
గన్నుకీ... స్టెతస్కోప్‌కీ..!
అబ్బాయేమో ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అమ్మాయేమో కాబోయే డాక్టర్. ప్రొఫెషనల్ ట్రాక్ వేరైనా లవ్ ట్రాక్ ఈ ఇద్దర్నీ ఒక్కటి చేసింది. గన్‌కు, స్టెతస్కోప్‌కు జోడీ కుదిరింది. ఇంకేముంది? మంచి సాంగ్ పాడుకోవాలనుకుందీ జంట. అంతే.. పాడుకున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘స్పైడర్’లో మహేశ్‌బాబు ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా, రకుల్‌ప్రీత్ సింగ్ మెడికో స్టూడెంట్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి హ్యారీస్ జైరాజ్ పాటలు అందించారు. పైన చెప్పుకున్నదంతా ఈ పాటల్లో ఉన్న ఓ రొమాంటిక్ సాంగ్ గురించే. ఈ పాటను బ్రిజేష్ శాండిల్య పాడారు. అల్లు అర్జున్ ‘సరైనోడు’ కోసం ‘రంగు రంగు సైకిలెక్కి...’ అనే టైటిల్ సాంగ్ తర్వాత తెలుగులో బ్రిజేష్ పాడింది ‘స్పైడర్’ కోసమే. ఈ పాట పాడే అవకాశం చాలా గమ్మత్తుగా వచ్చిందంటున్నారు బ్రిజేష్. ‘‘హడావిడిగా ఉన్న ఓ మార్కెట్‌లో వెళుతున్నప్పుడు హ్యారీస్ సార్ నుంచి ఫోన్ వచ్చింది. మహేశ్‌బాబు ‘స్పైడర్’కి పాడాలన్నారు. కావాలని ఎవరో ఆటపట్టిస్తున్నారని లైట్ తీసుకున్నా.
ఆ తర్వాత ఆ నంబర్‌కి ఫోన్ చేస్తే, అది హారీస్ సార్‌ది అని తెలిసింది. దాంతో ఎగై్జట్. నాకీ పాటకు అవకాశం రావడానికి కారణం రైటర్ రామజోగయ్య శాస్త్రి. ఆయనే నా పేరుని హ్యారీస్‌కి సూచించారు’’ అని బ్రిజేష్ పేర్కొన్నారు. ఇది పక్కా దేశీ రొమాంటిక్ సాంగ్. ‘‘వచ్చే నెల 5న ఈ పాట చిత్రీకరణ మొదలుపెడతాం. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన మూడు భారీ సెట్స్‌లో షూట్ చేయబోతున్న ఈ పాట చాలా గ్రాండ్‌గా ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన పాటను చిత్రీకరిస్తాం. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి’’ అని నిర్మాతల్లో ఒకరైన ‘ఠాగూర్’ మధు తెలిపారు. సెప్టెంబర్ 27న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.