
స్పైడర్
స్పైడర్ అంటే.... సాలీడు. అది కట్టిన సాలెగూడులో ఎవరైనా పడాల్సిందే. ఈ హీరో కట్టిన స్పైడర్ వెబ్‌లో దొంగల్, దుర్మార్గుల్, రాస్కెల్, క్రిమినల్ అండ్ అదర్స్ ప...డ...క... మానుతారా! మహేశ్‌బాబు సినిమా కథ కోసం ‘స్పైడర్’ అన్న టైటిల్ రిజిస్టర్ అయ్యిందనీ, మా మాటే రైట్ అనీ... అందరూ బూజు దులుపుతున్నారు. బూజు దులుపుతున్నవాళ్లు కొత్త కథల గూళ్లను కూడా కడుతున్నారు. నిజానికి, ఈ రోజుల్లో కథకులు, దర్శకుల కంటే రెండు గూళ్లు ఎక్కువే చదివారు ప్రేక్షకులు.
వాళ్లు చెప్పే కథ ప్రకారం... ‘స్పైడర్’లో మన హీరో మహేశ్ ఓ ‘స్పై’ అట. సూపర్‌స్టార్ ‘గూఢచారి 116’ తర్వాత ఇండస్ట్రీ రికార్డుల గూళ్లను బద్దలుగొట్టే ‘స్పై’ ఇతనేననీ, మఫ్టీలో తిరిగే మస్త్ భాయ్ అనీ టాక్. మఫ్టీలో క్రిమినల్స్‌నే కాదు... హీరోయిన్లను కూడా గిరికీలు తిప్పి తన హార్ట్ వెబ్‌లో తీసుకుంటాడట. రొమాన్స్ అదిరిందట! సెంటిమెంట్ చిక్కగా ఉందట! ఫైట్స్ బాండ్‌ను తలదన్నేలా ఉన్నాయట! సినిమా కథ నిజంగా ఏమై ఉంటుందో మాకు తెలీదు గానీ... కొత్తగా గూఢచర్యం చేస్తే ‘స్పైడర్’ గూడు చెదిరింది.
సరదాగా చదువుకున్నోళ్లకు బోరింగ్ లైఫ్‌లో బూజు కొంచెం వదిలింది. ఏమంటారు...! ఇంతకు ముందు ఈ సినిమాకు ‘ఏజెంట్ శివ’, ‘సంభవామి’, ‘మర్మం’ ఇలా పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. చివరకు, హీరో మహేశ్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ‘ఠాగూర్’ మధులు ‘స్పైడర్’ను ఫిక్స్ చేశారట. ‘ఎన్వీఆర్ సినిమా’ సంస్థ ఫిల్మ్ చాంబర్‌లో ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించింది. త్వరలో ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేస్తారట!