![Nuvvu Thopu Raa Hero Sudhakar given clarity about accident - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/29/Nuvvu-thopura.jpg.webp?itok=gEJ3Xle_)
జేమ్స్, హరినాథ్ బాబు, సుధాకర్ కోమాకుల, నిత్యాశెట్టి, శ్రీకాంత్
సుధాకర్ కోమాకుల, నిత్యాశెట్టి జంటగా హరినాథ్ బాబు.బి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నువ్వు తోపురా’. డి. శ్రీకాంత్ నిర్మించిన ఈ సినిమా మే 3న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా శనివారం గుంటూరు వెళుతుండగా చిత్రబృందం ప్రయాణిస్తున్న కారు మంగళగిరి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుధాకర్ కోమాకులతో పాటు యూనిట్ సభ్యులు గాయాలపాలయ్యారు. వీరి కారు ఢీకొని ఓ కార్మికురాలు మృతి చెందారు. ఈ ప్రమాదం గురించి హరినాథ్‌బాబు మాట్లాడుతూ– ‘‘భగవంతుడి ఆశీస్సుల వల్లే క్షేమంగా బయటపడ్డాం. సీటు బెల్టే మమ్మల్ని రక్షించింది.
మా తప్పిదం లేకపోయినా ఓ నిండు ప్రాణం పోవడం కలచివేసింది. ప్రమాదంలో మరణించిన లక్ష్మి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తాం’’ అన్నారు. ‘‘నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు. ఇంకా షాక్‌లోనే ఉన్నాను. కారులో నేను ప్యాసింజర్ సీటులో కూర్చున్నాను. అనుకోకుండా మా కారు ట్రాక్టర్‌ను ఢీ కొనడంతో నా చేతులతో పాటు తలకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారును నేనే డ్రైవ్ చేశానంటూ కొందరు అసత్య వార్తలు రాశారు. దీంతో అమెరికాలో ఉన్న నా భార్య బాధపడింది. ఇలాంటి వార్తలతో మా కుటుంబాల్ని ఇబ్బంది పెట్టొద్దు’’ అన్నారు సుధాకర్. సహనిర్మాత జేమ్స్ వాట్ కొమ్ము, హీరోయిన్ నిత్యాశెట్టి, నిర్మాత శ్రీకాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment