Nithya Shetty
-
ఫ్రెండ్ పార్టీలో చిల్ అవుతోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా మందు కొడుతూ!
చైల్ట్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోన్న భామ నిత్యాశెట్టి. దేవుళ్లు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైంది. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించింది హైదరాబాద్‌కు చెందిన నిత్యాశెట్టి. ఓ పిట్టకథ, నువ్వు తోపు రా, పడేశావే, వాంటెడ్ పండు గాడ్, అవరట్టం, కాదల్ కాలం లాంటి చిత్రాల్లో మెప్పించింది. పలు టీవీ షోల్లో మెరిసింది. అయితే తాజాగా తన ఫ్రెండ్ బర్త్ డేకు హాజరైన ముద్దుగుమ్మ ఫుల్‌గా చిల్ అవుతూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? తెలుగులో చేసింది ఒకటే సినిమా!) సెలబ్రీటీలు అన్నాక పార్టీలు, పబ్‌లకు వెళ్లడం సర్వసాధారణమే. అలా తన ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీకి వెళ్లిన నిత్యా శెట్టి ఫుల్‌గా మందుకొడుతూ కనిపించింది. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోల్లో ఎంచక్కా షాట్స్ (ఆల్కహాల్) తాగుతూ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తన ఫ్రెండ్‌కు విష్ చేసిన నిత్యా శెట్టి మందు తాగుతూ కనిపించడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..) View this post on Instagram A post shared by Nitya Shetty (@nityashettyoffl) -
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం మానేసి సినిమాల్లోకి : నటి
కొంత మంది సినిమా కళ కోసమే పుడతారేమో అనిపిస్తుంది వాళ్ల నటనాతృష్ణను చూస్తుంటే! ఆ వరుసలో నటి నిత్యా శెట్టినీ చేర్చొచ్చు. బాలనటిగా వెండితెర మీద పరిచయమై.. ఇప్పుడు హీరోయిన్గా రాణించే ప్రయత్నం చేస్తోంది. ఇటు వెబ్ తెర అవకాశాలనూ అందుకుంటోంది. ► చిన్నప్పుడు షూటింగ్లో అందరూ నన్ను గారాబం చేసేవాళ్లు. బోల్డన్ని చాక్లెట్లు ఇచ్చేవాళ్లు. అప్పుడు వాటన్నింటినీ ఎంతో ఇష్టంగా తినేదాన్ని. కానీ, ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నా. హీరోయిన్ అంటే స్లిమ్‌గా ఉండాలి కదా. ► నిత్యా శెట్టి నిత్యా పుట్టింది, పెరిగింది, చదివింది అంతా హైదరాబాద్‌లోనే. ఇంజినీరింగ్ పూర్తి చేసి, సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా కొంతకాలం పనిచేసింది కూడా. స్కూల్ డేస్‌లోనే బాలనటిగా ‘దేవుళ్లు’, ‘అంజి’ వంటి పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ► ‘చిన్ని చిన్ని ఆశ’, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాల్లోని నటనకు ఉత్తమ బాలనటిగా నంది అవార్డులూ అందుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తెలుగులో ‘దాగుడుమూత దండాకోర్’, ‘పడేసావే’ చిత్రాల్లోనూ, కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించింది. ► ‘నువ్వు తోపురా’ సినిమాతో కథానాయికగా నిత్యా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చినా పెద్దగా పేరు రాలేదు. అయితే, ఆమే హీరోయిన్గా ఈ మధ్యనే వచ్చిన ‘ఓ పిట్ట కథ’ మంచి విజయం సాధించింది. ఇందులోని నిత్యా నటన ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమ్ అవుతోన్న ‘హలో వరల్డ్’ సిరీస్‌తో వీక్షకులను అలరిస్తోంది. -
ఏ భాషలో అయినా చేస్తా
‘‘నేను తెలుగమ్మాయినే. హైదరాబాద్‌లో చదువు పూర్తి చేశా. సినిమాల పట్ల ఆసక్తితో బాల నటిగా చేశా. ‘అంజి , దేవుళ్ళు’ సినిమాల తర్వాత రామానాయుడు గారి ‘హరివిల్లు’ సినిమా చేశా. ఆ తర్వాత హీరోయిన్గా కొన్ని చిత్రాల్లో నటించా’’ అని నిత్యాశెట్టి అన్నారు. విశ్వంత్, సంజయ్ రావు, నిత్యాశెట్టి ముఖ్య పాత్రల్లో చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. వి.ఆనందప్రసాద్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. నిత్యాశెట్టి మాట్లాడుతూ– ‘‘ఓ పిట్టకథ’కి ప్రేక్షకుల స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. వెంకటలక్ష్మి పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ‘ఓ పిట్టకథ’ బాగుందని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. మంచి పాత్రలు ఏ భాషలో వచ్చినా చేయడానికి సిద్ధం. ప్రస్తుతం తమిళ్లో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’’ అన్నారు. -
మా అబ్బాయి వస్తానంటే యస్ అన్నాను
‘‘తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటే తమ పిల్లల్ని కూడా ఆ రంగంలో పైకి తీసుకురావాలనుకుంటారు.. నేను కూడా అలాగే అనుకున్నాను. మా అబ్బాయి సంజయ్ సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు ‘ప్రయత్నించు.. వర్కౌట్ అయితే ఉండు.. లేకపోతే నీకు నచ్చింది చేసుకో’ అన్నాను. ఒక తండ్రిగా ఎంత సహకారం అందించాలో అంత చేశా. తనని సోలో హీరోగా పరిచయం చేయొచ్చు. కానీ, ఒక మంచి పాత్ర ద్వారానే తెలుగు ప్రేక్షుకులకు దగ్గరవ్వాలని ‘ఓ పిట్టకథ’ సినిమా చేశాడు’’ అన్నారు నటుడు బ్రహ్మాజీ. విశ్వంత్ దుద్దంపూడి, సంజయ్, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. చెందు ముద్దు దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ– ‘‘ఓ పిట్టకథ’లో అమలాపురంలో ఉండే ఒక ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ పాత్రలో నటించాను. నా పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ఒక అమ్మాయి అదృశ్యం అవుతుంది.. ఎలా అదృశ్యం అయింది? అనే కోణంలో నా పాత్ర సాగుతుంది. ఈ సినిమాలో మంచి స్క్రీన్‌ప్లే ఉంది. తెలుగులో ఇంతవరకూ ఇలాంటి స్క్రీన్‌ప్లే రాలేదు. థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయి. నేను యంగ్‌గా కనిపించడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు.. జీ¯Œ ్స ప్రభావం అంతే. ఇండస్ట్రీలో అందరి హీరోలతో మంచి బంధాల్ని కొనసాగిస్తున్నాను. హీరోలందరూ ఫ్రెండ్సే. కలిసి పార్టీలు చేసుకుంటాం.. అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉంటారు. ‘ఓ పిట్టకథ’ సినిమాని దర్శకులు కృషవంశీ, అనిల్ రావిపూడి, మేర్లపాక గాంధీ, హను రాఘవపూడి.. వంటి వారు చూశారు.. వాళ్లకి బాగా నచ్చింది.. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
కష్టపడితే స్టార్లు అవుతారు
‘‘ఇప్పటి యువతరానికి నేను చెప్పేది ఒక్కటే. 100శాతం కష్టపడండి.. నమ్మకంతో ఉండండి.. విజయం సాధిస్తారు. సునీల్‌లాంటి వాళ్లు కూడా మనకి ఎంతో స్ఫూర్తి. మేము ఇక్కడికి(ఇండస్ట్రీకి) రాలేమోమో? ఇక్కడ రాణించలేమేమో? అంటూ భయపడాల్సిన పరిస్థితి లేనే లేదు. ఎవరు ఏం అనుకున్నా అకుంఠిత దీక్షతో మన లక్ష్యం వైపు దూసుకెళ్లిపోండి.. ప్రతి ఒక్కరూ ఇక్కడ సూపర్స్టార్లు.. మెగాస్టార్లు అవుతారు’’ అని హీరో చిరంజీవి అన్నారు. విశ్వాంత్ దుద్దుంపూడి, నిత్యాశెట్టి, సంజయ్రావు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. ‘ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. చెందు ముద్దు దర్శకత్వంలో వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పరిస్థితులు చాలా మారిపోయాయి.. కేరవ్యాన్ లాంటి సౌకర్యాలు అవసరానికి వాడుకోవాలే కానీ విలాసాలకు కాదు. ఈ విషయాల్లో మార్పు రావాలి. హీరో, హీరోయిన్ లొకేషన్లో ఉన్నప్పుడే పనికి న్యాయం చేస్తున్నట్లు. కొరటాల శివ దర్శకత్వంలో నేను చేస్తున్న ‘ఆచార్య’ సినిమా ఉదయం 7గంటలకు షూటింగ్ అంటే ఆ టైమ్‌కి నేను మేకప్‌తో రెడీగా ఉంటున్నా.. నిర్మాతల సంతోషాన్ని చూడాల్సిన బాధ్యత నటీనటులందరిది. చిన్న సినిమాలకు థియేటర్ల కొరత, సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్‌గారు ఆదేశించడంతో నేను, నాగార్జున, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కలిసి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం’’ అన్నారు. చందు ముద్దు మాట్లాడుతూ– ‘‘ఓ పిట్టకథ’ని ముందుకు తీసుకెళ్లిన బ్రహ్మాజీ, ఆనంద్ ప్రసాద్‌గార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘నిండు మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన చిరంజీవిగారికి మేం రుణపడి ఉంటాం’’ అన్నారు వి. ఆనంద్ ప్రసాద్. ఈ వేడుకలో హీరోలు సందీప్ కిషన్, ఆనంద్ దేవరకొండ, సత్యదేవ్, నటులు సునీల్, బ్రహ్మాజీ, ఉత్తేజ్, నటీమణులు అనసూయ, వర్ష, కెమెరామేన్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
వెంకటలక్ష్మి అదృశ్యం
విశ్వాంత్ దుద్దుంపూడి, నిత్యాశెట్టి, నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్రావు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. ‘ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెందు ముద్దు మాట్లాడుతూ– ‘‘ముక్కోణపు ప్రేమకథగా రూపొందిన చిత్రమిది.. వినోదం కూడా ఉంటుంది. వెంకటలక్ష్మి అనే యువతి అదృశ్యం అవుతుంది.. దానికి కారణాలేంటి? అనేది ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచుతుంది. సెన్సార్ నుంచి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ వచ్చింది’’ అన్నారు. ‘‘ఇప్పటివరకూ తెలుగు తెరపై రాని కథతో నిర్మించిన చిత్రమిది. తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంటుంది’’ అన్నారు నటుడు బ్రహ్మాజీ. ‘‘నా కెరీర్‌ని మంచి మలుపు తిప్పే చిత్రం ‘ఓ పిట్టకథ’’ అన్నారు నిత్యాశెట్టి. ‘‘అందరం స్నేహితుల్లా కలసిపోయి ఈ సినిమా చేశాం’’ అన్నారు సంజయ్రావు. ‘‘ఈ సినిమా నన్ను మరో మెట్టు పైకి ఎక్కిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు విశ్వాంత్. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది’’ అన్నారు ఆనంద్ ప్రసాద్. -
పెద్దవంశీ స్టయిల్లో...
బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్, విశ్వంత్, నిత్యా శెట్టి ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. చెందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. మార్చి 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘ఏమైపోతానే మనసిక ఆగేలాలేదే...’ పాటను పూజా హెగ్డే విడుదల చేశారు. ఈ పాటకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ‘‘ఈ పాట వెనక ఓ కథ ఉంది. మొదట విజువల్స్ చిత్రీకరించి, ఆ తర్వాత ట్యూన్ కంపోజ్ చేయడం జరిగింది. గతంలో వంశీగారు ‘లేడీస్ టైలర్’కి అలా చేశారు. మా ప్రయోగం కూడా ఆకట్టుకుంటుంది అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత ఆనంద్ ప్రసాద్. ‘‘ప్రతీ సన్నివేశం కడుపుబ్బా నవ్వించడమే కాకుండా ఉత్కంఠను రేపుతుంది’’ అన్నారు దర్శకుడు చందు. ఈ సినిమాకు సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: సునీల్ కుమార్ యన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి. -
పిట్టకథే కానీ పెద్ద కథ
‘‘పిట్టకథ టైటిల్ చాలా బాగుంది. ఇండస్ట్రీలో ఈ మధ్య పిట్టకథ గురించే చర్చ జరుగుతోంది. ఇది పిట్టకథే కానీ చాలా పెద్ద కథ అని నమ్ముతున్నాను. ‘ఓ పిట్టకథ’ ఈ వేసవిలో ప్రేక్షకులకు చల్లటి ఉపశమనం ఇస్తుంది’’ అని డైరెక్టర్ కొరటాల శివ అన్నారు. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేష¯Œ ్స పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా క్యారెక్టర్స్ పోస్టర్‌ను కొరటాల శివ ఆవిష్కరించారు. చెందు ముద్దు మాట్లాడుతూ– ‘‘ఒక పల్లెటూరులో జరిగే కథ ఇది. వినోదం, ఉత్కంఠను రేకెత్తిస్తుంది’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు వి.ఆనందప్రసాద్. ‘‘మార్చిలో సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి. ఈ చిత్రానికి కెమెరా: సునీల్ కుమార్ య¯Œ , సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
‘నువ్వు తోపురా’ మూవీ రివ్యూ
టైటిల్ : నువ్వు తోపురా జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : సుధాకర్ కోమాకుల, నిత్య శెట్టి, నిరోషా, వరుణ్ సందేశ్ సంగీతం : సురేష్ బొబ్బిలి, పీఏ దీపక్ దర్శకత్వం : బి. హరినాథ్ బాబు నిర్మాత : శ్రీకాంత్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలో నాగరాజు పాత్రలో తెలుగు తెరకు పరిచయం అయిన నటుడు సుధాకర్ కోమాకుల. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ నటుడు సోలో హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం నువ్వు తోపురా. అమెరికా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాకు హరినాథ్ బాబు దర్శకుడు. తొలి సినిమాతో పక్కింటి అబ్బాయిగా కనిపించిన సుధాకర్ ఈ సినిమాలో హీరోయిజం చూపించే ప్రయత్నం చేశాడు. మరి సోలో హీరోగా సుధాకర్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు.? నువ్వు తోపురా అనిపించుకున్నాడా..? కథ : సూరి (సుధాకర్ కోమాకుల) బీటెక్ మధ్యలోనే ఆపేసి హైదరాబాద్, సరూర్ నగర్ గల్లీల్లో అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవటం, తల్లి (నిరోష) ఉద్యోగం కారణంగా తనతో ఎక్కువ సమయం గడపలేకపోవటంతో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ జులాయిగా తయారవుతాడు. కుటుంబం అంటే పట్టని సూరి, రమ్య (నిత్య శెట్టి) అనే అమ్మాయికి దగ్గరవుతాడు. కానీ కొన్ని కారణాల వల్ల రమ్య కూడా సూరిని వదిలేసి అమెరికా వెళ్లిపోతుంది. అదే సమయంలో అమెరికాలోని తెలుగు అసోషియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో డప్పులు వాయించడానికి సూరికి అవకాశం వస్తుంది. రమ్య మీద కోపంతో వెంటనే అమెరికా వెళ్లేందుకు ఒప్పుకుంటాడు సూరి. అలా అమెరికా వెళ్లిన సూరి ఎలాంటి కష్టాలు అనుభవించాడు.? సూరికి డ్రగ్ మాఫియాతో ఎందుకు పోరాడాల్సి వచ్చింది..? అమెరికా జీవితం సూరిలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది? అన్నదే మిగతా కథ. నటీనటులు : లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్లో నాగరాజు పాత్రలో ఈజీగా నటించేసిన సుధాకర్, ఈ సినిమాలో వేరియేషన్స్ చూపించటంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. బిందాస్ కుర్రాడిగా ఆకట్టుకున్నా.. ఎమోషనల్ సీన్స్‌లో అంతగా మెప్పించలేకపోయాడు. కామెడీ, డైలాగ్స్ డెలివరీతో మాత్రం మంచి మార్కులు సాధించాడు. ముఖ్యంగా తెలంగాణ యాసలో సుధాకర్ చెప్పిన డైలాగ్స్ అలరిస్తాయి. బాలనటిగా ఆకట్టుకున్న నిత్య శెట్టి హీరోయిన్ గా మెప్పించలేక పోయిందనే చెప్పాలి. నటనకు పెద్దగా స్కోప్ లేకపోవటం కూడా నిత్యకు మైనస్ అయ్యింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన నిరోష పెద్దగా ప్రాదాన్యం లేని పాత్రలో నటించింది. ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఒకప్పుడు లవర్ బాయ్‌గా ఆకట్టుకున్న వరుణ్ సందేశ్ ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. అమెరికాలో సూరికి సాయపడే పాత్రలో వరుణ్ బాగానే నటించాడు. ఇతర నటీనటులు తమ పాత్రలో పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు సుధాకర్ కోమాకుల యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ ఇలా అన్నీ ఉన్న కథనే ఎంచుకున్నాడు. అయితే ఆ కథను వెండితెర మీదకు తీసుకురావటంతో దర్శకుడు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. తొలి భాగం అంతా అసలు కథలోకి వెళ్లకుండా హీరో హీరోయిన్ల మధ్య లవ్ సన్నివేశాలు, హీరో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే సీన్స్‌తో నడిపించేశాడు దర్శకుడు. అయితే లవ్ సీన్స్ పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటంతో ఫస్ట్ హాఫ్ బోరింగ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో అసలు కథ మొదలవ్వటంతో కథ కాస్త ఆసక్తికరంగా మారుతుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కంటతడిపెట్టిస్తాయి. అయితే అదే స్థాయిలో కథను నడిపించటంలో దర్శకుడు తడబడ్డాడు. హీరో జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా దేన్ని అంత గ్రిప్పింగా చూపించలేకపోయాడు. ఒక్క హీరో పాత్ర తప్ప మరే పాత్ర బలంగా లేకపోవటం కూడా నిరాశకలిగిస్తుంది. సెకండ్ హాఫ్లోనూ కొన్ని అనవసర సన్నివేశాలు విసిగిస్తాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సాగటం కూడా మైనస్సే. సురేష్ బొబ్బిలి, పీఏ దీపక్‌ల సంగీతం పరవాలేదు. అజ్జు మహంకాళి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ప్రకాష్ వేలాయుధన్, వెంకట్ సీ దిలీప్‌ల సినిమాటోగ్రపి బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథ కొన్ని డైలాగ్స్ కొన్ని ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్ క్యారెక్టరైజేషన్స్ బలమైన ప్రతినాయకుడు లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
అది ఫిల్మ్ స్కూల్.. ఇది వర్క్‌షాప్
‘‘దర్శకులు శేఖర్ కమ్ములగారి ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో నాగరాజు క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పటికీ నన్ను కొందరు నాగరాజు అనే పిలుస్తున్నారు’’ అన్నారు సుధాకర్ కోమాకుల. హరినాథ్ బాబు. బి దర్శకత్వంలో సుధాకర్ కోమాకుల, నిత్యా శెట్టి జంటగా డి. శ్రీకాంత్ నిర్మించిన చిత్రం ‘నువ్వు తోపురా’. జేమ్స్ వాట్ సహ–నిర్మాత. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ– ‘‘మాది వైజాగ్. పీజీ పూర్తి చేశాను. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమా తర్వాత ‘ఉందిలే మంచి కాలం, కుందనపు బొమ్మ’ సినిమాల్లో నటించాను. ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల స్పందన లభించలేదు. ఇప్పుడు మంచి కంటెంట్ ఉన్న ‘నువ్వు తోపురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఇందులో సరూర్‌నగర్ సూర్య అనే క్యారెక్టర్ చేశాను. మంచి పెయిన్ ఉన్న క్యారెక్టర్. గల్లీల్లో అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు అమెరికా వెళ్తాడు. అక్కడ ఎలాంటి అనుభవాలు, పరిస్థితులు ఎదుర్కొన్నాడు? వాటి వల్ల అతనిలో వచ్చిన మార్పు ఏంటి? అన్న అంశాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే హీరోకి, అతని తల్లికి మధ్య సన్నివేశాలు భావోద్వేగభరితంగా ఉంటాయి. ఈ సినిమా దర్శకుడు హరినాథ్‌తో నాకు ముందు నుంచే పరిచయం ఉంది. ఇంతకుముందు రెండు కథలు విన్నాను కానీ మా కాంబినేషన్లో సినిమా కుదర్లేదు. ఇప్పటికి కుదిరింది. అమెరికాలో దాదాపు రెండు నెలలు షూటింగ్ చేశాం. డి. శ్రీకాంత్, జేమ్స్‌వాట్ దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. ఈ సినిమాకు నేను క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వర్క్ చేశాను. ‘లైఫ్ ఈజ్ బ్యూటీపుల్’ ఫిల్మ్ స్కూల్లా అనిపిస్తే.. ఈ సినిమా వర్క్షాప్లా అనిపించింది. ఆడియన్స్‌తో ‘నువ్వు తోపురా’ అనిపించుకోవాలన్నదే హీరో తపన. అలాగే ఈ సినిమాలో ఓ సర్ప్రైజ్ క్యారెక్టర్ ఉంది’’ అని అన్నారు. ఇంకా సుధాకర్ మాట్లాడుతూ– ‘‘మంగళగిరిలో మా టీమ్ రోడ్డు ప్రమాదానికి గురవడం నాకు చాలా బాధ కలిగించింది. కారు నడిపింది నేను కాదు. ఈ దురదృష్టకర సంఘటనలో మరణించిన లక్ష్మీ కుటుంబానికి ఐదులక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించాలని టీమ్ నిర్ణయించింది’’ అ ని చెప్పుకొచ్చారు. -
కారు నడిపింది నేను కాదు
సుధాకర్ కోమాకుల, నిత్యాశెట్టి జంటగా హరినాథ్ బాబు.బి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నువ్వు తోపురా’. డి. శ్రీకాంత్ నిర్మించిన ఈ సినిమా మే 3న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా శనివారం గుంటూరు వెళుతుండగా చిత్రబృందం ప్రయాణిస్తున్న కారు మంగళగిరి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుధాకర్ కోమాకులతో పాటు యూనిట్ సభ్యులు గాయాలపాలయ్యారు. వీరి కారు ఢీకొని ఓ కార్మికురాలు మృతి చెందారు. ఈ ప్రమాదం గురించి హరినాథ్‌బాబు మాట్లాడుతూ– ‘‘భగవంతుడి ఆశీస్సుల వల్లే క్షేమంగా బయటపడ్డాం. సీటు బెల్టే మమ్మల్ని రక్షించింది. మా తప్పిదం లేకపోయినా ఓ నిండు ప్రాణం పోవడం కలచివేసింది. ప్రమాదంలో మరణించిన లక్ష్మి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తాం’’ అన్నారు. ‘‘నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు. ఇంకా షాక్‌లోనే ఉన్నాను. కారులో నేను ప్యాసింజర్ సీటులో కూర్చున్నాను. అనుకోకుండా మా కారు ట్రాక్టర్‌ను ఢీ కొనడంతో నా చేతులతో పాటు తలకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారును నేనే డ్రైవ్ చేశానంటూ కొందరు అసత్య వార్తలు రాశారు. దీంతో అమెరికాలో ఉన్న నా భార్య బాధపడింది. ఇలాంటి వార్తలతో మా కుటుంబాల్ని ఇబ్బంది పెట్టొద్దు’’ అన్నారు సుధాకర్. సహనిర్మాత జేమ్స్ వాట్ కొమ్ము, హీరోయిన్ నిత్యాశెట్టి, నిర్మాత శ్రీకాంత్ పాల్గొన్నారు. -
నువ్వు మాస్‌రా...
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల హీరోగా నటించిన చిత్రం ‘నువ్వు తోపురా’. హరినాథ్ బాబు.బి దర్శకత్వంలో బేబి జాహ్నవి సమర్పణలో యునైటెడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఎస్.జె.కె.ప్రొడక్షన్స్ (యు.ఎస్.ఎ) వారి సహకారంతో డి.శ్రీకాంత్ నిర్మించారు. గీతా ఆర్ట్స్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది. బి.హరినాథ్ మాట్లాడుతూ– ‘‘మాస్, థ్రిల్లర్ కంటెంట్‌తో తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘మా చిత్రం గీతా ఆర్ట్స్, జి3 ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా విడుదలవుతుండం ఆనందంగా ఉంది. ఇందుకు అల్లు అరవింద్‌గారికి, ‘బన్ని’ వాసుగారికి థ్యాంక్స్’’ అన్నారు శ్రీకాంత్. ‘‘అమెరికాలోని అత్యంత అందమైన ప్రదేశాలైన సాల్ట్ లేక్ సిటీ, ప్రొవో తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న చిత్రమిది. మంచి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం’’ అని చిత్ర సహ నిర్మాత డా.జేమ్స్ వాట్ కొమ్ము(యు.ఎస్.ఎ) అన్నారు. నిత్యాశెట్టి, నిరోషా, రవివర్మ, శ్రీధరన్, దివ్యా రెడ్డి, ‘జెమిని’ సురేష్, దువ్వాసి మోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్: రితేష్ కుమార్, కెమెరా: ప్రశాష్ వేళాయుధన్, వెంకట్ సి.దిలీప్, సంగీతం: సురేష్ బొబ్బలి, ఆమెరికా లైన్ ప్రొడ్యూసర్: స్టెపెనీ ఒల్లర్టన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవివర్మ దంతులూరి. -
ఆ ఫొటోషూట్ వల్ల చాన్స్ వచ్చింది
‘‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాకి నేను ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు సుధాకర్ నన్ను బాగా రిసీవ్ చేసుకొని సపోర్ట్ చేసాడు. అతను చేసిన ఫొటోషూట్ స్టిల్స్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాకి నాకు ఛాన్స్ రావడానికి కారణం. ‘నువ్వు తోపురా’ మూవీ లైన్ విన్నప్పుడే పెద్ద హిట్ అనే ఫీలింగ్ కలిగింది. ట్రైలర్ చాలా బాగుంది. టికెట్స్ కొని మా ఫ్యామిలీతో ఈ సినిమా చూస్తా’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. సుధాకర్ కోమాకుల, నిత్యా శెట్టి జంటగా నిరోషా ముఖ్య పాత్రలో హరినాథ్ బాబు బి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నువ్వు తోపురా’. బేబీ జాహ్నవి సమర్పణలో డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ని విజయ్ దేవరకొండ విడుదల చేశారు. హీరో సుధాకర్ మాట్లాడుతూ– ‘‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా తర్వాత చాలా అవకాశాలొచ్చినా కొన్ని కారణాల వల్ల చేయలేదు. యారొగెంట్‌గా ఉండే ఓ కుర్రాడు అమెరికా వెళ్లి జీవితంలో ఎలా ఎదిగాడు అన్నది మెయిన్ స్టోరీ’’ అన్నారు. ‘‘కృష్ణవంశీ, వైవీఎస్ చౌదరిగార్ల వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేసాను. నా తొలి సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు’’ అన్నారు హరినాథ్ బాబు. ‘‘ప్రతి మనిషి జీవితంలో జరిగిన స్టోరీ ఇది’’ అన్నారు నిర్మాత డి.శ్రీకాంత్. ‘‘12 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో నటిస్తున్నాను. పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలిగింది’’ అన్నారు నటి నిరోషా. చిత్ర కథానాయిక నిత్యా శెట్టి పాల్గొన్నారు. -
హాలీవుడ్ కాన్సెప్ట్‌తో...
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‘ ఫేమ్ సుధాకర్ హీరోగా హరనాథ్ బాబు.బి దర్శకత్వంలో యునైటెడ్ ఫిలింస్ బ్యానర్ పై డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న చిత్రం ‘నువ్వు తోపురా’. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా హీరో సుధాకర్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నా క్యారెక్టర్ అన్ని ఎమోషన్స్‌తో కూడి ఉంటుంది. యూత్ తమని తాము చూసుకునే రోల్ ఇది. ఫస్ట్ సినిమా అయినా కూడా మంచి సినిమా అందించాలని నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ సినిమా నాకు మంచి పేరు తీసుకు వస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.‘‘ఈ సినిమాను 70 శాతం అమెరికాలో, 30 శాతం ఇండియాలో షూట్ చేశాం. హాలీవుడ్ కాన్సెప్ట్‌తో దర్శకుడు హరినాథ్ రూపొందించాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత శ్రీకాంత్. -
క్లాసురా.. మాసురా!
హీరో లుక్, టైటిల్ ఊర మాస్... దర్శక–నిర్మాతలు చెబుతున్న వివరాలు క్లాస్... మరి, సినిమా ఎలా ఉంటుందో చూడాలి! ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల హీరోగా బి. హరినాథ్‌బాబు దర్శకత్వంలో డి. శ్రీకాంత్ నిర్మిస్తున్న సినిమా ‘నువ్వు తోపురా’. నిత్యా శెట్టి హీరోయిన్.శుక్రవారం హీరో ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘కృష్ణవంశీ, వైవీయస్ చౌదరిల శిష్యుడైన హరినాథ్‌బాబు హాలీవుడ్ తరహా కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మే 23న చిత్రీకరణ ప్రారంభమైంది. అమెరికాలో 70 శాతం, ఇండియాలో 30 శాతం చిత్రీకరణ జరుపుతాం. ఈ నెల 9న టీజర్ విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత. ఈ సినిమాకు కథ–మాటలు: అజ్జు మహంకాళి, ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి, సౌండ్ డిజైనర్: పీఏ దీపక్, సమర్పణ: బేబి జాహ్నవి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దంతులూరి వర్మ, అమెరికా ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జేమ్స్ కొమ్ము, సహ నిర్మాత: రితేశ్‌కుమార్. -
లేడీ డెరైక్టర్స్‌లో ఆ ప్రత్యేకత ఉంది!
‘‘స్టార్స్ సినిమాలకు వర్క్ చేసేటప్పుడు ఇమేజ్ను దృష్టిలో పెట్టుకోవాలి. కానీ, చిన్న సినిమాలకు ఫ్రీడమ్ ఉంటుంది. అలాంటి అవకాశం ఈ సినిమాతో దొరికింది’’ అని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. కార్తీక్ రాజు, నిత్యా శెట్టి, సామ్ ముఖ్య తారలుగా స్వీయ దర్శకత్వంలో చునియా నిర్మించిన ‘పడేసావే’కి ఆయన పాటలు స్వరపరిచారు. ఈ నెల 26న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ - ‘‘ ‘మనం’ సినిమాతో నాకు నాగార్జున గారితో మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన అసోసియేట్ అయిన ‘పడేసావే’ చేయడానికి అది కారణం కాదు. దర్శకురాలు చునియా చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా ఒప్పుకున్నాను . ప్రేమ, స్నేహం లాంటి అంశాలను చునియా వైవిధ్యంగా తెర మీద ప్రెజెంట్ చేశారు. డెరైక్షన్ విషయంలో ఆడ అయినా, మగ అయినా ఒకటే. అయితే లేడీ డెరైక్టర్స్‌లో సెన్సిటివిటీ కనబడుతుంది. పాటలు విన్న నాగార్జున గారు ‘చిన్న సినిమా అని కమర్షియల్‌గా ఆలోచించకుండా మంచి ఔట్పుట్ ఇచ్చావ’ని మెచ్చుకున్నారు’’ అని చెప్పారు. ఇటీవల మరణించిన తన తల్లిని గుర్తు చేసుకుంటూ... ‘‘నా లైఫ్‌లో జరిగిన ప్రతి ఇంటర్వ్యూనూ మా అమ్మ నా పుట్టినరోజు కానుకగా 2015లో ప్రెజెంట్ చేసింది. అదే తన చివరి కానుక అని కలలో కూడా అనుకోలేదు’’ అని అనూప్ ఒకింత బాధగా అన్నారు. -
నాకు నాగార్జున అంటే చాలా ఇష్టం
‘‘బాల నటిగా చేసినప్పుడు షూటింగ్ లొకేషన్లో అందరూ గారాబం చేసేవాళ్లు. బోల్డన్ని చాక్లెట్లు ఇచ్చేవాళ్లు. అప్పుడెంతో ఇష్టంగా చాక్లెట్లు తిన్న నేను ఇప్పుడు మాత్రం వాటికి దూరంగా ఉంటున్నా. హీరోయిన్ అంటే స్లిమ్‌గా ఉండాలి కదా’’ అని నవ్వుతూ అన్నారు నిత్యాశెట్టి. కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, సమీర ప్రధాన పాత్రల్లో అయాన్ క్రియేషన్స్ పతాకంపై చునియా దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘పడేసావే’. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిత్యాశెట్టి చెప్పిన ముచ్చట్లు... ఇదొక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. ఇందులో నీహారిక పాత్రలో నటించాను. ఇందులో మాది చిన్న లవ్‌స్టోరీనే అయినా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ప్రేమ అంటే జిగ్సా పజిల్ లాంటిది. నా మొదటి సినిమాకే అనూప్ రూబెన్స్ గారు సంగీతం అందించడంతో చాలా ఆనందంగా ఉంది. చునియా డెరైక్టర్ మాత్రమే కాదు నాకు మంచి ఫ్రెండ్. ఆమెతో పనిచేయడం కంఫర్టబుల్‌గా ఫీలయ్యా. కార్తీక్ సెట్స్‌లో ఎంతో ఫన్ చేసేవాడు. ఈ చిత్రంలో ఇంకో కథానాయికగా నటించిన సమీర నాకు మంచి ఫ్రెండ్ అయింది. కాశ్మీర్ అమ్మాయి అయినా తెలుగు రాకపోయినా చక్కగా డైలాగ్స్ చెప్పింది. మా ఇద్దరి పాత్రలకీ సమాన ప్రాధాన్యం ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి నాగార్జునగారంటే చాలా ఇష్టం. ఆయన ఈ చిత్రంలో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ చిత్రం నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ సరసన ‘శోభన్‌బాబు’ సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యా. అలాగే తమిళంలో కూడా ఓ సినిమా చేస్తున్నా.