ఎస్‌ ఫర్‌ సూర్య | special story to hero surya singam moive | Sakshi
Sakshi News home page

ఎస్‌ ఫర్‌ సూర్య

Published Thu, Feb 9 2017 11:24 PM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM

ఎస్‌ ఫర్‌  సూర్య

ఎస్‌ ఫర్‌ సూర్య

సినిమా పేరు ‘ఎస్‌’ ఫర్‌ ‘సింహం’.
కనపడే సింహాలూ కనిపించని సింహాలనూ చూశాం.
కానీ ఖాకీ సినిమాలకు లేటెస్ట్‌ కేరాఫ్‌ అడ్రస్‌ సూర్య.
రెండు సూపర్‌ హిట్‌ సింగంల తర్వాత ముచ్చటగా మూడో  హిట్‌ కోసమే ఈ సినిమా..
సింగంతో సూర్య ప్రయాణమే ఈ కథనం...


నీతి నిజాయతీకి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే పోలీసాఫీసర్ల కథలు సిల్వర్‌ స్క్రీన్‌కి కొత్త కాదు. చెప్పాలంటే ఇటు సౌత్‌ అటు నార్త్‌లో బాగా అరిగిపోయిన ఫార్ములా ఇది. స్క్రీన్‌ప్లే చిక్కగా ఉంటేనే ఈ  అరిగిపోయిన ఫార్ములా కాసుల వర్షం కురిపిస్తుంది. ఆసక్తికరమైన ట్విస్టులు, చమక్కులు పెట్టే నేర్పు దర్శకుడికీ, ‘ఈ పోలీస్‌ సూపర్‌’ అనేలా పెర్ఫామ్‌ చేయగల సత్తా హీరోకీ ఉండాలి. హీరో సూర్య– దర్శకుడు హరిలకు ఆ దమ్ము ఉంది. ‘సింగమ్‌’కి ముందు ఈ ఇద్దరి కలయికలో రెండు సినిమాలు వచ్చాయి. విడివిడిగానూ చాలా సినిమాలే చేశారు. కానీ, ‘సింగమ్‌’కి ముందు ‘సింగమ్‌’ తర్వాత అని చెప్పుకునేలా వీళ్ల మార్కెట్‌ మారిపోయింది. అందుకే మొదటి పార్ట్‌తో వదల్లేదు. రెండో పార్ట్‌ తీశారు. అది కూడా సూపర్‌. మూడో పార్ట్‌ కూడా చేశారు. గురువారం మూడో సింగమ్‌ కూడా వచ్చేసింది. అసలు ‘సింగమ్‌’ ఎప్పుడు మొదలైంది?

హీరోకి 25... దర్శకుడికి 10!
అది 2009. హీరో సూర్య అప్పటికి 24 సినిమాలు చేసేశారు. వాటిలో ‘శివపుత్రుడు’ ఒకటి. ఎమోషనల్‌గానూ సూర్య యాక్ట్‌ చేయగలడని ప్రూవ్‌ చేసిన సినిమా అది. ‘గజిని’, ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ కూడా ఈ హీరోలో మంచి విషయం ఉందని నిరూపించాయి. ఇక, ‘ఆరు’, ‘వేల్‌’ అయితే మంచి మాస్‌ హీరో ఉన్నాడని చూపించాయి. ఈ రెండు సినిమాలకూ హరి దర్శకుడు. మాస్‌ సినిమాలు తీస్తే హరినే తీయాలన్నంతగా ఆయనకు పేరు వచ్చింది.  దాంతో సూర్య–హరి కాంబినేషన్‌ అంటే హిట్‌ అనే పేరు పడిపోయింది. ఇద్దరికీ అండర్‌స్టాండింగ్‌ కూడా కుదిరింది. అందుకే ఎక్కడో ఓ మూల సూర్య 25వ సినిమా తానే చేస్తే బాగుంటుందని హరికి అనిపించి ఉంటుంది. అయితే అప్పటికే ప్రభుదేవా దర్శకత్వంలో సూర్య 25వ సినిమా అనే వార్త బయటికొచ్చింది. ఆ తర్వాత ఓ ఫైన్‌ డే సూర్య కోసం స్టోరీ రెడీ చేశానని, తన 25వ సినిమాకి నేనే దర్శకుణ్ణి అని హరి చెప్పారు. అలా ‘సింగమ్‌’ మొదలైంది. ఇది హరికి పదో సినిమా. సూర్యకు 25వ సినిమా కాబట్టి, న్యాచురల్‌గా అంచనాలు పెరిగాయి. 2009 ద్వితీయార్థంలో షూటింగ్‌ మొదలుపెట్టారు. 2010 ఫిబ్రవరిలో ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. అంతకుముందు ‘కాక్క కాక్క’ (తెలుగులో వెంకటేశ్‌ నటించిన ‘ఘర్షణ’)లో సూర్య పోలీస్‌గా కనిపించినా అతను క్లాస్‌ పోలీస్‌. ఇక్కడ ఊర మాస్‌. ట్రైలర్‌ ఆ విషయాన్ని స్పష్టం చేసింది. పైగా సూర్య చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. సింహంలాంటి వేగం, చురకత్తిలాంటి చూపులు, పంచ్‌ డైలాగులు... చిన్న ట్రైలర్‌లో ఇవన్నీ చూపించేశారు హరి. దాంతో అంచనాలు పెరిగిపోయాయి.

ఒకవైపు సింహం వాడి... మరోవైపు వేసవి వేడి!
2010 మే 28... ‘సింగమ్‌’ విడుదలైంది. సినిమాల రిలీజుకు సమ్మర్‌ మంచి సీజన్‌. పిల్లలకు సెలవులు. సుమారు 20 శాతం కలెక్షన్స్‌ వాళ్లిచ్చేస్తారు. మాస్‌ సినిమాలంటే పడి చచ్చిపోయేవాళ్లు, సూర్య ఫ్యాన్స్‌ మాగ్జిమమ్‌ చూసేస్తారు. ఓ 60, 70 శాతం వసూళ్లు వాళ్లే ఇస్తారు. లేడీస్‌ వాటా కూడా కొంత ఉంటుంది. సినిమా బాగుంటే చూసినవాళ్లే మళ్లీ మళ్లీ చూస్తారు. ‘సింగమ్‌’కి అదే జరిగింది. మొదటి రోజే హిట్‌ టాక్‌. పోలీస్‌ అంటే ‘దురైసింగమ్‌’ (తెలుగులో ‘నరసింహ’ం)లా ఉండాలన్నారు. ‘సింగమ్‌’లో సూర్య పాత్ర పేరిది. కథ చాలా చిన్నది. చిన్న పల్లెటూరికి చెందిన దురైసింగమ్‌ సిటీకి వస్తాడు. ఎలాంటి ప్రలోభాలకూ లొంగడు. వృత్తిని దైవంగా భావిస్తాడు. సమాజంలోని చీడపురుగులను ఏరిపారేస్తాడు. ఈ పాయింట్‌ చుట్టూ హరి అల్లిన సన్నివేశాలు, దురైసింగమ్‌గా సూర్య నటన హైలైట్‌. హీరో–విలన్‌ల ఎత్తుకు పై ఎత్తులు ఆసక్తికరంగా ఉంటాయి. ఇవి సినిమాని నిలబెట్టేసాయి. అప్పటి సూర్య మార్కెట్‌కి తగ్గట్టుగా సుమారు 15 కోట్ల రూపాయల ఖర్చుతో తీశారు. దాదాపు 65 కోట్లు వసూళ్లు సా«ధించింది.  తెలుగులో ‘యముడు’గా విడుదలై, ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. అందుకే ‘సింగమ్‌’ అంటే సూర్య– హరిలకు స్పెషల్‌ లవ్‌. దీన్ని ఇలానే వదలకూడదు.. మరిన్ని సింహాలను తెర మీదకు వదలాలను కున్నారు. అలా సెకండ్‌ పార్ట్‌ స్టార్ట్‌.

మూడేళ్ల తర్వాత రెండో సింహం
‘సింగమ్‌’ చేశాక సూర్య–హరి ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ అయిపోయారు. రెండో భాగం మొదలుపెట్టే లోపు సూర్య దాదాపు ఏడు సినిమాలు చేసేశారు. అయితే ‘సింగమ్‌’ ఇచ్చినంత రిజల్ట్‌ని అవేవీ ఇవ్వలేకపోయాయి. మరోవైపు హరి పరిస్థితి కూడా అంతే. ఆయన చేసిన ఒకే ఒక్క సినిమా ఫర్వాలేదనిపించుకుంది. ఇలాంటి టైమ్‌లో మళ్లీ ఇద్దరూ సినిమా చేయాలనుకున్నారు. 2012లో రెండో సింహానికి శ్రీకారం చుట్టారు. 2013 జూలై 5న విడుదలైంది.

డబుల్‌ మాస్‌...
ఫస్ట్‌ పార్ట్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రేయసితో ఊరు వెళతాడు దురైసింగమ్‌. కానీ, అది ఉత్తుత్తి రాజీనామా. సెకండ్‌ పార్ట్‌లో ఎన్‌.సి.సి. టీచర్‌గా చేస్తుంటాడు. అండర్‌ కవర్‌ డి.ఎస్‌.పి అన్నమాట. సముద్ర తీర ప్రాంతంలో జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాని అంతం చేయాలనే మిషన్‌ మీద పని చేస్తుంటాడు. వాటి వెనక ఉన్నది అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా అని కనుగొంటాడు. కానీ, టీచర్‌ ముసుగు నుంచి బయటకు రావాల్సి వస్తుంది. దురైసింగమ్‌ పోలీసాఫీసర్‌ అని తెలిశాక విలన్లకూ అతనికీ మధ్య అసలు యుద్ధం మొదలవుతుంది. అక్కణ్ణుంచి సినిమా ఊపందుకుంటుంది. చివరికి విలన్‌ని పట్టుకుని జైలులో పెట్టడంతో సినిమాకి ఎండ్‌ కార్డ్‌ పడుతుంది. ఫస్ట్‌ పార్ట్‌కన్నా సెకండ్‌ పార్ట్‌ మరింత మాస్‌గా ఉంటుంది. పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ రూపంలో సూర్య అరుపులు, అతను కొట్టే దెబ్బలకు విలన్ల అరుపులు, మధ్యలో రిలీఫ్‌ కోసం అనుష్కతో లవ్‌ ట్రాక్, హన్సిక వన్‌ సైడ్‌ లవ్, అంజలి ఐటమ్‌ సాంగ్‌తో సెకండ్‌ పార్ట్‌ మాస్‌కి ఎక్కేసింది. దాంతో సూపర్‌ హిట్టయింది. తెలుగులో ‘యముడు–2’గా వచ్చి, ఇక్కడా హిట్టయింది.

ఆరంభం వాయిదా... విడుదల వాయిదా!
ఎప్పుడైతే రెండు భాగాలు హిట్టయ్యాయో అప్పుడు ‘సింగమ్‌’ ఓ బ్రాండ్‌ అయిపోయింది. మూడో భాగం ఎప్పుడు మొదలవుతుందా అని ‘సింగమ్‌’ ప్రేమికులు ఎదురు చూశారు. సెకండ్‌ పార్ట్‌ విడుదలైన ఏడాదికి (2014) మూడో భాగానికి అధికారికంగా ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికి సినిమాని మొదలు పెట్టాలనుకున్నారు. 2015 డిసెంబర్‌లో షూటింగ్‌ ప్లాన్‌ చేశారు. అదే సమయంలో చెన్నైలో భారీ తుపాను. వేరే దారి లేక షూటింగ్‌ను వాయిదా వేశారు. విచిత్రంగా సినిమా విడుదల కూడా పలుమార్లు వాయిదా పడింది. గతేడాది దీపావళికి విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత క్రిస్మస్‌కి అనుకున్నారు. అదీ మిస్సయింది. ఈలోపు 2016 అయిపోయింది. 2017 రానే వచ్చింది. జనవరిలో విడుదల చేయాలనుకుంటే.. తమిళనాడు సంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’ వివాదం కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఒకవేళ వాయిదాల పర్వం లేకపోయి ఉంటే మొదటి భాగానికీ, రెండో భాగానికీ ఉన్నట్లుగానే రెండో భాగానికీ మూడో భాగానికీ మూడేళ్లు గ్యాప్‌ ఉండేది. వాయిదాల వల్ల నాలుగేళ్ల గ్యాప్‌ వచ్చింది. ఏదైతేనేం గురువారం ‘సింగమ్‌ 3’ విడుదలైంది.

