ఆనంద్ ప్రసాద్, బ్రహ్మాజీ, సంజయ్, చిరంజీవి, నిత్యా శెట్టి, చెందు ముద్దు, విశ్వాంత్
‘‘ఇప్పటి యువతరానికి నేను చెప్పేది ఒక్కటే. 100శాతం కష్టపడండి.. నమ్మకంతో ఉండండి.. విజయం సాధిస్తారు. సునీల్‌లాంటి వాళ్లు కూడా మనకి ఎంతో స్ఫూర్తి. మేము ఇక్కడికి(ఇండస్ట్రీకి) రాలేమోమో? ఇక్కడ రాణించలేమేమో? అంటూ భయపడాల్సిన పరిస్థితి లేనే లేదు. ఎవరు ఏం అనుకున్నా అకుంఠిత దీక్షతో మన లక్ష్యం వైపు దూసుకెళ్లిపోండి.. ప్రతి ఒక్కరూ ఇక్కడ సూపర్‌స్టార్లు.. మెగాస్టార్లు అవుతారు’’ అని హీరో చిరంజీవి అన్నారు.
విశ్వాంత్ దుద్దుంపూడి, నిత్యాశెట్టి, సంజయ్‌రావు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. ‘ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. చెందు ముద్దు దర్శకత్వంలో వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పరిస్థితులు చాలా మారిపోయాయి.. కేరవ్యాన్ లాంటి సౌకర్యాలు అవసరానికి వాడుకోవాలే కానీ విలాసాలకు కాదు. ఈ విషయాల్లో మార్పు రావాలి.
హీరో, హీరోయిన్ లొకేషన్‌లో ఉన్నప్పుడే పనికి న్యాయం చేస్తున్నట్లు. కొరటాల శివ దర్శకత్వంలో నేను చేస్తున్న ‘ఆచార్య’ సినిమా ఉదయం 7గంటలకు షూటింగ్ అంటే ఆ టైమ్‌కి నేను మేకప్‌తో రెడీగా ఉంటున్నా.. నిర్మాతల సంతోషాన్ని చూడాల్సిన బాధ్యత నటీనటులందరిది. చిన్న సినిమాలకు థియేటర్ల కొరత, సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్‌గారు ఆదేశించడంతో నేను, నాగార్జున, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కలిసి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం’’ అన్నారు.
చందు ముద్దు మాట్లాడుతూ– ‘‘ఓ పిట్టకథ’ని ముందుకు తీసుకెళ్లిన బ్రహ్మాజీ, ఆనంద్ ప్రసాద్‌గార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘నిండు మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన చిరంజీవిగారికి మేం రుణపడి ఉంటాం’’ అన్నారు వి. ఆనంద్ ప్రసాద్. ఈ వేడుకలో హీరోలు సందీప్ కిషన్, ఆనంద్ దేవరకొండ, సత్యదేవ్, నటులు సునీల్, బ్రహ్మాజీ, ఉత్తేజ్, నటీమణులు అనసూయ, వర్ష, కెమెరామేన్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment