సుధాకర్ కోమాకుల
‘‘దర్శకులు శేఖర్ కమ్ములగారి ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో నాగరాజు క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పటికీ నన్ను కొందరు నాగరాజు అనే పిలుస్తున్నారు’’ అన్నారు సుధాకర్ కోమాకుల. హరినాథ్ బాబు. బి దర్శకత్వంలో సుధాకర్ కోమాకుల, నిత్యా శెట్టి జంటగా డి. శ్రీకాంత్ నిర్మించిన చిత్రం ‘నువ్వు తోపురా’. జేమ్స్ వాట్ సహ–నిర్మాత. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ– ‘‘మాది వైజాగ్. పీజీ పూర్తి చేశాను.
‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమా తర్వాత ‘ఉందిలే మంచి కాలం, కుందనపు బొమ్మ’ సినిమాల్లో నటించాను. ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల స్పందన లభించలేదు. ఇప్పుడు మంచి కంటెంట్ ఉన్న ‘నువ్వు తోపురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఇందులో సరూర్‌నగర్ సూర్య అనే క్యారెక్టర్ చేశాను. మంచి పెయిన్ ఉన్న క్యారెక్టర్. గల్లీల్లో అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు అమెరికా వెళ్తాడు. అక్కడ ఎలాంటి అనుభవాలు, పరిస్థితులు ఎదుర్కొన్నాడు? వాటి వల్ల అతనిలో వచ్చిన మార్పు ఏంటి? అన్న అంశాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి.
అలాగే హీరోకి, అతని తల్లికి మధ్య సన్నివేశాలు భావోద్వేగభరితంగా ఉంటాయి. ఈ సినిమా దర్శకుడు హరినాథ్‌తో నాకు ముందు నుంచే పరిచయం ఉంది. ఇంతకుముందు రెండు కథలు విన్నాను కానీ మా కాంబినేషన్‌లో సినిమా కుదర్లేదు. ఇప్పటికి కుదిరింది. అమెరికాలో దాదాపు రెండు నెలలు షూటింగ్ చేశాం. డి. శ్రీకాంత్, జేమ్స్‌వాట్ దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. ఈ సినిమాకు నేను క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వర్క్ చేశాను.
‘లైఫ్ ఈజ్ బ్యూటీపుల్’ ఫిల్మ్ స్కూల్‌లా అనిపిస్తే.. ఈ సినిమా వర్క్‌షాప్‌లా అనిపించింది. ఆడియన్స్‌తో ‘నువ్వు తోపురా’ అనిపించుకోవాలన్నదే హీరో తపన. అలాగే ఈ సినిమాలో ఓ సర్‌ప్రైజ్ క్యారెక్టర్ ఉంది’’ అని అన్నారు. ఇంకా సుధాకర్ మాట్లాడుతూ– ‘‘మంగళగిరిలో మా టీమ్ రోడ్డు ప్రమాదానికి గురవడం నాకు చాలా బాధ కలిగించింది. కారు నడిపింది నేను కాదు. ఈ దురదృష్టకర సంఘటనలో మరణించిన లక్ష్మీ కుటుంబానికి ఐదులక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించాలని టీమ్ నిర్ణయించింది’’ అ ని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment