టైటిల్ : నువ్వు తోపురా
జానర్ : యాక్షన్ డ్రామా
తారాగణం : సుధాకర్ కోమాకుల, నిత్య శెట్టి, నిరోషా, వరుణ్ సందేశ్
సంగీతం : సురేష్ బొబ్బిలి, పీఏ దీపక్
దర్శకత్వం : బి. హరినాథ్ బాబు
నిర్మాత : శ్రీకాంత్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలో నాగరాజు పాత్రలో తెలుగు తెరకు పరిచయం అయిన నటుడు సుధాకర్ కోమాకుల. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ నటుడు సోలో హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం నువ్వు తోపురా. అమెరికా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు హరినాథ్ బాబు దర్శకుడు. తొలి సినిమాతో పక్కింటి అబ్బాయిగా కనిపించిన సుధాకర్ ఈ సినిమాలో హీరోయిజం చూపించే ప్రయత్నం చేశాడు. మరి సోలో హీరోగా సుధాకర్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు.? నువ్వు తోపురా అనిపించుకున్నాడా..?
కథ :
సూరి (సుధాకర్ కోమాకుల) బీటెక్ మధ్యలోనే ఆపేసి హైదరాబాద్, సరూర్ నగర్ గల్లీల్లో అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవటం, తల్లి (నిరోష) ఉద్యోగం కారణంగా తనతో ఎక్కువ సమయం గడపలేకపోవటంతో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ జులాయిగా తయారవుతాడు. కుటుంబం అంటే పట్టని సూరి, రమ్య (నిత్య శెట్టి) అనే అమ్మాయికి దగ్గరవుతాడు. కానీ కొన్ని కారణాల వల్ల రమ్య కూడా సూరిని వదిలేసి అమెరికా వెళ్లిపోతుంది.
అదే సమయంలో అమెరికాలోని తెలుగు అసోషియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో డప్పులు వాయించడానికి సూరికి అవకాశం వస్తుంది. రమ్య మీద కోపంతో వెంటనే అమెరికా వెళ్లేందుకు ఒప్పుకుంటాడు సూరి. అలా అమెరికా వెళ్లిన సూరి ఎలాంటి కష్టాలు అనుభవించాడు.? సూరికి డ్రగ్ మాఫియాతో ఎందుకు పోరాడాల్సి వచ్చింది..? అమెరికా జీవితం సూరిలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్‌లో నాగరాజు పాత్రలో ఈజీగా నటించేసిన సుధాకర్, ఈ సినిమాలో వేరియేషన్స్ చూపించటంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. బిందాస్ కుర్రాడిగా ఆకట్టుకున్నా.. ఎమోషనల్ సీన్స్‌లో అంతగా మెప్పించలేకపోయాడు. కామెడీ, డైలాగ్స్ డెలివరీతో మాత్రం మంచి మార్కులు సాధించాడు. ముఖ్యంగా తెలంగాణ యాసలో సుధాకర్ చెప్పిన డైలాగ్స్ అలరిస్తాయి. బాలనటిగా ఆకట్టుకున్న నిత్య శెట్టి హీరోయిన్ గా మెప్పించలేక పోయిందనే చెప్పాలి. నటనకు పెద్దగా స్కోప్ లేకపోవటం కూడా నిత్యకు మైనస్ అయ్యింది.
చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన నిరోష పెద్దగా ప్రాదాన్యం లేని పాత్రలో నటించింది. ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఒకప్పుడు లవర్ బాయ్‌గా ఆకట్టుకున్న వరుణ్ సందేశ్ ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. అమెరికాలో సూరికి సాయపడే పాత్రలో వరుణ్ బాగానే నటించాడు. ఇతర నటీనటులు తమ పాత్రలో పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ :
హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు సుధాకర్ కోమాకుల యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ ఇలా అన్నీ ఉన్న కథనే ఎంచుకున్నాడు. అయితే ఆ కథను వెండితెర మీదకు తీసుకురావటంతో దర్శకుడు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. తొలి భాగం అంతా అసలు కథలోకి వెళ్లకుండా హీరో హీరోయిన్ల మధ్య లవ్ సన్నివేశాలు, హీరో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే సీన్స్‌తో నడిపించేశాడు దర్శకుడు. అయితే లవ్ సీన్స్ పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటంతో ఫస్ట్ హాఫ్ బోరింగ్‌గా అనిపిస్తుంది.
సెకండాఫ్‌లో అసలు కథ మొదలవ్వటంతో కథ కాస్త ఆసక్తికరంగా మారుతుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కంటతడిపెట్టిస్తాయి. అయితే అదే స్థాయిలో కథను నడిపించటంలో దర్శకుడు తడబడ్డాడు. హీరో జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా దేన్ని అంత గ్రిప్పింగా చూపించలేకపోయాడు. ఒక్క హీరో పాత్ర తప్ప మరే పాత్ర బలంగా లేకపోవటం కూడా నిరాశకలిగిస్తుంది. సెకండ్ హాఫ్‌లోనూ కొన్ని అనవసర సన్నివేశాలు విసిగిస్తాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సాగటం కూడా మైనస్సే. సురేష్ బొబ్బిలి, పీఏ దీపక్‌ల సంగీతం పరవాలేదు. అజ్జు మహంకాళి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ప్రకాష్ వేలాయుధన్, వెంకట్ సీ దిలీప్‌ల సినిమాటోగ్రపి బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కథ
కొన్ని డైలాగ్స్
కొన్ని ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
స్లో నేరేషన్
క్యారెక్టరైజేషన్స్
బలమైన ప్రతినాయకుడు లేకపోవటం
సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment