లేడీ డెరైక్టర్స్‌లో ఆ ప్రత్యేకత ఉంది!
‘‘స్టార్స్ సినిమాలకు వర్క్ చేసేటప్పుడు ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. కానీ, చిన్న సినిమాలకు ఫ్రీడమ్ ఉంటుంది. అలాంటి అవకాశం ఈ సినిమాతో దొరికింది’’ అని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. కార్తీక్ రాజు, నిత్యా శెట్టి, సామ్ ముఖ్య తారలుగా స్వీయ దర్శకత్వంలో చునియా నిర్మించిన ‘పడేసావే’కి ఆయన పాటలు స్వరపరిచారు.
ఈ నెల 26న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ - ‘‘ ‘మనం’ సినిమాతో నాకు నాగార్జున గారితో మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన అసోసియేట్ అయిన ‘పడేసావే’ చేయడానికి అది కారణం కాదు. దర్శకురాలు చునియా చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా ఒప్పుకున్నాను . ప్రేమ, స్నేహం లాంటి అంశాలను చునియా వైవిధ్యంగా తెర మీద ప్రెజెంట్ చేశారు. డెరైక్షన్ విషయంలో ఆడ అయినా, మగ అయినా ఒకటే. అయితే లేడీ డెరైక్టర్స్‌లో సెన్సిటివిటీ కనబడుతుంది.
పాటలు విన్న నాగార్జున గారు ‘చిన్న సినిమా అని కమర్షియల్‌గా ఆలోచించకుండా మంచి ఔట్‌పుట్ ఇచ్చావ’ని మెచ్చుకున్నారు’’ అని చెప్పారు. ఇటీవల మరణించిన తన తల్లిని గుర్తు చేసుకుంటూ... ‘‘నా లైఫ్‌లో జరిగిన ప్రతి ఇంటర్వ్యూనూ మా అమ్మ నా పుట్టినరోజు కానుకగా 2015లో ప్రెజెంట్ చేసింది. అదే తన చివరి కానుక అని కలలో కూడా అనుకోలేదు’’ అని అనూప్ ఒకింత బాధగా అన్నారు.