తిరుగు లేని సింహం
ఈసారి దురైసింగమ్‌ మిషన్‌ ఏంటంటే... మంగళూరులో ఓ కమిషనర్‌ హత్యకు గురవుతాడు. ఆ హత్య చేసింది ఎవరు? అని ఛేదించడంతో పాటు అక్కడ జరుగుతున్న అక్రమాల వెనక ఉన్న వ్యక్తి ఎవరు? అని తెలుసుకుని అతని సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి దురైసింగమ్‌ ఏం చేశాడు? అనేది కథ. ముందు అనుకున్న తేదీకి విడుదలై ఉంటే, రెండింతల క్రేజ్‌ ఉండేది. వాయిదాల మీద వాయిదా ఓ మైనస్‌.  ఈ విషయాన్ని స్వయంగా సూర్య కూడా ఒప్పుకున్నారు. అయినప్పటికీ పాజిటివ్‌గానే ఉన్నట్లు పేర్కొన్నారు. వాయిదా ఎఫెక్ట్‌ కాస్త కనిపించినా రానున్న రోజుల్లో ‘సింగమ్‌’కి తిరుగుండదని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. మొదటి రోజు పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోగలిగింది. అది చాలు సినిమా నిలబడటానికి. అన్నట్లు ‘సింగమ్‌’ దూకుడు ఇంతటితో ఆగదు. ‘సింగమ్‌ 4’ కూడా ఉంటుంది. సౌత్‌లో సీక్వెల్స్‌ తక్కువ. హిందీలో మాత్రం మూడు, నాలుగు, ఐదు.. ఇలా తీస్తుంటారు. ఉదాహరణకు ‘గోల్‌మాల్‌’. సౌత్‌లో ‘సింగమ్‌’ సిరీస్‌ ఆ రికార్డ్‌ని సొంతం చేసుకుంటుందని చెప్పొచ్చు. మరి.. నాలుగో భాగం ఎప్పుడు? వెయిట్‌ అండ్‌ సీ.

విడుదలకు ముందే 100 కోట్లు!
‘సింగమ్‌’ మొదటి భాగం బడ్జెట్‌ 15 కోట్లు. రెండో భాగాన్ని 45 కోట్లతో తీశారు. ఈ సిరీస్‌కి వచ్చిన ఆదరణ దృష్ట్యా మూడో భాగాన్ని దాదాపు 65 కోట్లతో తీశారు. కానీ, విడుదలకు ముందే సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఎలాగంటే... తమిళనాడు బిజినెస్‌ 41 కోట్లు, తెలుగు 18 కోట్లు, ఓవర్సీస్‌ 15.5 కోట్లు, కేరళ–కర్నాటక 9 కోట్లు, అన్ని భాషల శాటిలైట్‌ రైట్స్‌ ఇంచుమించు 22 నుంచి 25 కోట్లు, తమిళ మ్యూజికల్‌ రైట్స్‌ 1 కోటీ 75 లక్షలు. ఇవన్నీ కూడితే 115 నుంచి 120 కోట్లు పై చిలుకే.

ఇతర భాషల్లో సింగమ్‌
‘సింగమ్‌’, ‘సింగమ్‌2’ తెలుగులో డబ్‌ అయ్యాయి. ‘సింగం’ హిందీలో రీమేక్‌ అయింది. మాస్‌ హీరో అజయ్‌ దేవగణ్‌తో రోహిత్‌ శెట్టి తెరకెక్కించారు.  సుమారు 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన హిందీ ‘సింగమ్‌’ 140 కోట్ల రూపాయలు వసూలు చేయడం రికార్డ్‌. బాక్సాఫీస్‌కి పూనకం పట్టిందా అని ఆశ్చర్యపోయారంతా. ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయిన నేపథ్యంలో రెండో భాగం తీశారు. అయితే దీనికీ, తమిళ సీక్వెల్‌కీ సంబంధం లేదు. వేరే కథతో ‘సింగమ్‌ రిటర్న్స్‌’ తీసి మళ్లీ హిట్‌ సాధించారు.   ‘సింగమ్‌’ కన్నడ రీమేక్‌ ‘కెంపెగౌడ’లో సుదీప్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. తమిళంలోలానే కన్నడంలోనూ సినిమా సూపర్‌ హిట్‌. ‘కెంపెగౌడ’ వసూళ్ల సునామీ సృష్టించింది. బెంగాలీలో ‘షోత్రు’ పేరిట రీమేక్‌ అయిన ‘సింగమ్‌’ అక్కడ కూడా ఘనవిజయం సాధించింది. అరిగిపోయిన ఫార్ములాకి ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే తయారు చేసుకుంటే హిట్‌ ఖాయం అని ‘సింగమ్‌’ సిరీస్‌ నిరూపించింది.

– డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement