష్కారం లేని సమస్యలూ ఉంటాయి. అందరి కళ్లలోనూ భవిష్యత్తు పట్ల అందమైన కలలు. అవి నెరవేరేవి కావని తెలిసినా నిరుత్సాహపడకుండా ఆనందంగా గడిపే జీవితాలు నుక్కడ్‌లో దర్శించవచ్చు. మన జీవితానికి కావాల్సిన పాఠాలనెన్నో నుక్కడ్ బజార్‌లో వెతుక్కోవచ్చు.
– ఎన్.ఆర్.
∙మూడు దశాబ్దాల క్రితం శ్రామిక జీవుల జీవితాలను తరచి చూసి, తెరకెక్కించారు దర్శకులు కుందన్ షా, సయీద్ అక్తర్ మిర్జా. ఈ సీరియల్‌కి ప్రబో«ద్ జోషి, అనిల్ చౌదరి తమ రచనా సహకారాన్ని అందించారు
∙దిలీప్ ధావన్, పవన్ మల్హోత్రా, సంగీతానాయక్, రమా విజ్, అవతార్‌గిల్‌లు ప్రధాన పాత్రదారుల్లో కనిపించి నుక్కడ్‌ని సుసంపన్నం చేశారు ∙1986–86లో 40 ఎపిసోడ్లతో ఫస్ట్ సీజన్ వచ్చిన నుక్కడ్, ఆ తర్వాత 1993లోనయానుక్కడ్ పేరుతో సీక్వెల్ సీరిస్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment